సిగ్నల్ పడకముందే దాటేయాలని హోండా యాక్టివా స్పీడ్ పెంచింది అమృత. హఠాత్తుగా ఆ చౌరస్తాలో ఆమెకు రైట్ సైడ్ ఉన్న రోడ్ నుంచి ఓ టూ వీలర్ అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేసింది. ‘‘ట్రాఫిక్ రూల్స్ పాటించరు పాడు లేదు.. ఇంతకీ..’’ అని ఆమె ఇంకేదో అనబోయే లోపు.. ఆ అనేదేంటో ఆ టూ వీలర్ వ్యక్తికి అర్థమైనట్టే తన టీ షర్ట్ మీది వాక్యాలు చూపించాడు అమృతకు.. ‘‘ఇంట్లో చెప్పే వచ్చా’’ అని. ‘‘అబ్బా.. అవునా?’’ అనుకుంటూ తన టీషర్ట్ మీది వాక్యాలూ చూపించింది.. ‘‘ఫసక్’’ అని!ఆ వ్యక్తి హెల్మెట్ కవర్ వేసుకుంటూ వెహికిల్ రైజ్ చేసుకొని వెళ్లిపోయాడు. అమృతా దూసుకెళ్లింది డెస్టినేషన్ వైపు.హోటల్ పార్కింగ్‌లోకి వెళ్లబోతుంటే ఓ పాదాచారుడు అడ్డొచ్చాడు. ఆ స్లోప్‌లో మళ్లీ బ్రేక్ వేస్తూ చిరాగ్గా చూసింది అతనిని ‘‘ఎవడ్రా నువ్వు?’’ అన్నట్టు. ఆ యంగ్ మన్ పరమ పుర్‌సత్‌గా తన టీ షర్ట్ చూపించాడు ‘‘పక్కా లోకల్’’ అని రాసున్న అక్షరాలను!‘‘మిడిల్ క్లాస్ అబ్బాయి’’ అనుకుంటూ పార్కింగ్‌లోకి వెళ్లింది.
రెస్టారెంట్‌లో..
‘‘సారీ గైస్.. ట్రాఫిక్... ఆ రూల్స్‌ని బ్రేక్ చేసే వాళ్లతో లేట్ అయిపోయింది’’ అంటూ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్‌తో జాయిన్ అయింది అమృత.‘‘వాట్ హ్యాపెండ్?’’ అడిగాడు జయసూర్య.‘‘రెండుసార్లు డాష్ కొట్టబోయా’’ అంది అమృత మంచినీళ్ల గ్లాస్ తీసుకుంటూ!అమృత ముందుకొచ్చి నిలబడ్డాడు పాండు. ఏంటీ అన్నట్టు చూసింది ఆమె నీళ్లు తాగుతూ!టీ షర్ట్ చూపించాడు.. ‘‘లైట్’’ తీస్కో అని ఉంది దాని మీద. నోట్లో నీళ్లు పాండు మీద పడేలా నవ్వేసింది.‘‘యూ నో.. ఈ రోజు ట్రాఫిక్‌లో.. పార్కింగ్‌కి వెళ్తుంటే నా వెహికిల్‌కి అడ్డొచ్చిన వాళ్లూ ఇలాంటి టీ షర్ట్సే వేసుకున్నారు’’ అని చెప్పింది అమృత మంచి నీళ్ల గ్లాస్ టేబుల్ మీద పెడుతూ.‘‘అర్రే.. అంటే ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో మనమెప్పుడూ లేటే అన్నమాట’’ అంది గీతిక.ఆనంది టీషర్ట్ చూపించాడు శివ.. గీతికకు.
‘‘మూస్కో’’ అని ఉంది. వెంటనే తన టీషర్ట్ మీదున్న అక్షరాలను చూపించింది గీతిక.. ‘‘ఏడ్చావ్ లే..’’ అని.‘‘ఓకే. టాపిక్‌కి వద్దాం...’’ అంటూ జయసూర్య వైపు తిరిగి‘‘ రేయ్ జయ్.. చెప్పరా.. పార్టీ ఎక్కడ అరేంజ్ చేస్తున్నావో?’’ అడిగింది గీతిక.‘‘మా బాబాయ్ వాళ్ల ఫామ్ హౌజ్‌లో’’ చెప్పాడు. ‘‘ఎక్కడది?’’ అందరూ అడిగారు ముక్త కంఠంతో.‘‘తూప్రాన్’’ చెప్పాడు జయసూర్య. ‘‘రేయ్.. మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నావ్. నీ ప్రీ మ్యారేజ్ పార్టీ అదిరిపోవాలి బ్రో..’’ అన్నాడు శివ సీరియస్‌గా. ‘‘మొదటిసారి ఏంట్రా.. మొదటిసారి’’ అంటూ వాడి వీపును దబేల్ మనిపించారంతా. ఆ సరదా సందడిలోనే తినడానికీ ఆర్డర్ ఇచ్చేసుకున్నారు.‘‘మరీ అంతగా డబ్బులు తగలేసుకోకురా! పెళ్లయ్యాక చాలా ఖర్చులుంటాయి’’ సలహా ఇచ్చింది అమృత.‘‘పేరెంట్స్ చూసుకుంటారు’’ టీషర్ట్ చూపించాడు జయసూర్య.
‘‘నిన్నూ...’’ అంటూ నవ్వుతూ జయ్ భుజమ్మీద ఒక్కటిచ్చింది.‘‘ఫారిన్ స్కాచ్ పెట్టాల్రా మామా’’ అన్నాడు పాండు. ‘‘అవున్రా పెట్టాల్రా’’ అంటూ ‘‘అబే.. శివా.., బంటీ మాట్లాడరేందిరా..’’ మిగతావాళ్లనూ రెట్టించాడు అభిరామ్. ‘‘అంతేగా.. అంతేగా’’ తన టీషర్ట్ చూపించాడు బంటీ!‘‘మీ టీషర్ట్స్ గోలేంట్రా’’ అంటూ సంహిత తల పట్టుకుంటూంటే ‘‘అరే చిచ్చా... ఈ ప్రీ మ్యారేజ్ పార్టీకి మన ఫ్రెండ్స్ అందరి మ్యానరిజమ్స్‌తో ఇట్లాంటి టీషర్ట్స్‌ను కస్టమైజ్ చేసుకుందామారా?’’.. అద్భుతమైన ఐడియా తట్టినట్టు ఎక్సయిటింగ్‌గా చెప్పాడు పాండు. ‘‘రంగుపడుద్ది’’ అనే టీషర్ట్ వేసుకున్న గౌతమ్, ‘‘పని చూస్కో’’అని మాటున్న టీషర్ట్ వేసుకున్న అభిరామ్, ‘‘నాకు బూతులు ఊరికే రావు’’ అనే రాతతో టీషర్ట్ వేసుకున్న శివ.. అందరూ పాండూ ముందుకొచ్చి నిలబడ్డారు.ఏం చెప్పాలో తెలియక ‘‘అబే హాదీ..’’ అంటూ సెల్‌లో మొహం పెట్టిన హార్దిక్‌ను తట్టాడు.
తలపైకెత్తి ‘‘నన్ను ఇన్‌వాల్వ్ చేయొద్దు రావు గారు’’ అన్న తన టీషర్ట్ అక్షరాలను చూపించాడు హార్దిక్. అందరూ పాండు వైపు చూశారు ‘‘అయిందా’’ అన్నట్టు. తలగోక్కున్నాడు పాండు. అప్పుడే హడావిడిగా వీళ్ల దగ్గరకు వచ్చాడు ఆదిత్య.. ‘‘మీటింగ్ ఎన్ని గంటలకో చెప్పి చావచ్చు గదరా’’ అంటూ. అప్పటికే వీళ్లు ఖాళీ చేసిన స్నాక్స్ ప్లేట్లను చూస్తూ... ‘‘ నాకేమన్నా చెప్పండ్రా.. ఆకలేస్తోంది’’ అన్నాడు ఆదిత్య. ‘‘మాది అయిపోయింది. కావల్సింది ఆర్డర్ ఇచ్చుకో’’ అన్నాడు అభిరామ్. సర్వర్ కోసం అటూఇటూ చూశాడు ఆదిత్య. ఎవరూ కనపడలేదు. వాడి ఆత్రం అర్థమైన అభిరామ్ ‘‘కౌంటర్ దగ్గరకెళ్లి ఆర్డర్ ఇయ్యిపోరా’’ అన్నాడు. వెళ్లడానికి ఆదిత్య ఇబ్బంది పడ్తూంటే.. శివను వెనక్కి తిప్పి అతని వీపు చూపించాడు అభిరామ్.. ‘‘వెళ్లి నా పేరు చెప్పు’’ అని ఉంది. ‘‘సరే.. నీ ఏడుపేదో ఏడ్చి రా.. పార్కింగ్ లాట్‌లో వెయిట్ చేస్తూంటాం’’ అంటూ లేచాడు జయసూర్య. తోపాటే అందరూ లేచారు.
లిఫ్ట్ దగ్గర..
తన ఛాతి దగ్గర అదే పనిగా చూస్తున్న అబ్బాయికి.. తను వేసుకున్న టీషర్ట్ మీది అక్షరాలను చూపించింది అమ్మాయి.. ‘‘ఫేస్ పైనుంది బే’’ అని. ఆ అబ్బాయి తమాయించుకుని ఏమీ ఎరగనట్టు ఆమె పక్కన నిలబడ్డ అబ్బాయిని చూశాడు. అతను గుర్రుగా తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూపించాడు ‘‘ఈ పిల్ల నాది బే’’. దాంతో తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూసుకున్నాడు అబ్బాయి ‘‘దీనమ్మ జీవితం’’.ఇంతలోకే రెస్టారెంట్‌లో ఆదిత్య దగ్గరకు బిల్ తీసుకొని వచ్చాడు సర్వర్. తన టీషర్ట్‌ను సర్వర్‌కి చూపించాడు ఆదిత్య.. ‘‘దే పేడ్ నో’’ అని. లేదన్నట్టుగా తలూపాడు సర్వర్.
అప్పుడే తన పక్క టేబుల్ అతను బిల్ పే చేసి వెళ్తుంటే అతని టీ షర్ట్ వెనక ఓ వాక్యం కనిపించింది ఆదిత్యకు ‘‘ఒక ఇంగ్లిష్ కవి ఏమన్నాడో తెలుసా?’’ అని.పై సన్నివేశాలన్నీ కల్పితమే. కాని ఆ సినిమా డైలాగ్స్‌తో ఉన్న టీషర్ట్స్ వాస్తవం. వీటి రూపకర్తలు ఇద్దరు సాఫ్టవేర్ ఇంజనీర్స్. మహీ ఇలీంద్ర, హరీష్ వాసిరెడ్డి. ప్రకాశం, ఖమ్మం జిల్లా వాసులు. హైదరాబాద్‌లో ఇద్దరికీ కామన్ ప్యాషన్ అయిన సినిమా ప్లాట్‌ఫామ్ మీద కలుసుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మొదలు కొన్ని షార్ట్ మూవీస్‌కీ పనిచేశారు. వెబ్‌సిరీస్‌కూ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ టీషర్ట్స్ థాట్‌తో ఈ కామర్స్‌లోనూ కాలు పెట్టారు.
దేడ్ దిమాగ్
ఇంగ్లీష్‌లో ‘ఐ లవ్ న్యూయార్క్’ అని, ‘కొలంబియా బాయ్స్’ అని, ‘లవ్ అమెరికా’ అని ‘లండన్ డ్రీమ్స్’ అని రకరకాల స్లోగన్స్‌తో టీ షర్ట్స్ దొరుకుతాయి. కానీ తెలుగులో ఇలాంటివి లేదు. మన భాషలో పాపులర్ అయిన మాటలతో టీషర్ట్స్‌ను మార్కెట్‌లోకి తెస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆ ఇద్దరికీ. హిట్ కావాలంటే ఒకే ఫార్మూలా.. సినిమా! సో.. ఈ స్టార్టప్‌కి ‘దేడ్ దిమాగ్’ అని పేరుపెట్టి.. పంచ్‌లా పేలిన డైలాగ్స్‌ను టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయించి మార్కెట్‌లో విడుదల చేశారు. టేకాఫ్ కొంచెం స్లో అయినా.. రెండు నెలల్లో స్పీడ్ అందుకుంది. క్రేజ్‌కి తగ్గ రేంజ్‌లో ఇప్పుడు రోజుకి కనీసం అయిదు వందల టీషర్ట్స్ సప్లయ్‌కి డిమాండ్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చెన్నై, బెంగళూరు, ముంబై దాటి అమెరికా దాకా! ప్రీ మ్యారేజ్ పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలు, సంగీత్, మెహందీ, పుట్టినరోజులు, బారసాలలు, కాలేజ్ పార్టీలు.. ప్రైవేట్ ఫంక్షన్స్.. అన్నిటికీ కస్టమైజ్ చేసుకున్న డైలాగ్స్‌తో ఈ టీషర్ట్స్ అమ్ముడు పోతున్నాయి.
హోలీ లాంటి పండగలకూ.. థీమ్ పార్టీలకూ ఇలాంటి టీషర్ట్స్ కావాలనుకుంటున్నారు ట్రెండ్ ఫాలోవర్స్. కొంతమంది తమ కుటుంబ వేడుకల కోసం కుటుంబ సభ్యుల మ్యానరిజమ్స్‌తో ఈ టీషర్ట్స్‌ను తయారు చేసి ఇవ్వమని కోరుతున్నారట. అంతేకాదు కొన్ని పొలిటికల్ క్యాంపెయిన్స్‌కీ అడుగుతున్నారని చెప్పారు ఆ ప్రొడ్యూసర్స్. ‘‘ఈ టీ షర్ట్స్ ద్వారా మన భాష, కల్చర్‌ను ప్రమోట్ చేయడం మా లక్ష్యం. పాపులర్ కావడానికి ముందు సినిమా డైలాగ్స్‌ను వాడుకున్నాం కాని.. తర్వాత సామెతలు.. నుడికారాలు, పలుకుపడులు వంటివాటినీ ప్రింట్ చేస్తాం’’ అని చెప్తున్నారు మహీ, హరీష్‌లు.
సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment