గుండెల్లో గోదావరి... | Sakshi
Sakshi News home page

గుండెల్లో గోదావరి...

Published Sat, Oct 25 2014 10:59 PM

గుండెల్లో గోదావరి...

వాళ్లు సమ్మెకు దిగితే.. వీరికిదే పని అని లోకం కోడై కూస్తుంది. రోగులను పట్టించుకోవడం లేదని ఆడిపోసుకుంటుంది. వైద్యం చదివిన విజ్ఞులు సమ్మె బాట ఎందుకు పట్టారో ఆలోచించే ప్రాజ్ఞులు కనిపించరు. థర్మామీటర్ పట్టాల్సిన చేతులు ధర్మాన్ని ఎందుకు అర్థిస్తున్నారో అడిగేవారుండరు. గుండె చప్పుడు వినేవారి గుండెల్లో బాధను పట్టించుకోరు. అందుకే నాడి చూడాల్సిన జూడాలు.. నేడీ సమ్మెకు ఎందుకు దిగారో సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా హీరో సందీప్ కిషన్ పలకరించారు. సమ్మెట పోటు వెనకున్న అసలు సత్యాన్ని వెలుగులోకి తెచ్చారు.
 
సందీప్ కిషన్: వైద్యో నారాయణో హరిః అంటారు. అంటే డాక్టర్లు మానవాళికి దేవుళ్లు. అలాంటిది మీరిలా ఏడాదికోసారి రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటి?

 గోపిచంద్: నిజమే.. కానీ ఆ దేవుడు తీర్చలేని కష్టాలుంటే ఏం చేస్తాం. చేతులు, కాళ్లు పట్టుకున్నా పని జరగడం లేదు. అందుకే వీధిలోకి వస్తున్నాం.

సందీప్ కిషన్: ఇలా ధర్నాలు చేయడం వల్ల మీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా?

ప్రవీణ్: రిక్వెస్టులు చేయడాలు.. లెటర్లు రాయడాలు అన్నీ చేశాం. దేనికీ స్పందన లేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.
 
సందీప్ కిషన్: స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేయాల్సిన మీరు విధులకు హాజరుకాకుండా సమ్మెలు చేయడాన్ని కామన్ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు కదా!

రవితేజ: మాకున్న ఇబ్బందులేంటో తెలియక సార్. మేం విధులకు హాజరుకాకుండా పేషంట్లను ఇబ్బంది పెడుతున్నామన్నది అవాస్తవం. పదింటికి ధర్నా అంటే ఉయదం 8కే ఆస్పత్రికి వెళ్లి చేయాల్సిన పనులు పూర్తి చేస్తున్నాం. రోజంతా రోడ్డుపై కూర్చోవడం లేదు. ఒకట్రెండు గంటలు ధర్నాలో పాల్గొని మిగతా సమయంలో మా విధులు మేం నిర్వర్తిస్తున్నాం.

నరేష్: కానీ మీడియాలో మాత్రం.. జూడాల సమ్మెతో రోజుకు ఇన్ని ప్రాణాలు పోయాయని వస్తోంది. సమ్మెలేని రోజుల్లోనూ ఇక్కడ వైద్యం సంగతి ఇలాగే ఉంటుందని మీడియాకి తెలియదంటారా?. మేం పని చేస్తున్నది ప్రభుత్వాస్పత్రిలో సార్. ఇక్కడ వైద్యం, జీతాలు.. అన్నీ ఆలస్యమే..

సందీప్ కిషన్: అవును.. మీకు జీతాలు ఎలా ఉంటాయి?

పృథ్వీరాజ్: 9,600 సార్. రేపు పోస్టింగ్ వచ్చాక మరో ఐదారువేలు పెరుగుతుందంతే. అదీ ఐదారు నెలలకోసారి ఇస్తారు. జీతాల కోసం కడుపుమండి ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి.

సందీప్ కిషన్: అన్నింటికీ ధర్నా, సమ్మె అనకండి భయ్యా!

రాజు:  మా సమస్య గురించి ప్రభుత్వం ఆలోచించనపుడు.. కనీసం ప్రజల దృష్టికైనా తీసుకెళ్తే వారైనా అర్థం చేసుకుంటారు కదా!

రాకేష్: మా బ్యాడ్‌లక్ ఏంటంటే.. ప్రజలకు మా సమస్యలేంటో పూర్తిగా తెలియదు. నిన్న ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్ట్ చేశారు. ‘ఏడాది పల్లెటూళ్లో పనిచేస్తే మీ సొమ్ము ఏంపోతుంది’ అని. మేం చెయ్యమని ఎప్పుడూ అనలేదు. అనకూడదు కూడా. ఈ రోజు చిన్న చిన్న అవసరాలకు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు సిటీకి వస్తున్నారంటే గ్రామాల్లో కనీస వైద్యసదుపాయాలు లేకనే కదా! ఆ లోటును భర్తీ చేయడానికి మేం ఎప్పుడూ సిద్ధమే.

 షర్మిల: మా సమస్యలను పట్టించుకోకుండా.. మేం శాంతియుతంగా చేస్తున్న సమ్మెను సమస్యగా చూపిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఆస్పత్రి, కాలేజీ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో.. ఇప్పుడు ఇక్కడ 144 సెక్షన్ విధించారంటే నమ్ముతారా?
 
సందీప్ కిషన్:  ఇప్పుడు మనం 144 సెక్షన్ పరిధిలో ఉన్నామా?

లలిత: అవును సార్.

సందీప్ కిషన్: ఓకే.. మీ సమస్యలు, పరిష్కారాలు పక్కన పెడితే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదవాడికి మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు?

రవితేజ: సార్! గాంధీ ఆస్పత్రిలో ఒక పేషంట్‌కి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ రాస్తే అతని నంబరు రావడానికి కనీసం నెల పడుతుంది. ఈలోగా అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చెప్పాం కదా! అన్నీ ఆలస్యమే. కారణం కావాల్సిన పరికరాలు, సరైన వసతులు లేకపోవడం.
 
పృథ్వీరాజ్
: అవన్నీ అనవసరం సార్. ఇన్ని దశాబ్దాల కాలంలో గాంధీ ఆస్పత్రికి వైద్యం కోసం ఒక్క రాజకీయ నాయకుడైనా వచ్చారా?
 ఏ సెలిబ్రిటీ అయినా ఇటువైపు కన్నెత్తి చూశారా? చుట్టుపక్కల జిల్లాల్లోని పేదవాళ్లకు మాత్రం అక్కడ డాక్టర్లు గాంధీకి వెళ్లండి, ఉస్మానియాకి వెళ్లండని రాసి పంపిస్తారు. ఇక్కడికి వచ్చాక పేషంట్లు తెల్లమొహం వేస్తారు.
 
ప్రశాంతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని చాలా పరిస్థితులు మారాలి. మేం డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కున్న వైద్యులం కాదు. కష్టపడి చదివాం. మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తేనే కదా.. పేషంట్లను కాపాడటానికి ఉత్సాహంగా ముందుకు రాగలుగుతాం.

సందీప్ కిషన్: ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సమ్మెలు చేయొచ్చు కానీ.. వైద్యులు రోడ్డెక్కకూడదు. నాలుగు గోడల మధ్య సెలైంట్‌గా ఆపరేషన్ చేసి ప్రాణాన్ని ఎలా నిలబెడతారో.. మీ సమస్య కూడా అంతే ప్రశాంతంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను.
 థ్యాంక్యూ.
 
సందీప్ కిషన్: ఇంతకీ మీ సమస్య ఏమిటో వివరంగా చెబుతారా?

మనోజ్: ఐదేళ్లు వైద్య విద్య పూర్తిచేసుకున్న మెడికల్ విద్యార్థులంతా ఏడాది పాటు రూరల్ సర్వీస్ చేస్తేనే డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారట.
 
సందీప్ కిషన్: అలా చేస్తేనే డాక్టర్ డిగ్రీ ఇస్తాననడం కరెక్ట్ కాదేమో, కానీ.. మిమ్మల్ని గ్రామాలకు పంపించడం మంచిదే కదా. డాక్టర్లంతా పట్నాల్లో ఉంటే.. పల్లెల గతేంటి?

పృథ్వీరాజ్: మేం గ్రామాలకు వెళ్లబోమని ఏ రోజూ అనలేదు. ఏడాది మాత్రమే టెంపరరీ బేసిస్‌పై పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వోద్యోగి గ్రామాల్లో పనిచేయాలంటే.. కనీసం ఐదేళ్లు సమయమిస్తారు. ఉదాహరణకు టీచర్‌ను తీసుకోండి.. ఏడాదికో ఊరు మారరు కదా! ఏడాదికో డాక్టర్ వచ్చిపోతుంటే గ్రామస్తులకు వైద్యునితో అనుబంధం ఎలా ఏర్పడుతుంది. హస్తవాసి అనే సెంటిమెంట్ గురించి కూడా మీకు తెలుసు కదా! వారికి డాక్టర్‌పై నమ్మకం కుదరడానికి ఏడాది టైం పడుతుంది. ఇంతలో కొత్త వైద్యుడు వస్తే ఎలా? గ్రామాల్లో వైద్యం అంటే నాలుగు మందులు.. రెండు ఇంజెక్షన్లు ఇవ్వడం కాదు. వ్యాధులు, పరిసరాల విషయంలో గ్రామస్తులను చైతన్యవంతుల్ని చేయాలి. ఇవన్నీ ఏడాదిలో ఎలా చేయగలం?.

 లలిత: లెసైన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదంటారు. అలాంటప్పుడు చేతిలో డిగ్రీ లేకుండా మేం వైద్యం చేయడం ఏమిటీ?. సిటీల్లో బోలెడన్ని ఆస్పత్రులు ఉంటాయి. సిటీలోని రోగుల వైద్యానికి ప్రొఫెసర్లు కావాలి. అదే పల్లెవాసులకు మెడికల్ డిగ్రీ లేనివాడు వైద్యం చేయాలా? ప్రజల తరఫున ఆలోచిస్తే ఇది ఎంత అన్యాయమో తెలుస్తుంది.

 రవితేజ: మాకు పర్మనెంట్ ఉద్యోగం కావాలి. అడవుల్లోని గ్రామాల్లో పడేసినా ఫర్వాలేదు. కానీ ఏడాది కోసమో.. ఆర్నెల్ల కోసమో అంటే మాత్రం ఒప్పుకోం. దీని వల్ల మా జీవితాలు బాగుపడవు.. అటు పల్లె ప్రజలకు సరైన వైద్యం అందదు.

సందీప్ కిషన్: కానీ బయట మీ గురించి టాక్ మరోలా వినిపిస్తోంది..!

రాజు: అంతే సార్. మా నోరు నొక్కడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది రూరల్ డాక్టర్ పోస్టింగ్‌కు 1,200 సీట్లు కేటాయిస్తే 16 వేల మంది జూడాలు  అప్లై చేసుకున్నారు. పల్లెలకు వెళ్లడం ఇష్టం లేకుంటే అంతమంది పోటీ పడరు కదా.

సందీప్ కిషన్: అంటే ఏడాది కాకుండా నాలుగైదేళ్లయితే మీకు ఓకేనా?

పృథ్వీరాజ్: సరిపోతుంది సార్. అలాగే పర్మినెంట్ చేస్తే నో ప్రాబ్లమ్.
 
 రిపోర్టర్ సందీప్ కిషన్
 
 

Advertisement
Advertisement