రూ. 6 వేల కోట్ల లూటీకి ఏపీ కేబినెట్ ఓకే

రూ. 6 వేల కోట్ల లూటీకి ఏపీ కేబినెట్ ఓకే - Sakshi


సాగునీటి ప్యాకేజీల్లో రూ. 6 వేల కోట్ల లూటీకి కేబినెట్ ఓకే

అంచనా వ్యయం పెంపులో భారీ కుంభకోణం

ఆమోదించలేదని 15న అబద్ధమాడిన మంత్రి నారాయణ

ఆమోదించినట్లు 16న బైటపెట్టిన మంత్రి దేవినేని

ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించినా పట్టించుకోని మంత్రివర్గం

ఫైలు రెండోసారి కేబినెట్‌కు ఎందుకు వచ్చిందో అడగని మంత్రులు

మౌనంగానే అవినీతి బాగోతానికి ఆమోదం




సాక్షి, హైదరాబాద్: అనుకున్నదే జరిగింది. ఇరిగేషన్‌లో భారీ కుంభకోణానికి కేబినెట్ నిస్సిగ్గుగా ఆమోదముద్ర వేసేసింది. ఇద్దరు ప్రధానకార్యదర్శులు సంతకం చేయడానికి తిరస్కరించినా రెండుసార్లు మంత్రివర్గం ఆమోదించేసిందంటే ఈ కుంభకోణం విషయంలో ప్రభుత్వం ఎంత పచ్చిగా వ్యవహరించదలచుకుందో తేలిపోయింది. 15న మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి నారాయణ  హంద్రీ-నీవా, గాలేరు-నగరి అంచనా వ్యయం పెంపు విషయంలో ఏమీ నిర్ణయించలేదని అబద్ధమాడేశారు. అయితే ఇక దాచడానికి ఏమీ లేదన్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం అంచనాల పెంపు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో బైటపెట్టేశారు. ఇక జీవో వెలువడడమే తరువాయి. ‘చినబాబు’ స్క్రీన్‌ప్లేలో.. ‘పెదబాబు’ డెరైక్షన్‌లో రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడానికి రంగం సిద్ధమైనట్లే.



అదేమని ప్రశ్నించని మంత్రులు..



అంచనాల పెంపు ప్రతిపాదనల స్థాయి నుంచి మంత్రివర్గం ఆమోదించిన వరకు.. అన్ని దశల్లోనూ యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. ఇరుక్కుంటామన్న భయంతోనే ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంచనాల పెంపు ప్రతిపాదనలపై సంతకం చేయడానికి నిరాకరించారు. అయితే ఆ విషయాలను మంత్రులెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. గతంలో ఆమోదం తెలిపిన ప్రతిపాదనే మళ్లీ మంత్రివర్గం ముందుకు ఎందుకు వచ్చిందన్న విషయాన్నీ మంత్రులు ప్రశ్నించలేదు. ఏ కారణంతో మళ్లీ మంత్రివర్గం ముందుకు వచ్చిందనే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా వివరించలేదు. కానీ రూ. 6 వేల కోట్ల అవినీతి వ్యవహారానికి మంత్రివర్గం మౌనంగా ఆమోదముద్ర వేసేయడం గమనార్హం.



అవినీతి వ్యవహారం కనుకనే...



సోమవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఐఅండ్‌పీఆర్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి అంచనాల వ్యయం పెంపులో రూ. 6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన తర్వాత కూడా ఆమోదం కోసం మరోసారి మంత్రివర్గం ముందుకు వెళుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగిన నేపథ్యంలో.. ఆ అంశం గురించి మంత్రులు ప్రస్తావిస్తారని అంతా అనుకున్నారు. కానీ దాన్ని ముట్టుకుంటే ఇబ్బందులొస్తాయన్నట్లుగా మంత్రులు వ్యవహరించారు. గుట్టుచప్పుడు కాకుండా కుంభకోణానికి ఆమోదం తెలిపి సొమ్ములు పంచేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే మంత్రులు ఆ విషయాన్ని వెల్లడించలేదని అధికార వర్గాల సమాచారం. అంచనాల పెంపు ప్రతిపాదన ఏమయిందంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా.. ఆమోదం తెలిపిన విషయాన్ని మంత్రులు బైటపెట్టలేదు. ‘సాగునీటి అంశాన్ని చర్చించాం. సాగునీటి శాఖ అధికారులను మరోసారి సమీక్షించుకొని రమ్మన్నారు. అంతే. ఇంకేమీ లేదు’ అని మంత్రి నారాయణ అబద్దమాడేశారు. అయితే 24 గంటలు ముగియకముందే.. అసలు విషయం బైటపడింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అంచనాల వ్యయం పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. మంత్రులు ఇలా మాట మార్చడం వెనక అంతరార్థం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.



లీకులపైనే సీఎం ఆందోళన.. అవినీతిపై కాదు..



మంత్రివర్గ సమావేశంలో.. అంచనాల పెంపు ప్రతిపాదనలను ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించిన సమాచారం ‘సాక్షి’కి ఎలా చేరిందనే అంశం మీద చర్చించారే తప్ప, అడ్డగోలు అవినీతి వ్యవహారం గురించి చర్చించే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు మీడియాకు చేరకుండా జాగ్రత్త పడాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించడానికే పరిమితమయ్యారే కానీ, అవినీతికి పాల్పడవద్దని హితవు చెప్పలేకపోయారు. అవినీతి వ్యవహారాలు మీడియాకు లీక్ అయితే సంబంధిత మంత్రి, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలని చెప్పిన చంద్రబాబు.. అవినీతి జరిగితే బాధ్యత వహించాలని హెచ్చరించలేకపోయారు. అక్రమార్కులతో అంటకాగుతున్న ఫలితంగానే అవినీతి విషయంలో ముఖ్యమంత్రి మెతకవైఖరి అవలంభించాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పారదర్శకత గురించి పదేపదే కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంచనాల పెంపు వ్యవహారంలో స్వయంగా పారదర్శకతకు పాతరేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే అండగా నిలిచి, మంత్రివర్గంలోనే అవినీతి భాగోతానికి ఆమోదముద్ర వేస్తే.. జల వనరుల శాఖ అవినీతికి అడ్డాగా మారిపోతుందని, ప్రజా ధనాన్ని దోచుకోవడానికి అవినీతిపరులు ఈ శాఖను వేదికగా చేసుకుంటారనే ఆందోళన ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top