తెరచుకోని మద్యం డిపోలు | Sakshi
Sakshi News home page

తెరచుకోని మద్యం డిపోలు

Published Wed, Mar 4 2015 1:39 AM

తెరచుకోని మద్యం డిపోలు

సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ అటాచ్‌మెంట్ నోటీసులతో మూతపడ్డ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు మద్యం డిపోలు రెండో రోజూ తెరుచుకోలేదు. మంగళవారం ఎక్సైజ్ శాఖ పలు కారణాలతో హైకోర్టు లో లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేయలేదు. రాత్రి వరకు తెలంగాణ బ్రూవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి, ఇతర అధికారులు కోర్టులోనే ఉన్నా ఫలితం లేకుండాపోయింది. బుధవారం ఎట్టిపరిస్థితుల్లో పిటిషన్ దాఖలు చేసి మద్యం డిపోలను తెరిపించాలనే ఆలోచనలో అధికారులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా మిగతా 8 జిల్లాల్లో మద్యం డిపోల్లో యథాతథంగా మద్యం అమ్మకాలు సాగాయి. రెండు జిల్లాల్లో మద్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఎక్సైజ్ శాఖకు రెండు రోజుల్లో రావల సిన సుమారు రూ.30 కోట్ల రెవెన్యూ రాకుండా పోయింది.

 

కాగా ఆదాయపు పన్ను శాఖ 2012-13 బకాయిలకు సంబంధించే అటాచ్‌మెంట్ నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీబీసీఎల్ (ఉమ్మడి రాష్ట్రంలో) ఐటీ శాఖకు సుమారు రూ. 3 వేల కోట్లు బకాయి పడింది. వీటి వసూలుకే నోటీసులు ఇవ్వడంతో హైదరాబాద్‌లోని రెండు డిపోలు, రంగారెడ్డి జిల్లాలోని 4 డిపోలను అధికారులు మూసివేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. ఇక 2006-11 వరకు రావాల్సిన రూ. 8 వేల కోట్లకు సంబంధించి కోర్టులో వివాదం నడుస్తోంది.
 
 గ్రేటర్‌లో నిండుకున్న మద్యం దుకాణాలు
 
 మద్యం డిపోల నుంచి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 160 మద్యం దుకాణాలు, 225 బార్లలో సరుకు నిండుకుంది. సోమవారం సాయంత్రం నుంచే రిటైల్ దుకాణాల్లో కొరత కన్పించింది. డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఎంఆర్‌పీ ధరలను పట్టించుకోకుండా ఎక్కువ ధరకు అమ్మకాలు సాగాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే అనేక దుకాణాల్లో స్టాక్ నిండుకోవడంతో కేవలం బీర్లను మాత్రమే విక్రయించారు. పలు మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పక్క జిల్లాలు మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ నుంచి స్టాక్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మంత్రి టి.పద్మారావు గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, కమిషనర్ అహ్మద్ నదీంలు రోజంతా పరిస్థితిని సమీక్షించారు. కాగా, తాము ఏడాదికి రూ.90 లక్షలు లెసైన్సు ఫీజు చెల్లించి మద్యం వ్యాపారం చేస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వె ంకటేశ్వరరావు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement