ప్రతి భారతీయుడూ తెల్సుకోవాల్సిన నిజాలు | Sakshi
Sakshi News home page

ప్రతి భారతీయుడూ తెల్సుకోవాల్సిన నిజాలు

Published Thu, Aug 17 2017 4:40 PM

ప్రతి భారతీయుడూ తెల్సుకోవాల్సిన నిజాలు

న్యూఢిల్లీ: డొక్లాం సమస్యపై చైనా అధికారిక మీడియా 'భారత్‌ చేసిన ఏడు పాపాలు' అంటూ వీడియో విడుదల చేసింది. అందులో చైనా చేసిన ప్రతిదీ ఒక పచ్చి అబద్దం. డొక్లాంపై భారత్‌ ఎలాంటి పాపాలు చేయలేదు. సిక్కిం, భూటాన్‌, చైనా దేశాల మధ్య ఉన్న డొక్లాం సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రతి భారతీయ పౌరుడు/పౌరురాలు డొక్లాం సమస్య గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

భారత్‌ ఎలాంటి పాపాలు చేయలేదనడానికి మన వద్ద ఆధారాలు ఉన్నాయి. వీటితో చైనా దుర్భుద్దిని మనం ఎండగట్టాలి. భారత్‌ పాపాలు చేయలేదనడానికి ఈ క్రింది విషయాలే తార్కాణాలు.

అసలు నిజాలివీ..
చైనా మీడియా చేసిన ఆరోపణలను నిరూపించాలంటే చారిత్రక డాక్యుమెంట్లను పరిశీలించాల్సిన పని లేదు. చైనా సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా భారత్‌.. వారి దేశంలోకి ప్రవేశించిందన్న ఆరోపణ అవాస్తవం. తద్వారా అంతర్జాతీయ చట్టాన్ని భారత్‌ ఉల్లంఘించిందన్న మాట అసలే పచ్చి అబద్దం. డొక్లాం.. భూటాన్‌, చైనాల మధ్య వివాదం నెలకొన్న ప్రదేశం.

వివాదాన్ని పరిష్కరించుకునేందుకు 1990 నుంచి ఇప్పటివరకూ చైనా-భూటాన్‌లు 24 రౌండ్లు సమావేశమయ్యాయి. అసలు భూటానే చైనాకు డొక్లాంను అప్పగిస్తే.. మరి సమస్యేమి లేకుండా అన్ని రౌండ్లు ఎందుకు సమావేశాలు జరిపినట్లు?. భూటాన్‌తో చర్చలు జరుగుతుండగానే చైనా డొక్లాంలో రోడ్డు వేసేందుకు ప్రయత్నించింది. అసలు నిజమేమిటంటే చైనానే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. భారత్‌ చట్టాన్ని కాపాడేందుకు అడ్డుగా నిలిచింది.

1890 ఒప్పందం
యూకే, చైనా, టిబెట్‌ల మధ్య 1890లో ఓ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం వల్ల తమకు నష్టం వాటిల్లవచ్చని భావించిన భూటాన్‌ ఒప్పందంపై సంతకం చేయలేదు. భూటాన్‌కు ఈ ఒప్పందంతో అసలు సంబంధమే లేదు. బ్రిటన్‌, చైనాలు 1890లో కలకత్తా ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందంలో మొత్తం ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి. మొదటి ఆర్టికల్‌ ప్రకారం డొక్లాం తమ భూభాగామని చైనా వాదిస్తోంది. భూటాన్‌కు చేరువలోని మౌంట్‌ గ్యెమొచెన్‌ నుంచి నేపాల్‌ను ఆనుకుంటూ చైనా సరిహద్దు ఉంటుందని మొదటి ఆర్టికల్‌ సారాంశం. దీంతో డొక్లాం భూభాగం కూడా తమదేనని చైనా ప్రకటించుకుంది. అక్కడ రోడ్డు నిర్మించడానికి సన్నాహాలు మొదలెట్టింది.

