సెంచరీతో చెలరేగిన భరత్ | Sakshi
Sakshi News home page

సెంచరీతో చెలరేగిన భరత్

Published Sat, Oct 10 2015 12:02 AM

సెంచరీతో చెలరేగిన భరత్ - Sakshi

ఆంధ్ర 196/1
గుజరాత్ 308 ఆలౌట్

 
విజయనగరం: రంజీ ట్రోఫీలో సొంతగడ్డపై ఆంధ్ర జట్టు జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘బి’ లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సరికి ఆంధ్ర పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 53 ఓవర్లలో వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (176 బంతుల్లో 119 బ్యాటింగ్;18 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో సత్తా చాటగా... కైఫ్ (97 బంతుల్లో 44 బ్యాటింగ్; 6 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 159 పరుగులు జోడించడం విశేషం.  చేతిలో 9 వికెట్లున్న ఆంధ్ర ప్రస్తుతం మరో 112 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. అంతకు ముందు 250/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ 308 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శివకుమార్, విజయ్, స్టీఫెన్ తలా 3 వికెట్లు తీయగా, అయ్యప్పకు ఒక వికెట్ దక్కింది.

 కేరళ 401 ఆలౌట్
 సాక్షి, హైదరాబాద్: రోహన్ ప్రేమ్ (452 బంతుల్లో 208 19 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించడంతో హైదరాబాద్‌తో ఇక్కడ జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కేరళ తమ తొలి ఇన్నింగ్స్‌లో 401 పరుగులు చేసింది. 186/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కేరళ, హైదరాబాద్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. గోమెజ్ (41), మోనిశ్ (37), ఫాబిద్ (37 నాటౌట్)లతో వరుసగా మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి ప్రేమ్ జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆకాశ్ భండారి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హైదరాబాద్ ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. హైదరాబాద్ మరో 361 పరుగులు వెనుకబడి ఉంది.
 
సౌరాష్ట్రను గెలిపించిన రవీంద్ర జడేజా
రాజ్‌కోట్: రెండు రోజుల్లోనే ముగిసిన మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు 8 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను చిత్తు చేసింది. రవీంద్ర జడేజా (7/55) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ 122 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగుల ఆధిక్యం సాధించిన సౌరాష్ట్ర...రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 శ్రేయస్ డబుల్ సెంచరీ
 ముంబై: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (176 బంతుల్లో 200; 25 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడి డబుల్ సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 6 వికెట్లకు 495 పరుగులు చేసింది. తారే (111 నాటౌట్) కూడా సెంచరీ చేశాడు. ముంబై 341 పరుగుల ఆధిక్యం సాధించింది.
 

Advertisement
Advertisement