వాస్తు.. వివాదమస్తు | Sakshi
Sakshi News home page

వాస్తు.. వివాదమస్తు

Published Mon, Feb 2 2015 2:14 AM

వాస్తు.. వివాదమస్తు

సచివాలయం తరలింపుపై విపక్షాల మండిపాటు
గతంలోనూ తరలింపునకు పలువురి యత్నాలు
వెనక్కి తగ్గిన అప్పటి ముఖ్యమంత్రులు
ఆనవాయితీగా సాగిన వాస్తు మార్పులు
గేట్లు.. చాంబర్ల మార్పులతో సర్దుబాటు
దోషమున్నా.. ప్రత్యామ్నాయాలున్నాయి: వాస్తు నిపుణులు


సాక్షి, హైదరాబాద్: న్యూయార్క్.. లండన్.. సింగపూర్ తరహాలో స్మార్ట్ సిటీలు... ఆకాశ హర్మ్యాలు.. స్కైవేలు... ఫై్ల ఓవర్‌లు... అన్నింటా అధునాతనం.. అంతర్జాతీయ స్థాయిని తలపించే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వాస్తు దోషం ఉందంటూ సచివాలయాన్ని తరలిస్తుందా..? ఏకంగా రూ.150 కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయం నిర్మిస్తుందా...? రాష్ట్రంలో అందరి నోటా ఇదే హాట్ టాపిక్. ‘సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్లేవరూ ముందర పల్లేదు..’ అని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం నాటి కేబినేట్ భేటీ అనంతరం ప్రకటించారు.

అది మొదలు సచివాలయంలో అధికారులు, ఉద్యోగులందరిలోనూ ఇదే అంశంపై చర్చోపచర్చలు ఆసక్తికరంగా మారాయి. వాస్తు దోషముంటే నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలుంటాయని అదే శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడున్న స్థలంలోనే మార్పులు చేర్పులు చేసుకునే ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ఏకంగా సెక్రెటేరియట్ తరలింపు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ‘సీఎం హోదాలోని వ్యక్తి వాస్తు గురించి మాట్లాడటం.. ప్రజల్లో మూఢ నమ్మకాలను ప్రచారం చేసినట్లయింది. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టుకుంది..’ అని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు సీఎం తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. దీని వెనుక మరేదైనా ఆంతర్యముందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

‘భారత ప్రజల జీవన విధానంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు సిద్ధాంతాన్ని నమ్మడం ఆహ్వానించదగ్గ పరిణామం. సచివాలయానికి వాస్తుదోషం ఉన్న మాట వాస్తవమే. కొన్ని అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి. రాజ ప్రసాదాలు, రాజ భవనాలకు నలు దిక్కులా రోడ్డు ఉండాలనే నియమం కూడా ఉంది. తూర్పున హుస్సేన్ సాగర్ ఉండటంతో పాటు తూర్పు, ఉత్తరాన గేట్లు ఉండటం కూడా మంచిదే. పశ్చిమ నైరుతి భాగం పెరగటం, నైరుతి దిశలో వీధిపోటు, హోంసైన్స్ కాలేజీ, ఆర్‌బీఐ నుంచి వచ్చే రోడ్ల కారణంగా భయంకరమైన దోషాలే ఉన్నాయి. దీంతో పాలకులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కానీ వీటికీ పరిష్కార మార్గాలున్నాయి. నైరుతి దిశలో ఎతై్తన గోడ కట్టి ఈ స్థలాన్ని వేరు చేసే వీలుంది. అటువైపున ఉన్న భవనాన్ని వాడకుండా ఉన్నా దోష నివారణ జరుగుతుంది’ అని వాస్తు నిపుణులు రాచ సురేశ్ అభిప్రాయపడ్డారు.

వాస్తుకు సంబంధించిన నమ్మకం పాలకులకు ఉండడం కొత్తేమీ కాదని, సచివాలయం తరలింపునకు గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులు ప్రయత్నించారని ఒక రిటైర్డ్ అధికారి తెలిపారు. ‘గతంలో సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాంపల్లిలో ఇప్పుడున్న గృహకల్ప స్థలానికి సచివాలయాన్ని మార్చాలని యోచించారు. తీరా ఆ ప్రాంతాన్ని చదునుచేశాక విరమించుకున్నారు. అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరిగింది. విజయభాస్కరరెడ్డి హయాంలో ఇప్పుడు అనుకుంటున్న చెస్ట్ ఆసుపత్రికి తరలించాలనే ప్రయత్నం జరిగింది. కానీ.. చారిత్రక కట్టడాలు ఉన్నాయనే కారణంగా ఉపసంహరించుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రులకు వాస్తుపై ఉన్న నమ్మకం, పండితులు చెప్పిన శాస్త్రం ఆచరించి, గేట్లు, తమ ఛాంబర్లను మార్చుకోవటం ఆనవాయితీగానే కొనసాగింది. అందులో భాగంగా ఇప్పటివరకు సచివాలయానికి మూడు వైపులా గేట్లను మార్చారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు గేట్లు మార్చారు. అయినా  నాదెండ్ల, చంద్రబాబుల వెన్నుపోట్లు ఆయనను వెంటాడాయి. కానీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సీఎంగా ఇదే సచివాలయ కేంద్రంగా సుదీర్ఘంగా తొమ్మిదేళ్లు పాలించారు. రాష్ట్ర విభజనకు ముందు తూర్పున ఉన్న గేటును వాస్తు నమ్మకంతోతెలంగాణ ప్రభుత్వం ఉత్తర దిశలో నిర్మించింది. కనీసం ఈ గేట్ల నిర్మాణం కూడా పూర్తి కాకుండానే సచివాలయాన్ని మార్చాలని ఆకస్మిక నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత వాహనాల రంగు, కేబినెట్‌లో సంఖ్యాబలం, వివిధ పథకాల ముహూర్తాలు ఇలా అన్నింటా ఆయన తనకంటూ సలహాలిచ్చే పండితుల నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారనే వాదనలున్నాయి. సచివాలయం తరలింపు నిర్ణయం అందులో భాగమేనని, త్వరలోనే వాస్తు నిపుణుడు ఒకరిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement