చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించే.. మ్యూజియాలజిస్ట్ | Sakshi
Sakshi News home page

చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించే.. మ్యూజియాలజిస్ట్

Published Sat, Aug 23 2014 11:39 PM

చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించే.. మ్యూజియాలజిస్ట్

ఒక దేశ చరిత్రను తెలుసుకోవాలంటే అక్కడ లభించే ప్రాచీన ఆనవాళ్లను, కళాఖండాలను అధ్యయనం చేయాలి. తవ్వకాల్లో లభించే ఇలాంటి వాటిని ఒకచోట చేర్చి, పరిరక్షించేవారే.. మ్యూజియాలజిస్ట్‌లు. చరిత్రను సందర్శకుల కళ్లముందుంచే మ్యూజియాలజిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు మనదేశంలో ఎన్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.  
 
ఎన్నో అవకాశాలు.
.

ప్రభుత్వ రంగంలో ప్రదర్శనశాలల్లో, ప్రైవేట్ రంగంలో ఆర్ట్ గ్యాలరీల్లో మ్యూజియాలజిస్ట్‌లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. క్యూరేటర్, డెరైక్టర్, మ్యూజియం ఎడ్యుకేషనిస్ట్, మ్యూజియం కో-ఆర్డినేటర్, కన్సల్టెంట్ తదితర కొలువులు ఉన్నాయి. ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో మ్యూజియాలజీ కోర్సులను బోధించే ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు.
 
కావాల్సిన లక్షణాలు:


మ్యూజియాలజిస్ట్‌లకు చరిత్రపై ఆసక్తి, అవగాహన ఉండాలి. చారిత్రక వస్తువులు శిథిలం కాకుండా శాస్త్రీయమైన పద్ధతిలో వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాచీన వస్తువుల సేకరణపై దృష్టి పెట్టాలి. వాటి ప్రాధాన్యతను గుర్తించగలగాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకుంటూ ఉండాలి.
 
అర్హతలు: భారత్‌లో మ్యూజియాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ అర్హతతో గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. తర్వాత పీజీ, పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే ఉన్నత అవకాశాలు దక్కుతాయి.
 
వేతనాలు: మ్యూజియాలజిస్ట్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో సీనియర్ క్యూరేటర్ లేదా డెరైక్టర్‌కు నెలకు రూ.50 వేలకు పైగానే లభిస్తుంది.
 
చరిత్రపై అవగాహన ఉండాలి!

‘‘మ్యూజియాలజీ లేదా మ్యూజియం స్టడీస్ కోర్సులు పూర్తిగా భిన్నమైనవి. చాలా తక్కువ మంది ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. భారతీయ చరిత్ర, సంప్రదాయం, ఇతిహాసాలు, పురాణాలపై అవగాహన ఉన్నవారు ఈ కోర్సులను అభ్యసిస్తే మంచి కెరీర్ సొంతమవుతుంది. కళలపై ఆసక్తి, కళాఖండాలను భద్రపరిచే లక్షణాలున్నవారు ఈ కోర్సులను చదువుతారు. లైబ్రేరియన్‌లు, చరిత్రకారులు తమ అవకాశాలను పెంచుకోవడానికి వీటిని అభ్యసిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రధానంగా మ్యూజియాల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్‌తోపాటు సంబంధిత శాస్త్రీయ అంశాలను విద్యార్థులు నేర్చుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో ఒక సబ్జెక్ట్‌గా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాం. ప్రత్యేకంగా పీజీ డిప్లొమా కోర్సును కూడా నిర్వహిస్తున్నాం. మ్యూజియాలజీ ఆసక్తికరమైన సబ్జెక్టే అయినప్పటికీ ఇందులో కెరీర్‌ను కొనసాగించాలంటే అమితమైన అంకితభావం తప్పనిసరి. చరిత్ర ఆనవాళ్లను తెలుసుకోవడానికి నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూజియాలజీ నిపుణుల అవసరం తప్పనిసరి అవుతోంది. ఈ కోర్సులు అభ్యసించిన వారికి ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. అలాగే ప్రైవేటుగా పరిశోధనలు చేసుకోవచ్చు’’

 - ప్రొ. ఎస్.మల్లేశ్, ప్రిన్సిపల్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్, ఉస్మానియా యూనివర్సిటీ
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement