యాక్టివ్ ఫ్లో | Sakshi
Sakshi News home page

యాక్టివ్ ఫ్లో

Published Mon, Mar 30 2015 12:33 AM

యాక్టివ్ ఫ్లో - Sakshi

లేడీస్ క్లబ్
సిటీలో భారీస్థాయి వ్యాపారాన్ని ప్రారంభించేవారైనా, ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ఈవెంట్స్ నిర్వహించేవారైనా.. ఆ లేడీస్ ఆర్గనైజేషన్ వైపు చూడాల్సిందే. సదరు ఆర్గనైజేషన్ సభ్యులు తమ ఆహ్వానితుల జాబితాలో ఉండాలని తహతహలాడాల్సిందే. అదే..ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. నగరంలో ఈ పేరు తెలియని బిగ్‌షాట్స్ ఉండరు. నగర వ్యాపార సామ్రాజ్యం ముద్దుగా ఫ్లో (ఎఫ్‌ఎల్‌ఓ) అని పిలుచుకునే ఈ లేడీస్ ఆర్గనైజేషన్ అన్ని విధాలుగానూ ప్రత్యేకమైనదే.
 ..:: ఎస్.సత్యబాబు
 
ఔత్సాహిక వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఎగ్జిక్యూటివ్స్, అంతేకాకుండా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలనుకున్న గృహిణులు సైతం సభ్యులుగా కళకళలాడేదే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా పనిచేసే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఇది అనుబంధ విభాగం. ఢిల్లీ ప్రధాన కేంద్ర ంగా కలిగిన ఫిక్కీకి మన నగరంతో పాటు ముంబై, కోల్‌కతా, గువాహటి, కోయంబత్తూర్, జైపూర్‌లోనూ చాప్టర్స్ ఉన్నాయి.
 
ప్రోత్సాహమే పరమా‘విధి’...
మహిళా స్వయం సాధికారతను, మహిళల్లో విభిన్న నైపుణ్యాలను ప్రోత్సహించడమే ఫిక్కీ ప్రధానోద్దేశం అని ఆ సంస్థ చైర్‌పర్సన్ మోనికా అగర్వాల్ అంటున్నారు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన ఎడ్యుకేషనల్, వొకేషనల్ ప్రోగ్రామ్స్, టాక్స్, సెమినార్స్, ప్యానెల్ డిస్కషన్స్, వర్క్‌షాప్స్ వంటి ఈవెంట్స్ నిర్వహిస్తోంది ఫిక్కీ. ఈ సంస్థ నిర్వహిస్తున్న పలు ఈవెంట్లు సిటీవాసుల్లో ఆసక్తి రేకెత్తించేవిగా ఉంటాయి. నగరానికి చెందిన పలువురు విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తలను గుర్తించి వారిని తగిన పురస్కారాలు అందిస్తుంటుంది కూడా. పలు రంగాల్లో మహిళలకు సలహాలు, సూచనలు అందించేందుకు నగరంలో బిజినెస్ కన్సల్టెన్సీ సెల్‌ను కూడా నిర్వహిస్తోంది.
 
పేజ్ త్రీ నుంచి..
సిటీలోని పేజ్ త్రీ సోషలైట్స్ నుంచి పేరొందిన టాప్ ప్రొడక్ట్స్ తయారీదారుల దాకా ఈ ఆర్గనైజేషన్‌లో సభ్యులే. నగర సోషలైట్ పింకీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ రేఖాలహోటి, ఎక్స్‌పో నిర్వాహకురాలిగా పేరొందిన కామినిషరాఫ్.. ఇలాంటి వారెందరో ఫిక్కీ సభ్యులుగా ఉన్నారు. వ్యాపార రంగంలో ప్రవేశించిన మహిళలు.. లక్ష్యం దిశగా సాగే క్రమంలో ఫిక్కీతో దోస్తీ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎనర్జిటిక్ టాక్‌ల నుంచి ఎంటర్‌టైనింగ్ ఎగ్జిబిషన్‌ల దాకా నగరంలో పలు ఈవెంట్లు జరుగుతుంటాయి. ‘నెలకు కనీసం 2 యాక్టివిటీస్ తప్పకుండా నిర్వహిస్తున్నాం. మహిళల స్వయం సాధికారతకు, వారి వ్యాపార విస్తృతికి, విభిన్న రంగాల్లో వారు రాణించేలా చేసేందుకు తోడ్పడుతున్నాం’ అని చెప్పారు మోనికా అగర్వాల్.

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి వారి జీవితానుభవాలనే తమ సభ్యులకు పాఠ్యాంశాలుగా మార్చడంలో ఫిక్కీకి సాటిలేదు. గత నెలలో ఐఎస్‌బీలో ఈ-కామర్స్ మీద నిర్వహించిన ఈవెంట్, ఈ నెలలో సినీనటి, దియామీర్జాను ఆహ్వానించి నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లు ఫిక్కీ నిర్వహించే కార్యక్రమాల్లో వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఆఫీసు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఫిక్కీ.. నగర మహిళల్లో వ్యాపార, సాంకేతిక పరమైన అంశాలలో చైతన్యం పెంచేందుకు నిర్విరామ కృషి చేస్తోంది.

ఈ ఆర్గనైజేషన్‌కు చైర్‌పర్సన్, సెక్రటరీ, ఇలా మొత్తం ఐదుగురి ఆధ్వర్యంలో గవర్నింగ్ బాడీ ఉంది. రెండేళ్లకు ఒకసారి ఈ గవర్నింగ్ బాడీ మారుతూ ఉంటుంది. ‘మా సభ్యుల సంఖ్య 450కి పైగానే. దేశంలో పెద్ద సంఖ్యలో సభ్యులున్న ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మాది’ అని సగర్వంగా చెబుతారు మోనికా అగర్వాల్. మధ్యతరగతి మహిళలు సైతం తమ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందే విధంగా భవిష్యత్తు ప్రణాళికలు
 రచిస్తున్నామన్నారామె.
 
మహిళల కోసం మహిళలు..
సిటీలో మా కార్యకలాపాలన్నీ మహిళల అభివృద్ధిని ప్రధానంగా తీసుకునే నిర్వహిస్తున్నాం. టీనేజ్ పిల్లలపై సాంకేతిక విప్లవం ప్రభావం అనే ఇంటి సమస్య దగ్గర్నుంచి గ్లోబలైజేషన్‌లో మహిళలకు అందే అవకాశాలు అనే ఇంటర్నేషనల్ ఇష్యూస్ దాకా విభిన్న అంశాలపై వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. మధ్యతరగతి మహిళలకు సైతం ఇవి అందుబాటులో ఉండేలా వీటిని రూపొందింస్తున్నాం.
 - మోనికా అగర్వాల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్

Advertisement

తప్పక చదవండి

Advertisement