వర్ణ సంగమం | Sakshi
Sakshi News home page

వర్ణ సంగమం

Published Sat, Oct 10 2015 12:24 AM

వర్ణ సంగమం

12 నుంచి బతుకమ్మ వేడుకలు
ఘనంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు
వివిధ జంక్షన్లలో వంద భారీ బతుకమ్మలు

 
 సిటీబ్యూరో: మహా నగరం రంగు రంగుల పూల వనంగా మారనుంది. బంగారు బతుకమ్మ ఉత్సవాలకు గ్రేటర్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 12 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ  బతుకు చిత్రానికి... సంప్రదాయానికి... సంస్కృతికి... సబ్బండ వర్ణాల కళలు... ఆకాంక్షలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. సోమవారం నుంచి మహిళలు బతుకమ్మ ఆటలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికి తగిన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.నగరం నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్న నేపథ్యంలో... అన్ని ప్రాంతాల నుంచి అటువైపు వెళ్లే ప్రధాన రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీధి దీపాలు, ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేయనుండడంతో బతుకమ్మలు కొత్త కాంతులతో తళుకులీననున్నాయి. బతుకమ్మ విశిష్టతను చాటేలా... నగరమంతా పూలవనంలా మార్చేందుకువంద చోట్ల భారీ హోర్డింగులు, యూనిపోల్స్‌తో ప్రత్యేక ప్రచారం  నిర్వహించనున్నారు.

దాదాపు వంద ప్రధాన కూడళ్లలో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేయనున్నారు. వంద బస్ షెల్టర్లు, మరో వంద ప్రాం తాల్లో ప్రత్యేకంగా రూపొందిస్తున్న త్రిభుజాకార ఫ్రేమ్స్ తదితరమైన వాటి తో ప్రచారం చేయనున్నారు. ఎన్నో వన్నెల బతుకమ్మలు.. వాటి చుట్టూ పాటలు పాడుతూ.. మహిళలు ఆటలాడే రమణీయ దృశ్యాలను కనువిందు చేసేలా హోర్డింగులపై చిత్రీకరించనున్నారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీలు), ఆర్చిలన్నింటినీ పూలతో ముస్తాబు చేయాలని... దేశ, విదేశీ పర్యాటకులకు బతుకమ్మ ఉత్సవాల విశిష్టత తెలిపి వారి మనసు దోచుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మహా నగర పాలక సంస్థ నిర్ణయించింది. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిధిలో స్థానికంగా బతుకమ్మలను ఆడే మహిళలు...వాటిని నిమజ్జనం చేసేం దుకు వివిధ చెరువుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లివీ...
ట్యాంక్‌బండ్‌పై గత సంవత్సరం ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ రంగు రంగుల విద్యుల్లతలను తోరణాలుగా అమర్చే పనులు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల వద్ద అవసరమైనన్ని తాత్కాలిక లైట్లతో పాటు రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రధాన రహదారుల్లోని సెంట్రల్ మీడియన్లలోనూ రంగుల విద్యుల్లతలను ఏర్పాటు చేయనున్నారు.  నెక్లెస్ రోడ్డు, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ సహా వివిధ జంక్షన్లలో 5-9 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మలను సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రదర్శన లో ఉంచనున్నారు. దీని కోసం వివిధ డిజైన్లు, రకరకాల పూలతో కూడిన బతుకమ్మ నమూనాలను పరిశీలిస్తున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement