గోవిందా.. గోవిందా.. | Sakshi
Sakshi News home page

గోవిందా.. గోవిందా..

Published Tue, Aug 12 2014 11:01 PM

organizers saing to boycotted the festival  celebrations

సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాల్లో 18 ఏళ్ల లతోపు పిల్లలు పాల్గొనడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో సార్వజనిక గోవిందా మండళ్లు ఖంగుతిన్నాయి. ఈ నెల 17వ తేదీన జరుగనున్న కృష్ణాష్టమి రోజున ఉట్టి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజు కొన్ని వేల సార్వజనిక గోవిందా మండళ్లు ఉట్టి ఉత్సవాలను నిర్వహిస్తాయి. ఉట్టి కొట్టేందుకు నిర్ణయించిన టీంలో చిన్నపిల్లలు కూడా ఉంటారు. వారు పిరమిడ్‌లో అందరికంటే పెకైక్కి ఉట్టిని కొడతారు. బరువు తక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి గోవిందా మండలిలోనూ పిల్లలు తప్పనిసరిగా పాల్గొంటారు.

 అయితే ఉట్టి ఉత్సవాల సమయంలో పిల్లలు పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తూ ఈ ఏడాది బాలల హక్కుల కమిషన్ గోవిందా మండళ్లపై ఆంక్షలు విధించింది. 12 ఏళ్ల పిల్లలు ఉట్టి ఉత్సవాలు పాల్గొంటే అటువంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని ఆదేశించింది. కాగా, బాలల హక్కుల కమిషన్ నిర్ణయంపై సార్వజనిక గోవిందా మండళ్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిన్నపిల్లలతో ఉట్టి ఉత్సవాలను నిర్విహ ంచే తీరుతామని కమిషన్‌కు,పోలీసులకు సవాల్ విసిరాయి.

వీరికి కొన్ని మహిళా గోవింద మండళ్లు కూడా మద్దతు తెలపడంతో వివాదం ముదిరింది. ఇదిలా ఉండగా, హైకోర్టు తీర్పు ఈ మండళ్లపై పిడుగుపడినట్లయ్యింది. బాలల హక్కుల కమిషన్ ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొనకుండా చూడాలని పోలీసులను ఆదేశిస్తే, హైకోర్టు మరో అడుగు ముందుకేసి 18 ఏళ్ల లోపువారు ఈ ఉత్సవాల్లో పాల్గొనడాన్ని నిషేధించడంతో సార్వజనిక గోవిందా మండళ్ల పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యి మీద’ పడినట్లయ్యింది.

 ఉట్టి ఉత్సవాన్ని ప్రాణాంతక క్రీడగా పరిగణించాలని కోరుతూ ఉత్కర్ష్ మహిళ సమితి ప్రజాప్రయోజనాల (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టు స్పందించింది. 18 ఏళ్లలోపు పిల్లలను ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనడాన్ని నిషేధించింది. అంతటితో ఊరుకోకుండా కేవలం 20 అడుగుల ఎత్తు (ఐదంతస్తుల ) మానవ పిరమిడ్లు మాత్రమే నిర్మించాలని ఆంక్షలు విధించింది.

 దీన్ని కచ్చితంగా అమలు చేసేందుకు కొత్త నియమాలతో కూడిన సర్క్యూలర్ జారీ చేయాలని న్యాయమూర్తులు వి.ఎన్.కానడే, ప్రమోద్ కోదే ప్రభుత్వాన్ని ఆదేశించారు. 12 ఏళ్లలోపు పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనకుండా చూసే బాధ్యత నగర పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. కాని ఈ వారంలో నవీముంబైలో ఒక బాలుడు (14), జోగేశ్వరిలో యువకుడు(17) ఉట్టి ఉత్సవానికి సాదన చేస్తుండగా అదుపుతప్పి కిందపడి చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది.

 ఉట్టి ఉత్సవాల నిర్వాహకులపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. తారు రోడ్డు లేదా కాంక్రీట్ రహదారిపై ఉట్టి కడితే.. దాని కింద నేలపై మెత్తని పరుపులు ఏర్పాటు చేయాలి.. గోవిందా బృందాలకు హెల్మెట్, సేఫ్టీ బెల్టు లాంటి రక్షణ కవచాలు అందుబాటులో ఉంచుకోవాలి.. ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు నిర్వాహకులే అంబులెన్స్‌లు సమకూర్చుకోవాలి.. అని న్యాయమూర్తుల బెంచి తీర్పులో స్పష్టం చేసింది. కాగా కోర్టు విధించిన ఆంక్షలపై గోవిందా బృందాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అనేక మండళ్లు ఈ ఏడాది ఉట్టి ఉత్సవాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఆటో రేట్ల పెంపునకు హైకోర్టు ఓకే..
 ముంబై: ఆటో, ట్యాక్సీల రేట్లను రెండు రూపాయలు పెంచవచ్చని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. మీటర్‌పై రూ.2 పెంచుకునేందుకు ఆటోలు, ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ రేట్లను ప్రభుత్వం బుధవారం నుంచి అమలుచేయవచ్చని కోర్టు సూచించింది. ప్రస్తుతం ఆటోలు, ట్యాక్సీలు రూ.15, రూ.19 వసూలు చేస్తుండగా వరుసగా రూ.17, రూ.21 వసూలు చేసేందుకు అనుమతిస్తూ జస్టిస్ అభయ్ ఓకా ఆదేశాలు జారీచేశారు.

అయితే కేలిబ్రేటెడ్ (క్రమాంకనం) మీటర్లు కలిగి ఉన్న ఆటోలు, ట్యాక్సీలకే ఈ రేట్లు వర్తిస్తాయని జస్టిస్ ఓకా స్పష్టం చేశారు. కేలిబ్రేటెడ్ మీటర్లు లేని ఆటోలు చార్జీల పెంపునకు యత్నిస్తే వాటిపై ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, నగరంలో తిరిగే అన్ని ఆటోలు,ట్యాక్సీలు కేలిబ్రేటెడ్ మీటర్లను ఏర్పాటుచేసుకునేంతవరకు చార్జీల పెంపు అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement