వేధిస్తే...అంతే! | Sakshi
Sakshi News home page

వేధిస్తే...అంతే!

Published Thu, Jul 30 2015 12:44 AM

వేధిస్తే...అంతే! - Sakshi

ఆకతాయిల ఆగడాలకు చెక్
కఠిన శిక్షలు.. భారీ జరిమానా
{పొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ బిల్లు సిద్ధం
అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదన
{Xన్ సిగ్నల్ వస్తే అసెంబ్లీ ఆమోదానికి...

 
సిటీబ్యూరో: అమ్మాయిలను వేధించే ఆకతాయిలూ... తస్మాత్ జాగ్రత్త. బుద్ధిగా ఉండకపోతే... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి పబ్లిక్ ప్రదేశాలతో పాటు కాలేజీలు, వ్యాపార సముదాయాల్లో యువతులు, మహిళల వెంటపడే పోకిరీలకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పే దిశగా హైదరాబాద్ పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈవ్ టీజర్లకు కఠిన శిక్షలు పడేలా రూపొందించిన ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్‌టీజింగ్ బిలు’్ల కేంద్రానికి చేరింది. అక్కడ ఆమోదముద్ర పడిన వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది అమలులోకి వస్తే... ఈవ్ టీజర్ నేరం రుజువైతే గరిష్టంగా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు... రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. తమిళనాడులో అమలులో ఉన్న ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్‌టీజింగ్ ఆర్డినెన్స్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ అండ్ హరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్’ ముసాయిదా బిల్లు రూపొందించి కేంద్రానికి పంపింది. 1998లో చెన్నైలో కాలేజీ విద్యార్థి సారిక ఈవ్‌టీజింగ్‌కు బలవడంతో తమిళనాడు ప్రభుత్వం ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 1992 నుంచి ఢిల్లీలోనూ ఇదే విధానం అమలులో ఉంది. అదే తరహాలో తెలంగాణలో సమకాలీన అవసరాలకు తగ్గట్టు బిల్లు రూపొందించారు.

 ఇదీ ‘ఈవ్‌టీజింగ్’...
మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించినా... వారిని భయపెట్టేలా చేసినా, గాయాలకు కారణమైనా...ఆ వ్యక్తిని ‘ఈవ్ టీజింగ్’ పరిధిలోనే చూస్తారు.విద్యాసంస్థలు, ఆలయాలు, ఇతర ప్రార్థన స్థలాలు, బస్ స్టాప్‌లు, రోడ్డు, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, పార్కులు, బీచ్, పండుగ ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనం, ఇతర ఏ ప్రాంతంలోనైనా మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తే జైలుకెళ్లాల్సిందే.ఒకవేళ విద్యాసంస్థల్లో జరిగితే అక్కడి ఇన్‌చార్జి ఈ విషయాన్ని పోలీసులకు తెలపాల్సి ఉంటుంది.{పజా రవాణా వాహనంలో ఈవ్‌టీజింగ్ జరిగితే బాధితురాలు ఆ విషయాన్ని సిబ్బందికి చెబితే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వాహనాన్ని తీసుకెళ్లాలి. లేదంటే పోలీసులకు సమాచారాన్ని అందించాలి. అలా చేయకపోతే సిబ్బందికి కూడా జరిమానా విధిస్తారు.

 ఇవీ శిక్షలు
ఈవ్‌టీజింగ్/వేధింపులు: రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా.బాధితురాలు మరణిస్తే: నిందితుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష. అవసరమనుకుంటే శిక్షా కాలం పెరుగుతుంది. రూ.30 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు జరిమానా. ఆత్మహత్య చేసుకుంటే: నిందితుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష. రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు జరిమానా.
 గాయపడితే: నిందితుడికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష. రూ.30 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు జరిమానా.
 
కేంద్రంతో సంప్రదిస్తున్నాం
 ‘తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ అండ్ హరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్’ ముసాయిదా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాం. వేధింపులకు గురవుతున్న మహిళల రక్షణ కోసం ఈ బిల్లును కేంద్రానికి పంపాం. తమిళనాడుతో పోల్చుకుంటే ఇక్కడ నేర తీవ్రతను పెంచడంతో పాటు జరిమానాను కూడా భారీ మొత్తంలో పెంచాం. దీనివల్ల మహిళలపై వేధింపులు తగ్గే అవకాశముంది. ప్రధానంగా నగరంలో ఈవ్‌టీజింగ్ తరహా వేధింపులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇప్పటికే షీటీమ్‌లు సమర్థంగా పని చేస్తుండటంతో పోకిరీల ఆగడాలు గణనీయంగా తగ్గాయి.     
  -స్వాతి లక్రా,
 హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు)
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement