తప్పుచేస్తే తిప్పలే | The traffic department has a special drive | Sakshi
Sakshi News home page

తప్పుచేస్తే తిప్పలే

Published Sat, May 31 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

The traffic department has a special drive

సాక్షి, ముంబై: రోడ్డు నిబంధనలు పాటించని వాహన చోదకులను పట్టుకునేందుకు ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. గత మూడు రోజుల్లో నగరవ్యాప్తంగా వాహన నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 5,400 మంది వాహనదారులను ట్రాఫిక్ విభాగం గుర్తించి కేసులు నమోదు చేసింది. ‘ఆపరేషన్ ఈగల్’ పేరుతో చేపట్టిన ఈ డ్రైవ్‌లో ఓ ప్రత్యేక బృందం మెరైన్‌డ్రైవ్ వద్ద గత నెల 28 నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది.  ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సమర్థంగా అడ్డుకునేందుకు  గిర్గావ్ చౌపాటీ, నారిమన్ పాయింట్‌ల వద్ద కూడా ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
 
జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 8-8.30 గంటల సమయంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువ కాబట్టి సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలు పెరుగుతాయన్నారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలోనూ ఉల్లంఘనలు ఎక్కువగానే ఉన్నాయని ఉపాధ్యాయ వివరించారు. ఉల్లంఘనలను సమర్థంగా అడ్డుకోవడానికి ‘ఆపరేషన్ ఈగల్’ డ్రైవ్ నిర్వహించే సిబ్బంది మఫ్టీ దుస్తుల్లోనే ఉంటున్నారు. సిగ్నల్‌ను జంప్ చేసిన వారిని గుర్తించి, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నోట్ చేసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 28న ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు.
 
శుక్రవారం వరకు దాదాపు 5,400 మంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించి చలానాలు రాశారు. హెల్మెట్ ధరించకపోవడం,తప్పుడు దిశలో వాహనం నడుపుతున్న వారిని కూడా పట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచించామని ఉపాధ్యాయ వెల్లడించారు. మెరైన్‌డ్రైవ్‌లో నిర్వహిస్తున్న తనిఖీల్లో 12 మంది అధికారులతోపాటు 50 మంది కానిస్టేబుళ్లు విధులు పాల్గొంటున్నారు. వీరు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మెరైన్‌డ్రైవ్ వద్ద నిబంధనలు ఉల్లంఘనలను సున్నాశాతానికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయ స్పష్టీకరించారు.  
 
 ఇదిలా వుండగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపిన 1,459 మందిని,  సిగ్నల్స్ జంప్ చేసిన 921 మంది నేరస్తులను మే 29న పట్టుకున్నారు. వాహనాన్ని తప్పుడు దిశలో నడిపిన 529 మందిని పట్టుకొని చలానాలు రాశారు. 28న కూడా హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపిన 1,031 మందిని, సిగ్నల్స్‌ను జంప్ చేసిన 735 మంది వాహనదారులకు జరిమానా విధించారు.  తప్పుడు దిశలో వాహనం నడిపిన 122 మంది వాహన చోదకులు కూడా ఇదే రోజు పట్టుబడ్డారు. 30, 31 తేదీల్లో కూడా వందలాది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి పట్టుబడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement