చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు | Sakshi
Sakshi News home page

చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Published Mon, Jun 24 2019 12:14 PM

SC Issues Notices To Government Over PIL On AES Deaths - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో మెదడువాపు వ్యాధితో 160 మందికి పైగా చిన్నారులు మరణించిన ఉదంతంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్‌, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చిన్నారుల మరణాలకు బిహార్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, చిన్నారులు మరణించిన ముజఫర్‌పూర్‌ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలైంది.

బిహార్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు వంద మొబైల్‌ ఐసీయూ యూనిట్లను పంపాలని పిటిషన్‌ కోరింది. యూపీలోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే ఎదుర్కొనేందుకు సరైన సన్నాహక చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్‌ తన పిటషన్‌లో డిమాండ్‌ చేశారు. బిహార్‌లో మరణించిన చిన్నారులకు రూ పది లక్షలు పరిహారం అందచేయాలని,  ఈ వ్యాధిపై బిహార్‌, యూపీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించేలా ప్రచారం చేపట్టాలని ఆదేశించాలని కూడా పిటిషన్‌ కోరింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్ధానం దీనిపై వారంరోజుల్లోగా బదులివ్వాలని ఆయా ప్రభుత్వాకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను పదిరోజుల పాటు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement