సిడ్నీ వాకిట్లో...‘శ్రీ’ వెలుగులు | Sakshi
Sakshi News home page

సిడ్నీ వాకిట్లో...‘శ్రీ’ వెలుగులు

Published Mon, Jun 26 2017 1:21 AM

సిడ్నీ వాకిట్లో...‘శ్రీ’ వెలుగులు

విశ్వవిజేత, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌పై శ్రీకాంత్‌ అద్భుత విజయం
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ కైవసం
వారం వ్యవధిలో రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌
రూ. 36 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం


మరో సంచలనం... మరో టైటిల్‌... ప్రత్యర్థి ఎవరైతే నాకేంటి అంటూ... భారత నంబర్‌వన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ అంతర్జాతీయ వేదికపై మళ్లీ అద్భుతం చేశాడు.వారం వ్యవధిలో రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను గెలిచాడు. శ్రీకాంత్‌ ధాటికి ఈసారి ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ చేతులెత్తేశాడు.  

సిడ్నీ: ఇటీవల కాలంలో తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న క్రీడాకారులపై తాను సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ మళ్లీ నిరూపించాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ విజేతగా అవతరించాడు. 46 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 22–20, 21–16తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత చెన్‌ లాంగ్‌ (చైనా)ను బోల్తా కొట్టించాడు.

 విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 28 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. వారం వ్యవధిలో శ్రీకాంత్‌కిది రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ కావడం విశేషం. ఈనెల 18న శ్రీకాంత్‌ ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టైటిల్‌ను నెగ్గిన సంగతి విదితమే. ఓవరాల్‌గా శ్రీకాంత్‌ కెరీర్‌లో ఇది నాలుగో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌. 2014లో అతను చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో,  2015లో ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు.

సాధికారిక ఆటతీరు...
చెన్‌ లాంగ్‌తో గతంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన శ్రీకాంత్‌ ఈసారి మాత్రం పూర్తిగా పైచేయి సాధించాడు. ఒత్తిడికి లోనుకాకుండా, సహజశైలిలో, సంయమనంతో, పక్కా ప్రణాళికతో ఆడితే చైనా స్టార్‌ ఆటగాళ్లను ఓడించడం సాధ్యమేనని శ్రీకాంత్‌ నిరూపించాడు.  ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (కొరియా), క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ (భారత్‌),  సెమీస్‌లో నాలుగో ర్యాంకర్‌ షి యుకి (చైనా)లను ఓడించిన శ్రీకాంత్‌ ఫైనల్లో కూడా జోరు కొనసాగించాడు. ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్‌ విరామానికి 11–9తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్‌ కోసం హోరాహోరీగా తలపడ్డారు. ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ, నెట్‌ వద్ద అప్రమత్తంగా ఉంటూ, అడపాదడపా స్మాష్‌ షాట్‌లు సంధిస్తూ శ్రీకాంత్‌ తన ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు.

 స్కోరు 20–20 వద్ద శ్రీకాంత్‌ రెండు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్‌ సాధికారికంగా ఆడాడు. స్కోరు 9–9 వద్ద మూడు పాయింట్లు గెలిచిన అతను 12–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. స్కోరు 20–16 వద్ద చెన్‌ లాంగ్‌ కొట్టిన షాట్‌ బయటకు వెళ్లడంతో శ్రీకాంత్‌ విజయం ఖాయమైంది. చెన్‌ లాంగ్‌ వరుసగా రెండు టోర్నీల్లో భారత ప్లేయర్ల చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. ఇండోనేసియా ఓపెన్‌లో ప్రణయ్‌ చేతిలో ఓడిన చెన్‌ లాంగ్‌ ఈసారి శ్రీకాంత్‌కు తలవంచాడు.  

రూ. 5 లక్షలు, టీయూవీ 300 కారు...
భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధ్యక్షుడు హిమాంత బిశ్వ శర్మ శ్రీకాంత్‌ను అభినందించారు. ‘బాయ్‌’ తరఫున రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. అయితే ఒక అభిమాని ఇది చాలా తక్కువ మొత్తమని, ఏదైనా చేయమంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రకు ట్వీట్‌ చేశారు. దాంతో స్పందించిన ఆయన ‘అవునా, శ్రీకాంత్‌ పోరాటతత్వం మనం గర్వపడేలా చేసింది. నా తరఫున మహీంద్ర టీయూవీ 300 కానుకగా ఇస్తున్నాను’ అంటూ ‘బాయ్‌’ నజరానా కంటే విలువైన బహుమతిని ప్రకటించారు.  

అభినందనల వెల్లువ...
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌పై అన్ని వైపుల నుంచి అభినందనల వర్షం కురిసింది. ప్రధానమంత్రి మొదలు పలువురు ప్రముఖులు అతడిని అభినందించారు. ‘శ్రీకాంత్‌ విజయం పట్ల మేమంతా గర్వంగా ఉన్నాం. మరో అద్భుత విజయం సాధించిన అతడికి అభినందనలు’ అని మోడి ట్వీట్‌ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడుతో పాటు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌ రెడ్డి కూడా శ్రీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్‌ను అభినందించిన వారిలో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సానియా మీర్జా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయల్, తెలంగాణ క్రీడా మంత్రి
టి.పద్మారావు కూడా ఉన్నారు.

Advertisement
Advertisement