ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోలాహలం | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోలాహలం

Published Thu, Oct 30 2014 3:18 AM

ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోలాహలం - Sakshi

 నల్లగొండ అర్బన్ : ఎంసెట్-2014 ఇంజినీరింగ్ విభాగంలో తొలి విడత ప్రవేశ అనుమతులు కోల్పోయిన ఇంజినీరింగ్ కాలేజీలకు బుధవారం సుప్రీం కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు తో రెండవ విడత కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. సరైన వసతులు, ఫ్యాకల్టీ తదితర లోపాలను ఎత్తిచూపుతూ జేఎన్‌టీయూ రాష్ట్రంలోని 174 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌కు అవకాశాన్ని కాల్పోయాయి. ఈ విధంగా జిల్లాలో 34 కాలేజీలు ప్రవేశాలకు దూరమయ్యాయి. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ చుక్కెదరుకావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా కాలేజీలకు రెండవ విడత కౌన్సెలింగ్ జరుపుకునేందుకు కోర్టు సమ్మతించడంతో మళ్లీ ప్రవేశాల కోలాహలం మొదలుకానుంది. కోర్టు తీర్పుతో జిల్లాలో దాదాపు 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందవచ్చునని భావిస్తున్నారు.
 
 1500 మందికి ప్రవేశాలు ?
 జిల్లాలో 34 ఇంజినీరింగ్ కాలేజీలు రెండ విడత కౌన్సెలింగ్‌కు అవకాశం లభించడంతో ఆయా కాలేజీల్లో దాదాపు 1500 నుంచి 2వేల మంది విద్యార్థులు చేరుతారని భావిస్తున్నారు. హైదరాబాద్ తదితర పట్టణాల్లో సీట్లు పొంది పరిస్థితుల ప్రభావంతో చేరలేక డిగ్రీ కోర్సుల్లో చేరిన వారంతా తిరిగి ఇంజినీరింగ్ వైపు రాగలరని ఆశిస్తున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావించి ఇప్పటికే ఆయా విద్యార్థుల చిరునామాల వేటలో పడిన కాలేజీల యాజమాన్యాలు అడ్మిషన్లకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలి సింది. అంతే కాకుండా జిల్లాలోని దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడ, భువనగిరి పరిసర ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు మొదటి విడత కౌన్సెలింగ్‌కు ముందే కొందరు విద్యార్థులకు వివిధ రకాల ఆశలు చూపి సర్టిఫికెట్లను, ర్యాంక్ కార్డులను సేకరించాయి. కానీ వారికి మొదటి విడతలో ప్రవేశాలు తీసుకునే అవకాశం లభించకున్నా తరగతులు నిర్వహిస్తున్నాయన్న సమాచారం. ఎలాగూ ఆలస్యంగానైనా అనుమతి లభించగలదనే ధీమాతో వారు తరగతులు కొనసాగించారని తెలిసింది.
 
 నవంబర్ 2వ వారం నాటికి ప్రవేశాలు పూర్తి
 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రెండవ విడత కౌన్సెలింగ్ అవకాశం పొందిన కాలేజీలు నవంబర్ 2వ వారం నాటికి అడ్మిషన్లను భర్తీ చేసుకోవాలి. మూడవ వారం తరగతులు ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్ పరీక్షలను, జూన్ 15 నాటికి రెండవ సెమిస్టర్‌లను పూర్తి చేయాల్సివుంటుంది.
 
 మొదటి విడత కాలేజీలకు నిరాశే..
 జిల్లాలో 41 ఇంజినీరింగ్ కాలేజీలుండగా మొదటి విడతలో ఎంజీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీతో పాటు మరో ఆరు ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ లభించింది. దీంతో వారు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను నిర్వహిస్తున్నారు. కొన్ని కోర్సుల్లో సీట్లు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రెండవ విడతలో అవకాశం వస్తే ఆ సీట్లను భర్తీ చేసుకోవచ్చని ఆశించారు. కానీ సుప్రీం కోర్టు ప్రస్తుతం 34 కాలేజీలకే అవకాశం ఇచ్చింది. వారికి మాత్రమే స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో అవకాశం లభించిన 7 కాలేజీలకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అయితే మొదటి సారి కౌన్సెలింగ్‌కు హాజరై వెబ్‌ఆప్షన్ ఇవ్వనివారు, ఇచ్చినా సదరు కాలేజీకి అఫిలియేషన్ లేక అలాట్‌కాని వారు మాత్రం అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది. కానీ ఇప్పటికే ఏదో ఒక కోర్సులో చేరి తరగతులకు హాజరైన వారు స్లైడింగ్ ద్వారా మరో ప్రాధాన్యత గల కోర్సులోకి చేరాలనుకుంటే మాత్రం అవకాశం లేకుం డా పోయింది. కానీ ఇతర ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరి అనారోగ్య కర పరిస్థితులతో చదువులు కొనసాగించలేకపోయిన వారు, మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా కాలేజీలు మార్చుకునేందుకు అవకాశాలుంటాయని సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement