భూమి ఆకర్షణ శక్తి కోల్పోతే? | Sakshi
Sakshi News home page

భూమి ఆకర్షణ శక్తి కోల్పోతే?

Published Sun, Dec 21 2014 1:08 AM

భూమి ఆకర్షణ శక్తి కోల్పోతే?

కొన్ని సంఘటనలు గుర్తువచ్చినప్పుడు అలా చేసి ఉండకూడదు, ఇలా చెయ్యాల్సింది అనిపిస్తుంది. అలాంటి సంఘటనలు నాకైతే ఎన్నో.... వాటిల్లో చాలా ముఖ్యమైనది ఇది నాకు! అప్పుడు నేను ఫిఫ్త్ ఫార్మ్ చదువుతున్నాను. ఇంగ్లిష్‌లో మా భావప్రకటనా సామర్థ్యాన్ని  పెంచుకోవడానికీ, కొత్త పదాలు తెలుసుకోవడానికీ, ఆ పదాలని వాక్యాలలో ప్రయోగించే పద్ధతి నేర్చుకోవడానికీ మాకు ఏదైనా ఒక విషయం ఇచ్చి, దాని మీద ఒక వ్యాసం రాసి హోమ్‌వర్కులా ఇచ్చేవారు మా ఇంగ్లిష్ మాస్టారు, ముఖ్యంగా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు.
 
 ఆ రోజు, మేం రాసి చూపించవల్సిన అంశం: ‘కొన్ని క్షణాలు భూమ్యాకర్షణ శక్తి లేకపోతే ఏమౌతుంది?’
 ‘వాట్ హేపెన్స్ ఇఫ్ ఎర్త్ లూజెస్ ఇట్స్ గ్రేవిటేషనల్ ఫోర్స్ ఫర్ ఏ సెకండ్?’ అన్న దాని గురించి మేం రాయాలి. రెండు రోజులు సెలవులు. మూడో రోజు మాస్టారికి చూపించాలి. మేం హైస్కూల్‌లో ఉన్నప్పటికి దూరదర్శన్ కనిపెట్టి ఉండరు. ఇంక అలాంటిది ఉంటుందనేది మా ఊహకందని విషయం. సైన్స్ ఇప్పుడంత అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి జరిగినంతవరకూ తెలుసుకునే కమ్యూనికేషన్ వ్యవస్థ ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. భూమ్యాకర్షణ శక్తి లేకపోతే ఏమౌతుందో చెప్పేందుకు, మేం చూసేందుకు టీవీలేదు. కాంపోజిషన్ రాయకుండా ఎవరూ ఉండరు. ఇది రాయాలి. కానీ అసలేమో తెలియని విషయం ఎలా రాయాలి?
 
 నా సమస్య భాస్కర్ అన్నయ్యతో చెప్పాను. వాడు మా మూడో అంటే బుల్లి అన్నయ్య. వాడు అప్పటికి ఎమ్‌బీబీయస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చాడు. భూమి తన ఆకర్షణ శక్తి కోల్పోతే ఏమౌతుందో చెప్పాడు. రాసి ఇచ్చాడు. ‘‘నేను కాఫీ తాగిన కప్ కింద పెట్టాను. అది పైకి ఎగిరింది. నేను గాలిలో తేలుతున్నాను’’ ఇలా ఒక పేజీ రాశాను. అన్నయ్యంత ఆసక్తికరంగా చెప్పలేను నేను. వాడు చెప్పినది అన్నీ మరిచిపోయి వింటారెవరేనా! నేను ఆశ్చర్యంగా, ఉత్సుకతతో విన్నాను. వాడు రాసిచ్చినది, నా చేతిరాతతో కాపీ చేశాను. మర్నాడు క్లాస్‌లో నేను తప్ప, ఎవరూ ఈ వ్యాసం రాయలేదని నాకు తెలిసింది. ఎవరూ రాయలేదు సరే, రాయనందుకు ఎవరూ బాధపడుతున్నట్లు కూడా కనిపించలేదు.
 
 మాస్టారు క్లాస్‌లోకి వచ్చారు. పాఠం చెప్పి వెళ్ళిపోయారు. వ్యాసం రాశారా అని అడగలేదు. బహుశా అంత పెద్ద విషయం మేం రాయలేమనుకుని అడిగి ఉండరు. క్లాస్‌లో ఎవరూ రాయలేదు నేను తప్ప. నేను ఒక్కదాన్నీ చూపిస్తే మిగిలినవాళ్లు రాయని పిల్లలవుతారు కదా! అంతేకాక, యాభై ఏళ్ళక్రితం విద్యార్థులు టీచర్స్‌ని తమంతట తాము ఏదీ అడగడానికీ, మాట్లాడడానికీ సాహసం చేసేవారు కాదు. నేను ఆ వ్యాసం రాసినట్లు మాస్టారికి చెప్పలేదు, దిద్దడానికి చూపించలేదు. ‘వెరీగుడ్’తో మార్కులు వేయించుకోలేదు. కానీ ఇవేవీ బాధకలిగించలేదు నాకు. నేను విధేయతతో హోమ్‌వర్క్ చేశాను. అది మాస్టారికి తెలియలేదు కదా అనుకున్నాను. ఇంకా బాధాకరమైన విషయం, అంత ‘అద్భుతమైన వ్యాసం’ నాకు మాత్రమే పరిమితమైపోవడం!
 
 అంతకంటే జీవితాంతం మా కుటుంబంలో అందరం మర్చిపోలేని బాధ, అది రాసిన మా మూడో అన్నయ్య పాతికేళ్లు రాకుండానే అకస్మాత్తుగా ఒక రోజు జ్వరంతో అందర్నీ విడిచిపెట్టి ఇంకొక లోకానికి వెళ్ళిపోవడం! వాడు రాసిన ఆ వ్యాసం నా దగ్గర ఇప్పటికీ జాగ్రత్తగా ఉంది. అప్పుడప్పుడు చదువుతుంటాను. అంత గొప్ప ఉన్నతమైన అన్నయ్యకి చెల్లెల్లా ఉండేంత గొప్పదాన్ని అయుండను నేను. అందుకే దేవుడు తీసుకెళ్ళిపోయింటాడు.
 ఇప్పటికీ ఆ వ్యాసం కళ్ళముందు కనిపించే వర్ణనలా, కథలా అనిపిస్తుంది. అంతమంచి ఆర్టికలే మాస్టారికి చూపించనందుకు ఇప్పటివరకూ నాకు బాధగానే ఉంది. ఇది ఇలా రాశాక అది కొంతైనా తగ్గింది.
 - దువ్వూరి జానకీ స్వర్ణ
 నాగోల్, హైదరాబాద్

Advertisement

తప్పక చదవండి

Advertisement