విభజన చట్టం, టీఆర్‌ఎస్ హామీలపై అధ్యయనం | Sakshi
Sakshi News home page

విభజన చట్టం, టీఆర్‌ఎస్ హామీలపై అధ్యయనం

Published Tue, Jul 7 2015 1:47 AM

విభజన చట్టం, టీఆర్‌ఎస్ హామీలపై అధ్యయనం - Sakshi

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని అంశాలు, టీఆర్‌ఎస్ హామీలు, ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ లోతుగా అధ్యయనం చేస్తుందని, దాని కోసం మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించా రు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు. ఒక స్వచ్ఛంద సంస్థతో వాటర్‌గ్రిడ్‌పై పరిశీలన చేయిస్తామన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలు, సాంకేతిక అంశాలపైనా లోతుగా అధ్యయనం చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం తర్వాత ఆయా పథకాలపై కార్యాచరణను నిర్ణయించుకుంటామని వెల్లడించారు. 17 మందితో కూడిన అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని పునరుద్ధరిస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలు, పనుల పరిశీలనకు మరిన్ని ఉపకమిటీలు వేసి, లోతుగా అధ్యయనం చేసి ఏఐసీసీకి నివేదిక ఇస్తామని సురేశ్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement