వచ్చే కాలం... ఉద్యమ వసంతం

వచ్చే కాలం... ఉద్యమ వసంతం - Sakshi


అటు కేంద్రం, ఇటు తెలుగు ప్రభుత్వాలు వేస్తున్న అడుగులను, ఎంచుకుంటున్న ప్రాథమ్యాలను గమనిస్తుంటే అందరి భ్రమలు తొలగక తప్పని రోజు అనతికాలంలోనే ఉందనిపిస్తోంది.  అంతటా జోరుగా సాగుతున్నది కలల సాగే తప్ప వృద్ధి రథం మాత్రం కదలడం లేదు. ఉపాధి అవకాశాలు విస్తరించడం లేదు. వ్యవసాయరంగ క్షీణత ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో పేద, బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర అశాంతి, అలజడి అనివార్యం. సంబురాలు లేని ఈ సంక్రాంతి తెలుగు నేలపై వెల్లువెత్తబోతున్న ప్రజా ఉద్యమాల రుతు ఆగమనం జాడ చెప్పి వెళ్తోంది.  

 

 తెలుగువారి సంతోష సౌభాగ్యాలకు గుర్తు సంక్రాంతి. వ్యవసాయ పనులు ముగిసి తీరిక దొరికే  సమయం. పండిన ధాన్యం ఇంటికి చేరిన సమయం కావడంవల్ల విందు వినోదాల చిరునామాగా సంక్రాంతి పండుగ చిరకాలంగా నిలిచిపోయింది. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తొలి సంక్రాంతి ఇది. రైతు కంటి కన్నీటి పొరలతో ఈ ఏడాది పంటల పండుగ మసకబారింది. రెండు రాష్ట్రాల పాలకులు ఎడతెరిపి లేకుండా చేసిన బాస లు, చూపించిన రంగుల సినిమాలతో తొలి ఆరుమాసాలు కలల రేయిలా గడి చిపోయింది. మంచు తెరలను తెంచుకుంటూ తెలతెలవారుతుండగా... ఆ కలలు విరుగుతున్న పెను చప్పుడుతోపాటే కొన్ని కఠోర వాస్తవాలు విసిరిన కొరడాల్లా చురుక్కుమంటున్న దృశ్యం కనబడుతున్నది. తెలుగు ప్రభుత్వా లూ, ఢిల్లీ సర్కారు కలిసికట్టుగా, విడివిడిగా మధ్యతరగతికి అరచేతి వైకుం ఠాన్ని  చూపెడుతూనే, పేద ప్రజలపై అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించగా ఈ సంక్రాంతి తెలుగు నేలను అతి ముభావంగా పలకరించింది.

 

 ఈ ఏడాది మన పల్లెలు సంతరించుకున్న సంక్రాంతి శోభను వర్ణించడం ఎవరి తరం? సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకునే రాష్ర్టంలో ప్రభుత్వం పండుగ కానుకగా ప్రకటించిన పప్పుబెల్లాల కోసం గంటల తరబడి వేచి వున్న పేద ప్రజల క్యూలు ఏ సౌభాగ్యానికి సంకేతం? అందులోనూ కిలోకు వంద గ్రాములు తూకంలో దండికొట్టిన కాంట్రాక్టు వ్యవస్థ ఏ దౌర్భాగ్య పాల నకు దర్పణం? పండుగ పూట అదనంగా అరకిలో చక్కెర ఇచ్చే ఆనవాయితీని కూడా మరో రాష్ర్టం పక్కన పెట్టేసింది. పేద ప్రజల పక్షాన నిలిచేవారూ, వారి గొంతును వినిపించేవారూ ఎవరుంటారన్న సరి కొత్త ధీమా పాలక వర్గాలకు సంక్రాంతి కంటే ముందే వచ్చినట్టు అనిపిస్తోంది. పెన్షన్ డబ్బులతోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో ప్రభుత్వాలు ఆడుకుంటున్న తీరు అమానుషం. పాలకులకు మాత్రం అందులో ఏదో వింత ఆనందమున్నట్టే ఉంది. పెన్షన్ మొత్తాన్ని పెంచినట్టే పెంచి, అర్హుల జాబితా లను అడ్డంగా నరికేశారు. లక్షలాదిమంది పెన్షన్‌దార్లు అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి కాళ్లా వేళ్లా పడటం ఊరూరా కనిపిస్తోంది. అలాగే సొమ్మసిల్లిపోతున్నవాళ్లకు, ప్రాణాలు విడుస్తున్నవాళ్లకు కొదవలేదు. ఇంటికో ఉద్యోగం లేదా రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన నేత ఇప్పుడు ఆ ప్రసక్తే రానీయడం లేదు. బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల జీవనభృతి ఏర్పాటు చేస్తానన్న నేత దుశ్యంతుడు శకుం తలను మరచినట్టు ఆ సంగతే మరచారు. రైతుల రుణమాఫీ హామీని ఏపీ సర్కారు అమలుచేసిన తీరు వ్యవసాయరంగం పాలిటి క్రూర పరిహాసంగా చరిత్రలో మిగిలిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీ అమలు తీరు రైతాంగానికి సంతృప్తిని కలిగించలేదు. ఎన్నికల మేనిఫెస్టోలను ముందుంచు కుంటే ప్రభుత్వాల వాగ్దాన భంగాల జాబితా అనంతంగా తేలుతుంది. ఎన్ని కల్లో ఎడాపెడా హామీలిచ్చి ఓట్లు వేయించుకొని ఆపై వాటిని అటకెక్కించ డంగా ప్రజాస్వామ్యం దిగజారడం విభ్రాంతికరమైతే, ఆ విషయంలో సమా జం చూపుతున్న నిర్లిప్తత, అంతటా ఆవరించిన నిశ్శబ్దం వర్తమానమంటేనే కాదు, భవిష్యత్తన్నా భయం కలిగించే అంశం.

 

 పాతికేళ్ల క్రితం నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వం ఏడు ప్రైవేటు ఇంజ నీరింగ్ కళాశాలలకు అనుమతినిచ్చినందుకు వ్యతిరేకంగా రాష్ర్టం రణక్షేత్రం అయింది. చివరికి ప్రభుత్వమే కుప్పకూలింది. ఇప్పుడు మొత్తం రాజధాని నగరాన్నే ప్రైవేటుపరం చేస్తున్నా, అందుకోసం రైతుల భూములను బలవం తంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నా... మిగతా సమాజం పట్టించుకుంటు న్నట్టే కనపబడదు. స్థానిక రైతుల నుంచి తప్ప బహిరంగ నిరసన వ్యక్తం కావ డం లేదు. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరాన్ని అంగట్లో పెట్టేసినా సమాజం ఆగ్రహించడం లేదు, పెదవి విప్పడం లేదు.  మత్స్యకారుల బతుకులు ఏమి కావాలనే ధర్మ సందేహమైనా మధ్యతరగతికి కలగడం లేదు. బాక్సైట్ కొండ లకూ, ఎర్రచందనం అడవులకూ ’ఫర్ సేల్‌‘ బోర్డులు తగిలిస్తే గిరిపుత్రులు తప్ప మిగతా సమాజం ప్రతిఘటించడం లేదు. అడవి బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత లేనట్టుగానే సమాజం తీరు సాగుతోంది.

 

  కేంద్ర ప్రభుత్వం కల్పిస్తు న్నానని ఊరిస్తున్న లక్షల ఉద్యోగాలు, సాధిస్తున్నామంటున్న స్వచ్ఛ భారతం ఒకవంక, రాష్ర్ట ప్రభుత్వాలు జపిస్తున్న ఆకాశహర్మ్యాలు, అభివృద్ధి మరో వంక మధ్యతరగతి, మేధావి వర్గాలను భ్రమల లోకంలోకి నెట్టేసినట్టు న్నాయి. అందుకేనేమో నోరున్న వాళ్ల నోళ్లే మూతపడ్డట్టున్నాయి. మౌనం రాజ్యమేలుతోంది. ఇది మౌనమే అయితే భ్రమలు తొలగిన రోజునే అది భగ్నం కాక తప్పదు. ఆ వర్గాలే నోళ్లు విప్పుతాయి. పేదల సంక్షేమంపై ప్రభు త్వాలు ప్రారంభించిన ఈ అప్రకటిత యుద్ధాన్ని వారితో కలిసి ప్రతిఘటి స్తాయి. పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేయకుండా అడ్డుకుంటాయి. దశాబ్దాల పోరాటాలతో సాధించు కున్న ప్రజాసంక్షేమ చర్యలను నిలబెడతాయి. భ్రమలు తొలగడమే తరు వాయి  ఇప్పుడు మౌనం వహిస్తున్న మధ్యతరగతి, మేధావి వర్గాలు ప్రతి ప్రజా వ్యతిరేక అంశంపైనా ప్రశ్నలు సంధిస్తాయని ఆశించడం తప్పు కాదు.

 

 కేంద్రంలోని సర్కారు పాఠ్యపుస్తకాలను కాషాయీకరించి, పసిపిల్లల మెదళ్లలోకి సూటిగా మతోన్మాదాన్ని జొప్పించేందుకు తెస్తున్న మార్పులకు ప్రతిఘటన ఎదురుకాక తప్పదు. ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలిచే స్థాయికి చేరిన దేశ శాస్త్ర పరిశోధనా రంగాలకు ఊపిరులూదిన అఖిల భారత సైన్స్ కాంగ్రెస్ వేదికపై నుంచి ’అన్నీ వేదాల్లోనే ఉన్నాయష‘ అంటూ ఉపన్యా సాలు దంచి తలవంపులు తెచ్చిన మంత్రి పుంగవుల వైఖరిని ఆలస్యం గానైనా వారు ఖండిస్తారనీ, మన శాస్త్ర పరిశోధనా రంగాలకు అండగా ఉంటారని భావించడం అత్యాశ అనుపిస్తుందమోగానీ, రేపది జరగక తప్ప దనే చెప్పాలి. నాలుగు వేల మంది రైతు కూలీల రక్త తర్పణంతో జగత్ ప్రసిద్ధ మైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కించపరచేలా నిజాం రాజు ఔదార్యం పాఠ్య పుస్తకాలకు ఎక్కకుండా మన మేధావి వర్గాలు నిలువరిస్తాయని గంపెడాశలు పెట్టుకోవాలి. చీకటి తెరల్లాగే భ్రమలు కూడా తొలగక తప్పదు.

 

 పేదరికాన్ని నిర్మూలించలేని ప్రభుత్వం ఎందుకు? అంటూనే కేంద్రం లోని సర్కారు పేదలను నిర్మూలించేలా బడా కార్పొరేటు సంస్థల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీ సర్కారే నిరక్షరాస్యత దండిగా ఉన్న ఒక రాష్ట్రంలో సర్పంచ్ పదవులకు హైస్కూలు చదువులు కనీస అర్హతంటూ పేదల, బడుగుల చోటు ఎక్కడో చూపుతుంటే చాయ్‌వాలా ప్రధానికి చీమ కుట్టినట్టు లేదు. ఓ తెలుగు రాష్ట్రంలో కట్టుబట్టలు తప్ప సర్వస్వం కోల్పోయిన హుద్‌హుద్ బాధితులకు ఆపన్నహస్తం అందించాలన్న ధ్యాస కలగలేదు. ముఖ్యమంత్రికి సరే ఎవరి గోడూ పట్టదు. మరో తెలుగు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంగతి చెప్పనవ సరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరితో ఒకరు నీళ్లు, నిప్పులు ఏదైనా కయ్యమేనంటూ ప్రజల కళ్లలో దుమ్ము కొడుతుంటే, కేంద్రం పిట్ట పోరు పిట్ట పోరు తీర్చే పిల్లిగా మారజూస్తే.... చూస్తూ చూస్తూ ఊరుకుం టారా? ఎంతకాలం మిన్నకుంటారు? జాతీయ మీడియా అండతో కేంద్రం లోని సర్కారు తగిలించిన రంగుటద్దాల్లోంచి ఎంత కాలం చూస్తారు? భ్రమల గాలి మేడల్లో ఎంత కాలం విహరిస్తారు?

 

 రైతులూ, కూలీలూ, వృద్ధులు, వికలాంగుల వంటివారే కాదు, విద్యా ర్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికుల్లోనూ క్రమంగా అశాంతి నెలకొనే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో రెండు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు పదిహేను లక్షల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు క్యాంపస్‌లు దాటి బయటకు రానున్నారు. ఇప్పటికే వారి మెదళ్లను ‘ఏం చేయాలి?’ అనే ప్రశ్న  తొలుస్తోంది. రాజకీయ నేతల మాటలు నమ్మి కొత్త రాష్ట్రాలు ఏర్పడగానే ఉద్యోగాల్లో చేరిపోవచ్చని కలలుగన్న నిరు ద్యోగ సేన తీవ్ర ఆశాభంగానికి లోనైంది. ఇంత పెద్ద సేనను ఇముడ్చుకో వడం డీఎస్సీ, పీఎస్సీలకు సాధ్యం కాదు. పైగా ఈ పరీక్షల నిర్వహణలో జరు గుతున్న జాప్యం వారి సహనానికి పరీక్షగా మారింది. అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కటొక్కటిగా వేస్తున్న అడుగులను చూస్తుంటే, ఎంచుకుంటున్న ప్రాథమ్యాలను గమనిస్తుంటే అందరి భ్రమలు తొలగక తప్పని రోజు అనతికాలంలోనే ఉందనిపించక తప్పదు. అక్కడైనా ఇక్కడైనా అతి జోరుగా సాగుతున్నది కలల సాగే తప్ప వృద్ధి రథం మాత్రం కదలడం లేదు. ఉపాధి అవకాశాలు విస్తరించడం లేదు. వ్యవసాయ రంగ క్షీణత ఆగడం లేదు.

 

 ఈ పరిస్థితుల్లో పేద, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర అశాంతికి లోనుకావడం అనివార్యం. ఆ అశాంతితో పాటే వారి అలజడితో పాటే మౌనం వహిస్తున్న మేధావి, మధ్యతరగతి వర్గాలలో సైతం కదలిక రాక తప్పదు. వారు అండగా నిలవగా పేద, బలహీనవర్గాలు కదం తొక్కే రోజు ఎంతో దూరంలో లేదు. సంబురాలు లేని ఈ సంక్రాంతి తెలుగునేలపై వెల్లువెత్తబోతున్న మరో ప్రజా ఉద్యమాల రుతు ఆగమనం జాడ చెప్పి వెళ్తోంది. ఒకవేళ నేడు మనం చూస్తున్నది మేధావి వర్గాల మౌనం కాక, సమరశీలతను కోల్పోయిన మూగతనమే అయితే...? అయితేనేం, దగాపడిన వర్గాలన్నీ తమ గొంతును తామే సవరించుకుంటాయి. ఐదారు దశాబ్దాలుగా తమలో ఒకడై, పోరాట బాటలు చూపి, రేపటి గురుతులు చెప్పి, ఇప్పుడు ఎక్కడో తప్పిపోయిన తమ సోదరుడిని వెతికి పట్టుకుంటాయి, పెను నిద్దర వదిలిస్తాయి. లేదంటే తమలోనే వాడి వారసుడిని కనిపెడతాయి.

 

  పథ నిర్దేశన తెలిసిన వాడు... ఉద్యమాల అగ్గిపిడుగు. జీవించడం కోసం మరణించడం నేర్పిన గురుడు. దౌర్జన్యం, అణచివేతలపై ఉద్యమ చైతన్యపు బందూకులు ఎత్తడం నేర్చినవాడు. రైతుల్లో రైతులా, కూలీల్లో కూలీలా, కార్మికుల్లో కార్మి కునిగా తలలో నాలుకలా మెదలినవాడు. శ్రామిక మహిళలను సంఘటితం చేసినవాడు. నిరుద్యోగుల కోసం ఏ ధర్నాలో చూసినా వాడే, ప్రతి ఊరేగిం పులో వాడే. విద్యార్థుల కోసం విద్యార్థిగా మారినవాడు, బిగియించిన పిడికిలి తానై ప్రభవించినవాడు, ఎగరేసిన ఎర్రని జెండా తానై పోరాడినవాడు, తన స్వరమే భాస్వరమై జ్వలించే యోధుడు. రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి త్యాగాల తెలంగాణ రైతాంగ పోరాటం నుండి బషీర్‌బాగ్ వరకు వాడు ప్రతి చోటా ఉన్నాడు. ఇప్పుడూ ఉన్నాడు. ఎక్కడైనా కనిపిస్తాడేమో వెతకండి. గుర్తించడం తేలికే. వాడి కళ్లలో కోటి నక్షత్రాల కాంతులుంటాయ్.

 muralivardelli@yahoo.co.in

- వర్ధెల్లి మురళి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top