అన్నదాతల ఉసురు తీస్తున్న అడవి పందులు | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఉసురు తీస్తున్న అడవి పందులు

Published Sat, Mar 7 2015 2:21 AM

Forest Pigs invasion in crops

మెదక్ రూరల్: వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలను సాగుచేస్తే అడవి జంతువులు  పెరిగిన పంటలను పెరిగినట్లే తింటున్నాయి. పంటలను రక్షించుకునేందుకు రాత్రివేళలో చేల వద్దకు కాపలాగా వెళ్లిన అన్నదాతలపై అడవి పందులు దాడి చేసి చంపేస్తున్నాయి. దీంతో పంటలను సాగుచేయాలంటేనే రైతులు జంకుతున్నారు. మెదక్ మండలంలో గాజిరెడ్డిపల్లి, బూర్గుపల్లి, కప్రాయిపల్లి, రాజిపేట, కొత్తపల్లి, శమ్నాపూర్, గంగాపూర్, పాతూరు, బి తిమ్మాయిపల్లి, బ్యాతోల్, జక్కన్నపేట, పోచమ్మరాల్, బొగుడభూపతిపూర్, శాలిపేట, ముత్తాయిపల్లి,  పోచారం తదితర గ్రామాలను ఆనుకొని అడవులు విస్తరించి ఉన్నాయి.  

కాగా ఈ గ్రామాల రైతులు పంటలు సాగు చేయాలంటేనే జంకుతున్నారు. అప్పు చేసి పంటలను సాగు చేస్తే పంటలను అడవి జంతులు పాడు చేస్తున్నాయి. వాటి నుంచి పంటలను రక్షించుకునేందుకు కాపలాగా వెళితే రైతులపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నాయి.  దీంతో అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల రైతులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పంటలు సాగు చేస్తున్నారు. రెండేళ్ల  క్రితం బొగుడభూపతిపూర్ గ్రామానికి చెందిన కాసాల గోపాల్‌రెడ్డి తన మూడెకరాల పొలంలో చెరకు  సాగు చేశాడు.   

పందులు నిత్యం పంటచేనుపై దాడి చేసి  ధ్వంసం చేస్తుండడంతో  కాపలాగా వెళ్లాడు. దీంతో పందులు గుంపుగా వచ్చి చెరక పంటను పాడు చేస్తుండగా గమనించి వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక పంది అతనిపై దాడిచేసింది.   విషయం గమనించిన చుట్టుపక్కల రైతులు  గోపాల్‌రెడ్డిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ఆలస్యం కావడంతో  రైతు మృతిచెందాడు.  ఫారెస్టు అధికారులు నష్టపరిహారంగా మృతుడి కుటుంబానికి రూ.1.50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.    

పందుల దాడిలో గత రెండేళ్లుగా ఎంతో మంది  రైతులు గాయపడ్డారు.ఈనెల 5న, మండల పరిధిలోని  శమ్నాపూర్ గ్రామానికి చెందిన మిజ్జెని కిష్టయ్య మక్కజొన్న పంటకు కాపలాగా వెళితే  అడవిపంది దాడిచేసి గొంతు కొరికిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన చావు బతుకుల  మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల రాజిపేట గ్రామానికి చెందిన  బోల మల్లేశం  రూ. 30 వేల అప్పులు చేసి  మక్కపంటను సాగు చేశారు.  

మరో 20 రోజుల్లో పంటచేతికి అందుతుందనగా వారం రోజుల క్రితం  పందుల గుంపు దాడి చేసి  ఒక్క మక్కబుట్ట కూడా మిగలకుండా పూర్తిగా తినేశాయి. దీంతో ఆయన బోరున విలపిస్తున్నాడు.  ఇలా పంటలకు కాపలాగా వెళ్లిన రైతులను పందులు చంపేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తే నామమాత్రపు పరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement