ఆటగాళ్లని ఆడించేది ఎవరు? | Sakshi
Sakshi News home page

ఆటగాళ్లని ఆడించేది ఎవరు?

Published Wed, Jun 29 2016 10:16 PM

ఆటగాళ్లని ఆడించేది ఎవరు?

హాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా/ జెర్రీ మాగ్విర్

 

మనం అనుకున్నా, అనుకోకపోయినా ఈ ప్రపంచం ఓ ఆటస్థలం. చాలా తక్కువ సార్లు గుంపులు గుంపులుగా, ఎక్కువ సార్లు ఎదుటివాడితో, చాలా చాలా సార్లు తనతో తనే ఆడాలి. కొన్నిసార్లు ఓడిపోవాలి. మరికొన్ని సార్లు కచ్చితంగా గెలిచే తీరాలి. జెర్రీ మాగ్విర్ ఆటగాడు కాదు. ఆటగాళ్ల ప్రతిభని అమ్మే స్పోర్ట్స్ ఏజెంట్.  కాని ఓ ఆట ఆడాల్సి వచ్చింది... తన జీవితంతో తానే.

 
లీ స్టెన్‌బెర్గ్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఓ స్పోర్ట్స్ ఏజెంట్. ఫుట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్ క్రీడాకారులు దాదాపు మూడొందల మందికి స్పోర్ట్స్ ఏజెంట్‌గా వ్యవహరించాడు. చాలామందికి కాస్తో కూస్తో కోచ్‌ల గురించి తెలుసు. ఆటగాళ్లకి శిక్షణ ఇస్తారు. కాని ఈ స్పోర్ట్స్ ఏజెంట్లు ఆటగాళ్ల ప్రతిభని వాళ్లకి ప్రపంచంలో ఉన్న క్రేజ్‌ని అమ్మిపెడుతుంటారు. అదో వ్యాపారం. దానికి తగ్గట్లుగానే కమీషన్లు తీసుకుంటుంటారు.  ఈ ప్రయత్నంలో లీ స్టెన్‌బర్గ్  చాలా వివాదాల్లో చిక్కుకోవలసి వచ్చింది.

  

కామెరాన్ క్రోవ్  ఓ అమెరికన్ దర్శకుడు. అన్నింటికన్నా ముందు ఓ పత్రిక (రోలింగ్ స్టోన్) సంపాదకుడు. ఇప్పటికీ అడపాదడపా ఆ పత్రికకి ఆర్టికల్స్ రాస్తుంటాడు. కామెరాన్ తన సినిమా కథకి కావల్సిన ముడిసరుకుని కలల్లోనో, పుస్తకాల్లోనో వెదుక్కోడు. జీవితంలోనే వెదుకుతాడు. ఆ పాత్రలు, సంఘర్షణ సజీవంగా కనబడాలి. అప్పుడే కామెరాన్ క్రోవ్ కనెక్ట్ కాగలడు. మొదట్లో హైస్కూల్ విద్యార్థుల గురించి, టీనేజ్ కుర్రాళ్ల గురించి సినిమాలు తీయడానికి ఇదే కారణం. ఆ తరహా కథలతో సినిమాలు తీసిన క్రోవ్ ఒకసారి స్పోర్ట్ ఏజెంట్ లీ స్టెన్‌బర్గ్ గురించి చదివాడు. ఆటగాళ్లకు, ఏజెన్సీకి మధ్యవర్తిగా నిలిచే స్పోర్ట్స్ ఏజెంట్ ఏజెన్సీకి ఎదురు తిరిగితే? ఏజెన్సీ కన్నా ఆటగాళ్లకే ఎక్కువ డబ్బులు రావాలని డిమాండ్ చేస్తే? ఏమవుతుంది? ఆ స్పోర్ట్ ఏజెంట్ ఉద్యోగం ఊడుతుంది. అలాంటి స్పోర్ట్ ఏజెంట్ కథే ‘జెర్రీ మాగ్విర్’.

  

హీరో టామ్ క్రూయిజ్ గురించి తెలియని హాలీవుడ్ సినిమా అభిమానులుండరు. టామ్ క్రూయిజ్ బాల్యం అంతా భరించరాని దారిద్య్రంలో గడిచింది. చిన్నతనంలోనే తండ్రి కాన్సర్‌తో మరణించాడు. చర్చి అందించిన ఆర్థిక సహాయంతో చదువు కొనసాగించాడు. ఒక దశలో చర్చి ఫాదర్‌గా మారిపోదామనుకున్నాడు టామ్ క్రూయిజ్.

 
అయితే వ్యక్తిగతంగా క్రూయిజ్‌కి ఆటలన్నా, డ్రామాలన్నా చాలా ఇష్టం. ఫుట్‌బాల్ టీమ్‌లో ఉన్నాడు. అయితే ఆటకి ముందు బీర్ తాగాడన్న కారణంగా క్రూయిజ్‌ని ఫుట్‌బాల్ టీమ్ నుంచి తొలగించారు. అప్పటినుంచి తన కెరీర్ మరోలా మలుచుకున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా అనగానే టామ్ క్రూయిజ్ ఆ అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. అలా పై ముగ్గురి కాంబినేషన్.. హాలీవుడ్‌కి గుర్తుండిపోయే సక్సెస్‌ఫుల్ సినిమాని అందించింది.

  

కథ విషయానికొస్తే
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్ అనే సంస్థకి జెర్రీ మాగ్విర్ స్పోర్ట్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రీడా వ్యాపారంలో జరుగుతున్న అవకతవకల గురించి, ఆర్థిక లావాదేవీల్లో తేడాల గురించి జెర్రీ బాధపడతాడు. మనసు మారుతుంది. కంపెనీకి ఈ పరిస్థితి వివరిస్తాడు. తక్షణం జెర్రీని ఉద్యోగం నుంచి తీసేస్తారు. జెర్రీ క్లయింట్స్ అందరూ జెర్రీని వదిలేసి, మరో ఏజెంట్ బాబ్ సుగర్‌ని ఆశ్రయిస్తారు. తనతో పాటు వచ్చేవాళ్లెవరైనా ఉన్నారా అని జెర్రీ అడుగుతాడు. జెర్రీతో పాటు పనిచేసిన డొరొతీ అంతవరకూ ఉన్న సంస్థని వదిలేసి, జెర్రీ కొత్తగా స్థాపించిన ఏజెన్సీలో చేరుతుంది. డొరొతీ అప్పటికే సింగిల్ మదర్. జెర్రీకి ఒకే ఒక్క కస్టమర్ ఫ్రాంక్ కుష్‌మన్ ఉంటాడు. అయితే ఫ్రాంక్‌తో బరిలో దిగే వ్యక్తిగా ఓ బ్లాక్ (ఆఫ్రికన్ - అమెరికన్ జాతి వ్యక్తి)ని ఎంపిక చేసుకున్నందుకు ఫ్రాంక్, అతని తండ్రి.. జెర్రీని అసహ్యించుకుంటారు. వర్ణ వివక్ష పేరిట ఫ్రాంక్.. జెర్రీతో కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటాడు. ఇక జెర్రీకి మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ ఆ ఆఫ్రికన్-అమెరికన్ ఆటగాడే. అతని పేరు రాడ్ టిడ్‌వెల్. మనిషి ఓ పట్టాన ఏ విషయాన్ని అంగీకరించడు. ఎప్పుడూ డబ్బు యావతోనే మాట్లాడుతుంటాడు. తనకి సరైన కాంట్రాక్ట్ ఇప్పించలేదని జెర్రీ మీద దెబ్బలాడుతుంటాడు రాడ్. అయితే అతను డిమాండ్ చేస్తున్నంత డబ్బులకి సరిపడేటట్లు రాడ్ కష్టపడటం లేదని జెర్రీ ఆరోపణ. ఆ తర్వాత జరిగిన నైట్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రాడ్ అనుకోకుండా గాయపడతాడు. అయినా కోలుకుని విజేతగా నిలుస్తాడు.

 
ఓ ఆటగాడికి, స్పోర్ట్స్ ఏజెంట్‌కి మధ్య ఉండే వ్యాపార సంబంధం ఓ ప్రగాఢ స్నేహంగా ఎలా మారింది,  ఓ మొండి ఆటగాడిని ఓ స్పోర్ట్స్ ఏజెంట్‌గా ఎలా విజేతగా తీర్చిదిద్దాడనేది ఈ కథలో అద్భుతంగా చెప్పారు. అర్జునుడు మహావీరుడే కాని అతడిని యుద్ధానికి సిద్ధం చేసింది శ్రీకృష్ణుడే. ప్రపంచానికి ఎప్పుడూ విజేతలైన ఆటగాళ్లే కనబడుతుంటారు. కాని వారికి అండగా నిలబడ్డ కోచ్‌లు, స్పోర్ట్ ఏజెంట్లు మాత్రం ఎప్పుడూ తెర వెనకే ఉంటారు. రాడ్ టిడ్‌వెల్‌గా నటించిన క్యూబా గూడింగ్ ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నాడు.   50 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేసింది.

  - తోట ప్రసాద్

 

 

 

Advertisement
Advertisement