‘బావర్చి హోటల్‌’ సీజ్‌ | Sakshi
Sakshi News home page

‘బావర్చి హోటల్‌’ సీజ్‌

Published Thu, Jul 28 2016 8:33 AM

హోటల్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారం

► మునిసిపల్‌ అధికారుల దాడి
► పరిశుభ్రత లోపించడంతో మూసివేత


బోడుప్పల్‌: పరిశుభ్రత పట్టని ఓ హోటల్‌ను పీర్జాదిగూడ మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఉప్పల్‌ డిపో వద్ద ఉన్న బావర్చి హోటల్‌పై మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, శానిటరీ అధికారులు కలిసి బుధవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. వివరాలు.. బావర్చి హోటల్‌ వెనుక వైపు గల మ్యాన్‌హోల్‌ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్‌ వెనుక ఉన్న మ్యాన్‌హోల్‌ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. 

 

అధికారులు సదరు హోటల్‌లోని కిచెన్‌ను పరిశీలించారు. కిచెన్‌ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్‌ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్‌ను సీజ్‌ చేశారు. దాడిలో శానిటరీ ఇంజినీర్‌ సుక్రుతారెడ్డి, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement