సింధూ నది : ప్రాజెక్టుల నిర్మాణం ఆపేది లేదు | Sakshi
Sakshi News home page

సింధూ నది : ప్రాజెక్టుల నిర్మాణం ఆపేది లేదు

Published Sat, Sep 16 2017 5:07 PM

సింధూ నది : ప్రాజెక్టుల నిర్మాణం ఆపేది లేదు

  • విద్యుత్‌ అవసరాల కోసమే..!
  • 1180 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి
  • కశ్మీరీల వ్యవసాయానికి ఊతం
  • తీరనున్న తాగు నీటి కొరత

  • వాషింగ్టన్‌ : సింధూ నదీ జలాల విషయంలోనూ, జమ్మూ కశ్మీర్‌లో కొత్తగా నిర్మిస్తున్న రెండు హైడ్రో ప్రాజెక్టులపై వెనకంజ వేసేది లేదని భారత్‌ స్పష్టం చేసింది.  కొంతకాలంగా సింధూ నదీ జలాలపై ఇరు దేశాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. నదీ జలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్‌ వరల్డ్‌ బ్యాంక్‌ను ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ముఖ్య అధికారులతో వరల్డ్‌ బ్యాంక్‌ ఈ నెల 14, 15 తేదీల్లో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భారత్‌ తాము చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాలు లేవని.. వాటిని కట్టి తీరుతామని ప్రకటించింది. ఈ చర్చల్లో భారత్‌ తరఫున కేంద్ర జలవనరుల ప్రధాన కార్యదర్ధి అమర్జిత్‌ సింగ్‌, దీపక్‌ మిట్టల్‌ పాల్గొన్నారు. పాకిస్తాన్‌ తరఫున వాటర్‌ రీసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఆరిఫ్‌ అహ్మద్‌ ఖాన్‌, వాటర్‌ అండ్‌ పవర్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ యూసఫ్‌ నసీమ్‌ ఖాన్‌, విదేశాంగ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

    చర్చల సందర్భంగా వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు 1960లో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం గురించి వివరిస్తూ.. కశ్మీర్‌లో కొత్తగా నిర్మించే ప్రాజెక్టులు (కిషన్‌ గంగా, రాట్లే) అందుకు విరుద్ధం అని చెప్పారు. సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ఇరు దేశాల ప్రతినిధులకు సూచించారు.

    పాకిస్తాన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1960 ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. నాటి ఒప్పందాలను పక్కనబెట్టి జీలం, చీనాబ్‌ నదుల మీద ప్రాజెక్టులు నిర్మిస్తోందని.. ఇవి పూర్తయితే.. పాకిస్తాన్‌ను నీళ్లు రావని చెప్పారు. పాక్‌ ప్రతినిధుల ఆరోపణలకు భారత ప్రతినిధులు దీటుగా సమాధానమిచ్చారు. భారత్‌ ఎక్కడా 1960 ఒప్పందాలను ఉల్లఘించలేదని స్పష్టం చేశారు. మా భూభాగంలో ప్రవహించే నదుల్లో.. అది కూడా కేవలం విద్యుత్‌ అవసరాలకు మాత్రమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల మాకు 1180 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని.. అది జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు, వ్యవసాయానికి ఉపయోగ పడుతుందని.. దీపక్‌ మిట్టల్‌ పేర్కొన్నారు.


     

Advertisement
Advertisement