50 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది  | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది 

Published Sat, Apr 18 2020 2:20 AM

She became a Mother again in age the of 50 - Sakshi

అశ్వారావుపేట రూరల్‌: ఐదు పదులు దాటిన వయసులో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన రాములమ్మ, రాముడు దంపతులకు 36 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అనంతరం రాములమ్మకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం రాములమ్మ, రాముడు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం రాములమ్మకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో గ్రామంలోని ఓ ఆశ కార్యకర్త వద్దకు వెళ్లి మాత్ర తెచ్చుకుని వేసుకుంది.

కొద్దిసేపటి తర్వాత నొప్పి అధికం కావడంతో ఇంటి వద్దే ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లి ప్రసవించింది. ఆడబిడ్డ జన్మించింది. గమనించిన కుటుంబీకులు ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె 108 ద్వారా తల్లీబిడ్డలను అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తల్లికి రక్తహీనత.. శిశువు కేవలం 800 గ్రాముల బరువు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ వైద్యురాలు నీలిమను వివరణ కోరగా.. రాములమ్మ పెద్ద వయసులో ప్రసవించడం ఆశ్చర్యకరమేనని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స గురించి ఆమె స్పష్టంగా చెప్పలేకపోతోందని తెలిపారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement