రాజకీయాల్లోకి నయన? | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి నయన?

Published Wed, Aug 31 2016 1:51 AM

రాజకీయాల్లోకి నయన? - Sakshi

తారల రాజకీయ రంగప్రవేశం అన్నది సర్వసాధారణ అంశంగా మారింది. చిత్ర రంగానికి చెందిన పలువురు ముఖ్యమంత్రులుగా ఏలిన చరిత్ర మనది. ముఖ్యంగా తమిళచిత్ర పరిశ్రమకు,రాజకీయాలకు విడదీయరాని అనుబంధాలున్నాయన్నది నిర్విదాంశం.ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కూడా తారగా ఒక నాడు ఏలిన వారేనన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు శాసనసభ్యులు, లోకసభ సభ్యులు, మంత్రులుగా ప్రజాసేవలో రాణిస్తున్నారు. మరికొందరు రాజకీయ దాహంతో ఉన్నారు. నిన్నగాక మొన్న నటి నమిత అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
 తాజాగా ప్రస్తుతం నంబర్‌వన్ నాయకిగా వెలుగొందుతున్న నయనతారకు రాజకీయమోహం పుట్టిందనే ప్రచారం జోరందుకుంది. పలు ఎదురు దెబ్బలను తట్టుకుని నటిగా అగ్రస్థానంలో రాణిస్తున్న నయన్ బాణీనే వేరు. ఎవరేమనుకున్నా, తనకంటూ ఒక పాలసీని ఏర్పరచుకుని ఆ దారిలో పయనిస్తున్న ఈ సంచలన నటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మాయ చిత్రంతో లేడీ ఒరియెంటెడ్ చిత్రాల నాయకిగానూ ప్రూవ్ చేసుకున్న నటి నయనతార. ఆ విధంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా వెలిగిపోతున్న నయనతారకూ తాజాగా రాజకీయ మోహం కలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 చాపకింద నీరులా నయన తన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నయనను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రచారానికి తెర లేచింది. దానికి ఆజ్యం పోసేలా ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఇతర చిత్రాల ప్రమోషన్‌కే కాదు తాను నటించిన చిత్రాల ప్రచారం కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు నయన్. దీనిని ఒక నిబంధనగా చిత్రాలను అంగీకరించే ముందే ఆయా దర్శక నిర్మాతలకు చెప్పేస్తారు.
 
 అలాంటిది ఇటీవల అధికార పార్టీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ ఒక తారగా తళుకుబెళుకు దుస్తులతో ఎలాంటి హంగామా లేకుండా, పూర్తిగా కట్టుబొట్టు మార్చి సాదాసీదాగా రావడంతో అక్కడ ఉన్న వాళ్లే గుసగుసలాడుకోవడం విశేషం. దీంతో నయనతార రాజకీయరంగ ప్రవేశానికి వేళాయే అనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement