ది యంగ్‌ మ్యాన్‌ అండ్‌ ది సీ | Sakshi
Sakshi News home page

ది యంగ్‌ మ్యాన్‌ అండ్‌ ది సీ

Published Sun, Apr 23 2017 1:00 AM

ది యంగ్‌ మ్యాన్‌ అండ్‌ ది సీ

హెమింగ్వే ‘ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ ది సీ’ నవల ఉత్త నవల మాత్రమే కాదు... జీవనసారాన్ని కాచి వడబోసిన అక్షర సముదాయం. ‘ప్రతి రోజూ ఒక కొత్త రోజే... అదృష్టం ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది’‘మనిషి పుట్టింది ఓడిపోవడానికి కాదు’ ‘మనిషిని నాశనం చేయగలమేమోగానీ... ఓడించలేము’ఈ విలువైన వాక్యాలను మరోసారి గుర్తుకు తెచ్చే  సంఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది. 21 ఏళ్ల  రొలాండో ఒమంగాస్‌ తన మామయ్య రెనిల్‌తో కలిసి చేపల వేట కోసం శాంటోస్‌ తీరం నుంచి ఒక ఓడలో బయలుదేరాడు. కొద్దిరోజులకు దురదృష్టం వారిని పనిగట్టుకొని పలకరించింది.

తుఫాను దెబ్బకు రొలాండో, రెనిల్‌లు మదర్‌ బోట్‌ నుంచి వేరు పడి చిన్న బోట్‌లో చిక్కుకుపోయారు. పడవే వారికి దిక్కయింది. దీనిలో ఇంధనం లేదు. పైకప్పు కూడా లేదు. మెల్లగా తోసుకుంటూ పోవడం తప్ప మరో దారి లేదు. ఒక వైపు ఎండ, మరోవైపు దాహం... వర్షం పడినప్పుడే దాహం తీర్చుకునే అవకాశం ఉండేది. నెల రోజుల తరువాత రొలాండో మామయ్య రెనీల్‌ ఆకలికి తట్టుకోలేక చనిపోయాడు. వారం రోజులు శవం పక్కనే గడిపిన  ఒమంగాస్, వాసన రావడంతో ఆ శవాన్ని నీళ్లలో పడేశాడు. ఎంత ధైర్యవంతుడికైనా ఏ చిన్ని ఆశా చిగురించని దుర్భర సమయం అది. అయినా మనసులో ఒక చిన్న ఆశ.

 ‘ప్రతి రోజూ ఒక కొత్త రోజే... ఆ రోజులో అదృష్టం ఎక్కడో ఒక చోట దాగుంటుంది’. దూరంగా కనిపించే ఓడలను చూస్తూ... చేతులు  ఊపేవాడు. అటు నుంచి ఎలాంటి స్పందన ఉండేది కాదు. అయినా ఏదో ఆశ... వర్షపు నీళ్లు తాగుతూ, నాచు తింటూ, అడపాదడపా దొరికే చేపలను పచ్చిగా తింటూ ప్రాణాల్ని నిలుపుకుంటూ న్యూబ్రిటన్‌ ద్వీప తీరానికి చేరుకున్న రోలాండో పడవను ఎట్టకేలకు ఒక  ఓడలో ఉన్న జపాన్‌ మత్స్యకారులు చూసి రక్షించారు. హెమింగ్వే బతికి ఉంటే ‘ది యంగ్‌ మ్యాన్‌ అండ్‌ ది సీ’ పేరుతో మరో నవల రాసి ఉండేవాడేమో!

Advertisement
Advertisement