అంగన్‌వాడీలపై వేటుకు వేట! | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై వేటుకు వేట!

Published Mon, Oct 5 2015 4:26 AM

అంగన్‌వాడీలపై వేటుకు వేట! - Sakshi

- క్రమశిక్షణ చర్యల పేరిట  అంగన్‌వాడీలపై వేధింపులు
- ప్రవేశాలు తక్కువ ఉన్న కేంద్రాలను మూసివేయాలని సర్కారు ఆదేశాలు
- ప్లేస్కూళ్లను కట్టడి చేయకుండా ప్రవేశాలెలా పెరుగుతాయంటున్న వర్కర్లు
 
సాక్షి, హైదరాబాద్:
లాలించే మనుషులపై పాలించేవారు వేట మొదలు పెట్టారు. అమ్మగా, ఆయాగా చిన్నారుల ఆలనాపాలనా చూసుకునే అంగన్‌వాడీలపై ప్రభుత్వం వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి అనేక రకాల సాకులను వెతుకుతూ కత్తులు నూరుతోంది. దీనిలో భాగంగా జీవో 14ను వాడుకునేందుకు సిద్ధమైంది.

దీంతో అంగన్‌వాడీలకు ఉద్యోగభద్రత లేకుండా పోతోంది. వారి పరిస్థితి దినదినగండంగా మారుతోంది. ఇటీవల వారికి గౌరవ వేతనం పెంచడంతో ఆర్థికభారం పెరిగిందని, కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఎత్తేసి దీనికి సంబంధించిన లెక్క సరిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్‌వాడీవర్కర్లు, సహాయకుల ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నియామకమైన కార్యకర్తలను తొలగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆయా పోస్టులను తమ వర్గంవారికి ఇప్పించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్నవారిపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

స్థానిక నేతల ఒత్తిడుల మేరకు జీవో 14ను సాకుగా చూపి అంగన్‌వాడీలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. మరోవైపు లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. తగినన్ని ప్రవేశాలు(అడ్మిషన్లు) తీసుకు రాలేకపోయిన ఆయా కేంద్రాల వర్కర్లను, సహాయకులను విధుల నుంచి తొలగించాలని  ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన  అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలను కూడా జీవోలో  పేర్కొంది.

ముందస్తు అనుమతి లేకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు కేంద్రానికి హాజరు కాకున్నా, కేంద్రానికి వచ్చే 3 నుంచి ఆరేళ్ల చిన్నారుల హాజరు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నా తనిఖీ అధికారులు మెమోలు జారీ చేయవచ్చు. ఇలా రెండు, మూడు మెమోలు పొందిన కార్యకర్తలను  జీవో 14 ప్రకారం వెంటనే తొలగించవచ్చు. ఆహార నిల్వకు సంబంధించి భౌతిక, బుక్ బ్యాలెన్స్‌లో తేడా ఉన్నా వెంటనే తొలగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవోలోని ఇలాంటి అంశాలను ఆసరాగా చేసుకొని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు అంగన్‌వాడీ కేంద్రాలపై అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయించి వారి పొట్టగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అంగన్‌వాడీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ప్లేస్కూళ్లను కట్టడి చేయకుండా ప్రవేశాలు ఎలా?
ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ప్లేస్కూళ్లను నియంత్రించకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచడం ఏవిధంగా సాధ్యమవుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల వయస్సున్న చిన్నారులకు అనధికారికంగా అడ్మిషన్లు ఇస్తున్న ఆయా పాఠశాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఇక మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులుండే అంగన్‌వాడీ కేంద్రాలు అన్ని సందర్భాల్లో పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదంటున్నారు.

ఒకరిద్దరు చిన్నారులు ఉండే ఇళ్లలోనే ప్రతిక్షణం పరిశుభ్రంగా ఉంచేందుకు వీలు కాదని, అలాంటప్పుడు 20-30 మంది చిన్నారులు ఉండే చోట కొంత ఇబ్బందులు ఉంటాయంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా అధికారులు శుభ్రత లేదనే సాకుతో తమపై వేటు వేయాలని చూస్తున్నారని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 14ను రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

Advertisement
Advertisement