రెండేళ్లలో కష్టాలన్నీ తీరుతాయి | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో కష్టాలన్నీ తీరుతాయి

Published Fri, Jul 28 2017 3:39 AM

రెండేళ్లలో కష్టాలన్నీ తీరుతాయి

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు
 
సాక్షి, సిద్దిపేట: మరో రెండేళ్లలో తెలంగాణ ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ప్రభుత్వ పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, నీటి కోసం బోర్లు వేసి అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది పడవద్దనే ఆలోచనతో కృష్ణా, గోదావరి జలాలను పొలాలకు మళ్లించే చర్యలు చేపట్టామన్నారు. రెండేళ్లలో సాగు, తాగు నీటి కష్టాలు తీరుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. సిద్దిపేటలోని కోమటి చెరువు ఇతర జిల్లాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. ‘కరువు కాటకాలు, ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబ కలహాలు అధికంగా ఉంటాయి.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అత్తపై కోడలుకు.. కోడలుపై అత్తకు ప్రేమలు పెరిగాయి’అని మంత్రి చమత్కరించారు. ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి పెన్షన్, ఆరు కిలోల బియ్యం, ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతో సుఖ ప్రసవాలు, అనంతరం రూ. 12 వేల పారితోషికం అందిస్తోందని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అధిగమించకపోతే వచ్చే తరానికి చీకటే మిగులుతుందని హెచ్చరించారు. వారికి ఎంత ఆస్తి సంపాదించి ఇచ్చామనేది కాదని, ఎంత మంచి వాతావరణం అందచేశామనేది కీలకమన్నారు. 

Advertisement
Advertisement