పిల్లల ఆరోగ్యం పట్టదా! | Sakshi
Sakshi News home page

పిల్లల ఆరోగ్యం పట్టదా!

Published Wed, Aug 23 2017 3:22 AM

పిల్లల ఆరోగ్యం పట్టదా!

ఎంఆర్‌ టీకాపై గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిర్లక్ష్యం
- వైద్యశాఖను అనుమతించని ప్రైవేటు స్కూళ్లు
 
సాక్షి, హైదరాబాద్‌: పిల్లలకు పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న తట్టు (మీజిల్స్‌), రుబెల్లా వ్యాధుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆగస్టు 17న ఎంఆర్‌ టీకా కార్యక్రమాన్ని చేపట్టాయి. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న అందరికీ ఈ టీకాలు వేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 90,00,117 మంది పిల్లలు ఉన్నారని, వీరందరికీ ఎంఆర్‌ టీకా వేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోనూ ఎంఆర్‌ టీకా కార్యక్రమం మొదలైంది. కాగా, విద్యాధికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ టీకా వేసే ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది.

ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎంఆర్‌ టీకా అమలు తీరు సంతృప్తికరంగా లేదు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు టీకా వేయించే విషయంలో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల తీరుతోనే ఇలాంటి పరిస్థితి వస్తోందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రసిద్ధ విద్యా సంస్థలు సైతం పిల్లలకు టీకాలు ఇప్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 33,85,260 మంది పిల్లలకు టీకా వేశారు. సెప్టెంబరు 25 వరకు టీకాలు వేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ దవాఖానాల్లో ఈ టీకాలు వేయనున్నారు. బడి బయట ఉన్న పిల్లలకు సైతం టీకా వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల తీరుతో భవిష్యత్తు తరానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement