దానివల్ల హార్ట్‌ఎటాక్‌ రావచ్చంటున్నారు? | Sakshi
Sakshi News home page

దానివల్ల హార్ట్‌ఎటాక్‌ రావచ్చంటున్నారు?

Published Sat, Feb 18 2017 10:57 PM

దానివల్ల హార్ట్‌ఎటాక్‌ రావచ్చంటున్నారు? - Sakshi

మా వారికి ఆరు నెలల క్రితం గుండె ఆపరేషన్‌ జరిగింది. ఈ సమయంలో భార్యాభర్తలు కలవడం అంత మంచిది కాదని, ఆయనకు హార్ట్‌ ఎటాక్‌ రావచ్చునని అంటున్నారు. ఇది నిజమేనా? ఎంతకాలం వెయిట్‌ చేస్తే మంచిది? ఒకవేళ కలిసే వీలుంటే... ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్పగలరు.
– జీకె, కొత్తగూడెం

గుండె ఆపరేషన్‌ తర్వాత కనీసం 2 నెలల పాటు వైవాహిక జీవితానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. తర్వాత గుండె పనితీరు, ఎలా ఉంది, కుట్లు పూర్తిగా మానిపోయాయా లేదా, అతని శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉంది... వంటి అనేక అంశాలను బట్టి, డాక్టర్‌ సలహా మేరకు సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఆపరేషన్‌ తర్వాత, సాధారణ వాకింగ్‌తో ఆయాసం లేకుండా ఉండి, రెండు అంతస్తుల మెట్లు ఆయాసం లేకుండా ఎక్కగలిగినప్పుడు, సెక్స్‌లో భయం లేకుండా పాల్గొనవచ్చు. ఆయన ఛాతీ మీద ఎక్కువ ఒత్తిడి, బరువు పడకుండా కలవవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే ఛాతీ కింద మెత్తటి దిండు పెట్టుకుని ప్రయత్నించవచ్చు.

కొన్ని విటమిన్‌ల లోపం వల్ల గర్భిణులలో ‘న్యూరోలాజికల్‌ డ్యామేజ్‌’ ఏర్పడుతుందని, ‘మిస్‌ క్యారేజి’ జరిగే అవకాశం ఉందని చదివాను. ‘న్యూరోలాజికల్‌ డ్యామేజ్‌’ అంటే ఏమిటి? గర్భిణిగా ఉన్న సమయంలో ఎలాంటి విటమిన్‌లు అవసరం అవుతాయి? వాటి కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– జె.ఆర్, తుని

న్యూరోలాజికల్‌ డ్యామేజ్‌ అనేది విటమిన్‌ లోపం వల్లే రాదు; బిడ్డ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అనేక కారణాల వల్ల, తల్లి నుంచి బిడ్డకు అందవలసిన రక్త సరఫరా సరిగా లేనప్పుడు, బిడ్డకు ఆక్సిజన్‌ సరిగా అందకపోవడం వల్ల, బిడ్డ మెదడుకు రక్తం, ఆక్సిజన్‌ సరిపోక, మెదడులోని కణాలు, సరిగా ఎదగకపోవడం, మెదడు దెబ్బతినడం వల్ల న్యూరోలాజికల్‌ డ్యామేజ్‌ జరుగుతుంది. కొందరిలో కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల, తల్లిలో బీపీ పెరగడం, రక్తనాళాలలో రక్తం గూడుకట్టడం... వంటి అనేక కారణాల వల్ల శిశువు మెదడు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లిలో అయోడిన్‌ చాలా తక్కువగా ఉండటం వల్ల, థైరాయిడ్‌ హార్మోన్‌ బాగా తక్కువగా ఉండటం వల్ల, గర్భంలో శిశువు మెదడు సరిగ్గా ఎదగకపోవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి మూడు నెలలు, శిశువు మెదడు ఎదుగుదలకు కీలకం. ఈ సమయంలో ఫోలిక్‌యాసిడ్‌తో పాటు, మల్టీ విటమిన్‌ మాత్రలు, పాలు, పండ్లు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. న్యూరోలాజికల్‌ డ్యామేజ్‌వల్ల అబార్షన్లు అవ్వవు. కాకపోతే, బిడ్డ పుట్టిన తర్వాత, మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తలెత్తుతాయి.

నా వయసు 31 సంవత్సరాలు. పదహారు సంవత్సరాల క్రితం నాకు పెళ్లయింది. మా వారికి బ్లడ్‌ టెస్ట్‌లో హెచ్‌బియస్‌ ఏజీ పాజిటివ్‌ అని వచ్చింది. నాకు పిల్లలకు టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌ అని వచ్చింది. మావారు కండోమ్‌లాంటివి ఎలాంటి సేఫ్టీ యూజ్‌ చేయరు. ఫ్యూచర్‌లో ఏమైనా సమస్య వస్తుందా? హెచ్‌బియస్‌ ఏజీ అంటే ఏమిటి? దీనికి ఏమైనా చికిత్స అవసరమా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మావారికి ఆల్కహాల్, నాన్‌వెజ్‌ తీసుకునే అలవాటు లేదు.
– ఒక సోదరి, కరీంనగర్‌

శరీరంలో హెపటైటిస్‌–బి అనే వైరస్‌ ప్రవేశించడం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను హెపటైటిస్‌–బి ఇన్‌ఫెక్షన్‌ అంటారు. ఇది హెపటైటిస్‌–బి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవాళ్లతో సెక్స్‌ వల్ల, వారు వాడిన సిరెంజ్‌లు వాడటం వల్ల, ఇన్‌ఫెక్షన్‌తో కూడిన రక్తం ఎక్కించుకోవడం వల్ల, డెలివరీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశం ఉంటుంది. ఈ వైరస్‌ లివర్‌ పనితీరు మీద ప్రభావం చూపి, దానిని దెబ్బతీస్తుంది. కొందరిలో ఇన్‌ఫెక్షన్‌ను ఎక్కువ కలగజేసి తర్వాత అదే తగ్గిపోతుంది. కొందరిలో మాత్రం ఈ వైరస్‌ రక్తంలో, శరీరంలోనే ఉండిపోయి, క్రానిక్‌ హెపటైటిస్‌–బిని కలగజేస్తుంది. ఏఆSఅజ అంటే హెపటైటిస్‌–బి వైరస్‌ మీద ఉండే యాంటిజన్‌. బ్లడ్‌ టెస్ట్‌లో ఏఆSఅజ ఉందని తేలితే, హెపటైటిస్‌–బి వైరస్‌ వారి రక్తంలో ఉందన్నమాట. కాకపోతే ఈ వైరస్‌ నిద్రావస్థలో ఉందా, యాక్టివ్‌గా ఉందా అనే దాని బట్టి, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, వేరేవారికి సోకే అవకాశాలు, వారికి హాని కలిగించే లక్షణాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. మీవారికి ఉండే హెపటైటిస్‌–బి ఇన్‌ఫెక్షన్‌ ఎటువంటిదో, దాని తీవ్రత తెలుసుకోవడానికి ఒకసారి ఫిజీషియన్‌ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి అవసరమైన పరీక్షలు(HBSAg, HBSAb, Viral DNA load, LRT)  చెయ్యించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మీ టెస్ట్‌ నెగెటివ్‌ వచ్చింది కాబట్టి, మీరు హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌ మూడు డోస్‌లు తీసుకోవాలి. ఈ లోపల కండోమ్స్‌ వాడటం మంచిది.


డా‘‘ వేనాటి శోభ
లీలా హాస్పిటల్‌
మోతీనగర్, హైదరాబాద్‌

Advertisement
Advertisement