
దుర్ముఖిలో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మాండం
దుర్ముఖి నామ సంవత్సరంలో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని, గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయని, రోజురోజుకూ ప్రజాదరణను పెంచుకుంటోందని ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి అన్నారు.
♦ రోజురోజుకూ ప్రజాదరణను పెంచుకుంటోంది
♦ అన్ని రకాల కుట్రల నుంచి జగన్ బయటపడతారు
♦ ఫిరాయింపుదార్లకు భవిష్యత్తు లేదు
♦ పంచాంగ శ్రవణంలో మారేపల్లి వెల్లడి
♦ తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దుర్ముఖి నామ సంవత్సరంలో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని, గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయని, రోజురోజుకూ ప్రజాదరణను పెంచుకుంటోందని ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి అన్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పంచాంగశ్రవణం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రి ప్రవచిస్తూ గెలుపే లక్ష్యంగా... గెలుపొందే వరకూ పోరాడు అనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ముందుకెళుతూ ప్రజలకు మరింత చేరువవుతోందన్నారు. గడచిన మన్మథ నామ సంవత్సరంలో ప్రతిపక్ష పాత్రను నూరు శాతం విజయవంతంగా నిర్వహించిందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి ప్రజలను ఆకట్టుకుందని ఆయన చెప్పారు. గ్రహ సంపత్తి పార్టీకి, జగన్‌కు అనుకూలంగా ఉందని, రాబోయే రోజుల్లో అన్ని రకాల కుట్రలు, కుతంత్రాల నుంచి ఆయ న బయటపడతారని పేర్కొన్నారు. తాము ఇప్పటి వరకూ చెప్పినవన్నీ 100 శాతం నిజమయ్యాయని, వైఎస్సార్‌సీపీ విషయంలో కూడా అక్షరాలా నిజమవుతాయన్నారు.
సౌత్ ఇండియన్ పొలిటికల్ సూపర్‌స్టార్ వైఎస్ జగన్
దివంగత మహానాయకుడు రాజన్న బిడ్డగా జగన్ పార్టీ నడుపుతున్న తీరు అద్వితీయమని శాస్త్రి పేర్కొన్నారు. ఆయన రాజకీయ పోరాట పటిమను చూసి కచ్చితంగా జగన్‌ను సౌత్ ఇండియన్ పొలిటికల్ సూపర్‌స్టార్ అని యావత్ దేశం భావించే రోజు వస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు. ఆర్.కె.రోజా మహిళల తరుఫున చేస్తున్న పోరాటాలతో పాటు పలువురు నేతలు చేస్తున్న కృషి పార్టీ పలుకుబడిని పెంచుతున్నాయన్నారు. ప్రజాదరణ కోల్పోతున్న అవతలి పార్టీ(అధికారపక్షం)లోకి కొందరు ఫిరాయించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, పార్టీ వీడిన వారికి రాజకీయ భవిష్యత్తు లేనే లేదని రామచంద్రశాస్త్రి తేల్చి చెప్పారు. 60 ఏళ్ల తరువాత రాజకీయాల్లో వీఆర్‌ఎస్ తీసుకోవాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పే వారని, ఈ ఫిరాయింపులు చూస్తుంటే 45 ఏళ్లకే వీఆర్‌ఎస్ తీసుకోవాలని వెళుతున్నారేమో! అని అనిపిస్తోందన్నారు.
ఉగాది పూజలు - శుభాకాంక్షలు
ముందుగా జగన్, విజయమ్మ చేత రామచంద్రశాస్త్రి ఉగాది పూజలు జరిపించారు. ఉగాది పచ్చడిని పంపిణీ చేయగా అందరూ భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. తొలుత జగన్ మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది పర్వదినాన అంతా మంచి జరగాలని ఆకాంక్షిం చారు. అక్కా చెల్లెళ్లకు, అవ్వాతాతలకు, అన్నాదమ్ముళ్లకు, స్నేహితులు, సోదరులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. విజయమ్మ మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అందరికీ మేలు జరగాలని ఉగాది పర్వదినాన ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. పొంగులేటి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు ఎక్కువ కనుక పాడిపరిశ్రమలతో కళకళలాడాలన్నారు.
జగన్ కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది
పార్టీ నుంచి ఎంత మంది నిష్ర్కమించినా జగన్ నాయకత్వం కోసం రాష్ట్రమే కాదు, దేశం కూడా ఎదురు చూస్తోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ విషయంలో పంచాంగ పండితులు చెప్పింది నిజమ న్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటి వనరులు బాగా తగ్గిపోయి సాగు, తాగునీరు కోసం ప్రజలు కటకటలాడుతున్నారని, అందువల్ల ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలని ఆకాంక్షించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్షాలు కురుస్తాయి కానీ..
ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయి కానీ అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందన్నారు. మంత్రి స్థానంలో బుధుడు ఉన్నాడు కనుక పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్నారు. ఈ సంవత్సరంలో మనుషుల్లో స్వార్థం పెరుగుతుందని, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడ్డం ఎక్కువగా ఉంటుందని కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అమరావతి రాజధానిలో తెలుగు తేజాల విగ్రహాలు ఏర్పాటు చేస్తే నిర్మాణంలో అడ్డంకులు తొలగి పనుల్లో పురోగతి ఉంటుందన్నారు.