దీంతో భూటాన్‌ తొలుత చైనాకు వ్యతిరేకంగా గళమెత్తింది. 18, 19 శతాబ్దాల్లో ఉన్న మ్యాప్‌లను, ఒప్పందంలోని ఆర్టికల్‌ 1ను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా డొక్లాంతో చైనాకు సంబంధం లేదని భారత్‌ వాదిస్తోంది. చైనా సరిహద్దు నేపాల్‌కు చేరువలోని బటాంగ్‌ లా అనే ప్రదేశం వద్ద ముగుస్తుందని అంటోంది.

యథాతథ స్థితి 2012..
డొక్లాంలో 2012 నుంచి కొనసాగుతున్న యథాతథ స్థితికి భారత్‌ చేటు చేస్తుందని చైనా ఆరోపిస్తోంది. కానీ, ఈ ఆరోపణలో నిజం లేదు. భారత సైనికులు ఎన్నో ఏళ్లుగా డొక్లాం సరిహద్దులో భూటాన్‌ సైనికులతో సమన్వయం చేసుకుంటూ కావలి కాస్తున్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు చైనా బలగాలు డొక్లాం ప్రాంతంలో పహారా కాస్తుండకపోవడంతో భారత్‌ కూడా అక్కడి నుంచి సైన్యాన్ని ఉప సంహరించింది.

2012లో భారత విదేశాంగ శాఖ చైనా, భారత్‌, భూటాన్‌ల మధ్య జరిగిన యథాతథ స్థతికి సంబంధించిన ఒప్పందంపై వివరణ ఇచ్చింది. మూడు దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే డొక్లాంపై ఒక నిర్ణయానికి రావాలనేది దీని సారాంశం. దీని ద్వారా భూటాన్, భారత్‌ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా డొక్లాం తమదేనని అంటున్న చైనా వాదన సరైనది కాదని తెలిసిపోతుంది.

భూటాన్‌-చైనాల సరిహద్దు చర్చలను భారత్‌ అడ్డుకుంటోందా?
చైనా-భూటాన్‌ల సరిహద్దు చర్చలలోకి భారత్‌ తలదూర్చి, ఒప్పందాలు కుదరకుండా చేస్తోందనేది చైనా మరో ఆరోపణ. ఇది మరో పచ్చి అబద్దం. గత ఇరవై ఏళ్లుగా చైనాతో భూటాన్ జరుపుతున్న చర్చలే ఇందుకు నిదర్శనం. 2007 వరకూ అంతర్జాతీయ రాజకీయాలన్నింటిని భూటాన్‌ భారత్‌ ద్వారా జరిపిందన్న మాట వాస్తవం. ఇందుకు భారత్‌-భూటాన్‌ల మధ్య స్నేహహస్తం ఒప్పందం ఉంది.

భారత్‌ ఓ చొరబాటు దేశమా?
డొక్లాంలోకి భారత్‌ సైన్యంతోటి చొరబాటుకు పాల్పడిందని చైనా ఆరోపించింది. ఇందులో నిజం లేదు. భారత్‌ ఎప్పుడూ డొక్లాం తన భూభాగామని పేర్కొన లేదు. భూటాన్‌ సైన్యాన్ని తమకు అడ్డు తొలగించుకోవాలని చైనా ప్రయత్నించింది. దీంతో సాయం కోసం భూటాన్ భారత్‌ తలుపు తట్టింది.

ఆపన్న హస్తంతో మేం ఉన్నామంటూ భారత్‌ చైనా ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పాటు, భూటాన్‌కు రక్షణగా నిలవడానికి యథాతథ స్ధితి ఒప్పందాన్ని చైనాకు చూపింది. ముందు చైనా సైనికులను ఉపసంహరించుకుంటే మేం కూడా ఉపసంహరించుకుంటామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే భారత్‌పై చైనా బుసలు కొడుతోంది.

సంబంధిత వార్త :  భారత్‌పై చైనా విద్వేషపూరిత వీడియో

 

Advertisement

తప్పక చదవండి

Advertisement