చిన్నమ్మ చిర్రుబుర్రు

ఎన్నికల గుర్తు టోపీ పెట్టుకుని దినకరన్‌ ప్రచారం - Sakshi


‘రెండాకులు’ చేజారినందుకు ఆగ్రహం

టోపీ చిహ్నం సిగ్గుసిగ్గు

దినకరన్‌కు చీవాట్లు




సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ చేతుల్లో ఉంది...పరువు పోయింది, రెండాకులు రాలిపోగా చివరకు ‘టోపీ’ మిగిలింది’ అంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లోలోన మదనపడుతున్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇదా నీ నిర్వాకం అంటూ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. జయలలిత రాజకీయ జీవితంలో 32 ఏళ్లపాటు వెన్నంటి నడిచి, నమ్మకంగా నిలిచిన ఫలితంగా అన్నాడీఎంకే చిన్నమ్మ చేతుల్లోకి వచ్చింది. అయితే నిండా నెలరోజులు కాకమునుపే సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఆమె మోజు తీరకుండానే అక్రమ ఆస్తుల కేసులో జైలుపాలయ్యారు.



 నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని బైటకు వచ్చిన తరువాత పార్టీని జాగ్రత్తగా తన చేతుల్లో పెట్టే నమ్మకమైన వ్యక్తి కోసం చిన్నమ్మ సాగించిన అన్వేషణలో ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ మెలిగారు. పార్టీతోపాటు పదవి సైతం ఇచ్చినపుడే పెత్తనం సాధ్యమనే వ్యూహంతో దినకరన్‌కు దాదాపు తనతో సమానమైన హోదాగా ఉప ప్రధానకార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇక తన స్థానంలో నమ్మకస్థుడైన వ్యక్తిని సిద్ధం చేసుకున్నామన్న ధీమాతో చిన్నమ్మ జైలు జీవితాన్ని ప్రారంభించారు.



దినకరన్‌కు సవాళ్లు: అయితే చిన్నమ్మ జైలు కెళ్లిన తరువాతనే దినకరన్‌కు అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. ఎడపాడిని సీఎం చేయడం, విశ్వాస పరీక్షలో నెగ్గేలా ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలను నడిపించడం, ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోని విశ్వాసపరీక్షలో ఎడపాడిని నెగ్గించడం వరకు చకచకా సాగిపోయాయి. అయితే అర్కేనగర్‌లో ఉప ఎన్నికలు దినకరన్‌కు పెనుసవాళ్లు విసిరాయి. రెండాకుల చిహ్నంకై శశికళ, పన్నీర్‌ వర్గాలు పోటీపడ్డాయి.



ఎన్నికల కమిషన్‌ వద్ద వాదోపవాదాలు వినిపించాయి. మెజార్టీ ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నందున రెండాకుల చిహ్నం తమకే దక్కాలని శశికళ వర్గం ఈసీ వద్ద మొరపెట్టుకుంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లనపుడు రెండాకుల గుర్తుకు వారు ఎలా అర్హులని పన్నీర్‌ వర్గం వాదించింది. రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్‌ ఎవ్వరికీ చెందకుండా చేయడంతోపాటు అన్నాడీఎంకే తరఫున పోటీచేయరాదని ఆంక్షలు విధించింది. దీంతో దినకరన్‌ ‘అన్నాడీఎంకే అమ్మ’ అనే పార్టీని స్థాపించి ఒక స్వతంత్య్ర అభ్యర్థిగా టోపీ గుర్తుపై పోటీచేసేందుకు సిద్ధమయ్యారు.



శశికళ శిబిరం వెల వెల:

ఎంజీఆర్‌ స్థాపించి, జయలలిత నడిపించిన పార్టీ అనే అనందం అదృశ్యమైపోగా శశికళ శిబిరం వెలవెల పోయింది. రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పరిణామంతో ఇరువర్గాలు హతాశులైనా శశికళ వర్గాన్ని ఎక్కువగా బాధించింది. ఎంతో కష్టపడి స్వాధీనం చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కూడా లేకుండా  ఆర్కేనగర్‌ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి దాపురించడాన్ని శశికళ జీర్ణించుకోలేక పోతున్నారు.



 ఆర్కేనగర్‌ ఎన్నికల్లో పోటీచేయవద్దని చెప్పినా వినలేదు, ఇపుడు రెండాకుల చిహ్నం లేకుండా పోటీకి దిగి ఓటమి పాలైతే పన్నీర్‌వర్గం దీన్ని పరాభవంగా పరిగణించగలదని ఆమె వాపోతున్నారు. ఇళవరసి కుమారుడు వివేక్‌ శుక్రవారం బెంగళూరు జైలుకెళ్లి శశికళను కలుసకున్నపుడు.. రెండాకుల చిహ్నం స్థానంలో టోపీ గుర్తును ఎన్నుకోవడం నలుగురిలో ఎద్దేవాగా మారిందని దినకరన్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరపడం ప్రారంభించగానే అప్రమత్తమై సరైన గుర్తును సిద్ధం చేసుకోవడంలో దినకరన్‌ విఫలమయ్యాడని ఆమె కోప్పడుతున్నారు.



రెండాకుల చిహ్నం చూపిన చేతితో టోపీని సర్దుకోగలమని ఆమె రుసరుసలాడుతున్నారు. రెండాకుల చిహ్నం లేకున్నా రెండు లైట్లను ఎన్నుకోవడం ద్వారా పన్నీర్‌సెల్వం రాజకీయ పరిణితిని ప్రదర్శించారని వివేక్‌తో శశికళ వ్యాఖ్యానించారు. అంతేగాక జైల్లో నుంచే ఫోన్‌ ద్వారా దినకరన్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. పైగా చిహ్నం ఎంపికలో చిన్నమ్మ సలహాను తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంపై కూడా నిలదీసిçనట్లు తెలుస్తోంది. ప్రజలకు ‘టోపీ’ పెట్టేందుకు వస్తున్నారని ప్రచారాల్లో గేలి చేస్తే గెలుపు ఎలా సాధ్యమని ఆమె తిట్టి పోశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top