స్కూలు యజమానికి జీవితఖైదు | Sakshi
Sakshi News home page

స్కూలు యజమానికి జీవితఖైదు

Published Thu, Jul 31 2014 1:03 AM

స్కూలు యజమానికి జీవితఖైదు - Sakshi

‘కుంభకోణం స్కూల్’లో మంటలకు 94 మంది ఆహుతి కేసులో..
 
చెన్నై: తమిళనాడులోని ఓ స్కూల్లో 2004లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 94 మంది విద్యార్థులు సజీవదహనమైన కేసులో స్కూలు వ్యవస్థాపకుడు పళనిస్వామి సహా 10 మందిని దోషులుగా నిర్ధరిస్తూ తంజావూరు కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పళనిస్వామికి ఐపీసీ సెక్షన్లు 427, 467, 197, 304 కింద జీవితఖైదు, సెక్షన్ 304 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ. 47 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పళనిస్వామి భార్య, పాఠశాల కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు విజయలక్ష్మి, వంటమనిషి వసంతిలకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు మొత్తం రూ. 3.75 లక్షల జరిమానా విధించారు. విద్యాశాఖ ఉద్యోగులు ఎలిమెంటరీ ఆఫీసర్ బాలాజీ, అసిస్టెంట్ ఎలిమెంటరీ ఆఫీసర్ శివప్రకాష్, పీఏ దురైరాజ్, రాష్ట్ర ఎలిమెంటరీ ఆఫీసర్ తాండవన్‌కు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షలతోపాటు రూ.10వేల చొప్పున జరిమానా, ఇంజనీర్ జయచంద్రన్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ అలీ తీర్పు చెప్పారు. 94 మంది విద్యార్థులను బలిగొన్నందున పళనిస్వామి 940 ఏళ్ల శిక్షను అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. అయితే ఇది సాధ్యం కాదు కాబట్టి 10 ఏళ్ల కఠినకారాగార శిక్షను ఏకకాలంలో అనుభవించాలన్నారు. తీర్పు తర్వాత జయచంద్రన్ జరిమానా చెల్లించి బెయిల్ పొందారు. తీర్పుపై బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని తెలిపాయి.

ప్రమాదం జరిగింది ఇలా...: తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో ఉన్న ఓ ఇరుకైన భవనంలో పళనిస్వామి నిబంధనలకు విరుద్ధంగా మూడు స్కూళ్లను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే 2004 జూలై 16న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే వంటగదిలో అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు మొదటి అంతస్తులో ఉన్న స్కూళ్లకు వ్యాపించాయి. 94 మంది సజీవదహనమవగా మరో 18 మంది తీవ్రగాయలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనపై తొలుత 24 మందిపై అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ముగ్గురిపై అభియోగాలను ఉపసంహరించుకుంది.
 

Advertisement
Advertisement