చిరునవ్వులు చిగురుల కోసం! | Sakshi
Sakshi News home page

చిరునవ్వులు చిగురుల కోసం!

Published Mon, Jan 26 2015 11:24 PM

చిరునవ్వులు  చిగురుల కోసం!

పెరియోడాంటల్ సమస్యలు

పంటి కింద లేత గులాబీ రంగులో కనిపించే భాగాన్ని తెలుగులో మనం చిగురు అంటాం.  కానీ ఇంగ్లిష్ వాళ్లు దాన్నే ‘గమ్’ అంటారు. బహుశా మనకు కనిపించే పన్ను... చిగురుకు అతికినట్లు ఉంటుందని గమ్ అన్నారేమో తెలియదుగానీ... పన్ను కాస్తా తెల్లటి మల్లెలా, ఒక పువ్వులా పూసినందుకేమో, అది ఆవిర్భవించిన స్థానాన్ని మనం చిగురు అంటాం. మన భావుకతకు తోడవుతూ...  ఆ చిగుర్లు మంచి రంగులో  ఆరోగ్యకరంగా ఉంటే అందాన్ని  ఇనుమడింపజేస్తాయి.  కానీ సహజ స్వభావరీత్యా  చిగురెంత మెత్తటి తత్వం  కలదంటే... దానికి జబ్బు  చేసినా సరే... నొప్పి తెలియనివ్వదు. దంతాల గురించి కనీసం  కొద్దో గొప్పో అవగాహన ఉంటుందేమోగానీ, చిగుర్ల గురించీ, దానికి వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలిసింది చాలా తక్కువ. అలాంటి  చిగుర్లపై అవగాహన కలిగించి, చిరునవ్వు మొలిపించటం కోసమే ఈ ప్రత్యేక కథనం.
 
చిగుర్లు అంటే...

 
తెల్లగా బయటకు కనిపించే పంటిలో ముఖ్యమైన నాలుగు భాగాలుంటాయి. అవి... మొదటిది పంటిపై ఉండే ఎనామెల్ పొర. రెండోది దాని కింద ఉండే డెంటిన్. ఆ కింద పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలూ, నరాల చివరలు ఉండే భాగం. డెంటిన్ కింద ఉండే రక్తనాళాలు, నరాల చివరి భాగాలను పల్ప్ అంటారు. వాటన్నిటి కింద ఉండే భాగం పంటి ఎముక. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉన్నట్లే. అయితే ఈ నాలుగు భాగాలూ పైకి కనిపిస్తునందున వాటన్నింటినీ కలిపి క్రౌన్ అంటారు. వాటి కింద చిగుర్లలోకి దూసుకుపోయినట్లుగా పంటి వేర్లు (రూట్స్) ఉంటాయి. పైన క్రౌన్, కింద రూట్స్ కలిసే చోటును ‘నెక్’ అంటారు. ఈ నెక్ సరిగ్గా పంటి చిగుర్లలో ఇమిడి ఉంటుందన్నమాట. చెట్టు వేళ్లు నేలలోకి బలంగా పాతుకుపోయినట్లే... క్రౌన్ వేర్లు (రూట్స్) గులాబీరంగు చిగుర్లలోకి బలంగా దిగబడిపోయి ఉంటాయి. ఇది స్థూలంగా పన్ను నిర్మాణం. పలువరసను ముందు నుంచి చూసేప్పుడు పంటి మీదికి వచ్చినట్లుగా ఉండటంతోపాటు కొన్ని చోట్ల కాస్త కిందుగా ఒక రంపపు వరసలా అనిపించే చిగుర్ల అంచును ‘గమ్‌లైన్’ అంటారు. ఈ గమ్‌లైన్ కింద లేత గులాబీ రంగు నుంచి కాస్త ముదురు రంగుతో పాటు కొందరిలో ఒకింత నలుపు రంగుతో ఉండేవే చిగుర్లు. ఈ చిగురు సముదాయం మొత్తాన్ని కలుపుకొని ‘పెరియొడాంటియమ్’ అంటారు.
 
చిగుర్లు పంటిని ఎలా పట్టి ఉంచుతాయి?

 
చిగురు కణజాలం అన్నది అనేక కనెక్టివ్ కణజాలపు కట్టల (బండిల్స్)ను కలిగి ఉంటుంది. ఈ కనెక్టివ్ కణజాలపు కట్టలన్నీ పంటిని చుట్టుకుపోయినట్లుగా ఉంటాయి. దాంతో పన్ను ఈ కణజాలంలో ఇమిడిపోయినట్లుగా ఉంటుంది. ‘పెరియోడాంటల్ లిగమెంట్స్’ అనే అనేక పొరల (ఫైబర్స్) నిర్మాణాలు పలువరసను ఈ కణజాలంలో చుట్టి ఉంచేలా చేస్తాయి. పంటి కింద ఉండే వేర్లు (రూట్స్) అనే నిర్మాణాలు దవడ ఎముకలోని ఖాళీజాగాలో గట్టిగా ఇమిడిపోయి ఉంటాయి. రూట్స్ ఇమిడే ఈ దవడ ఎముకలోని సాకెట్ వంటి నిర్మాణాన్ని ‘ఆల్వియొలార్ సాకెట్’ అంటారు. ఈ సాకెట్లలో పలువరస గట్టిగా అమరిపోయి ఇంత నమిలినా, కొరికినా పళ్లను గట్టిగా పట్టి ఉంచుతుంది. పళ్లు లేని పుర్రెను పరిశీలనగా చూసినప్పుడు మనకు దవడలోని ఈ ‘ఆల్వియొలార్ సాకెట్స్’ అనే ఖాళీలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఖాళీలలోకి పంటి వేళ్లు (రూట్స్), చిగుర్ల పై భాగంలోకి పళ్లు పెరుగుతాయి. గులాబి రంగులో కనిపించే ఈ చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అని కూడా అంటారు.
 
చిగుర్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు

చిగురు వరస (గమ్‌లైన్)ను పరిశీలించడం. చిగురు వరస కిందికి దిగినట్లుగా ఉండటం. క్లినికల్ పరిశీలనలో ఒక్కోసారి నోటి ద్వారా వచ్చే దుర్వాసన (హ్యాలిటోసిస్) ద్వారా చిగుర్ల వ్యాధి ఉన్నట్లు తెలుసుకోవచ్చు. అన్ని పళ్లకు ఎక్స్-రే (ఆర్థోప్యాంటమోగ్రామ్) తీయించడం ద్వారా చిగుర్ల వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు.
 
 జింజివైటిస్ అంటే ఏమిటి?

లేత గులాబి రంగులో ఆరోగ్యంగా మిసమిసలాడుతూ మెరుస్తుండే చిగుర్లు ఒకింత ఎర్రబారి, వాచినట్లుగా కనిపిస్తే దాన్ని జింజివైటిస్‌గా పేర్కొనవచ్చు. చాలా సందర్భాల్లో చిగుర్లకు వచ్చే వ్యాధుల వల్ల నొప్పి ఉండదు. కాబట్టి జింజివైటిస్‌ను గుర్తించడం ఒకింత కష్టం. కానీ చిగుర్ల వ్యాధి జింజివైటిస్ దశలో ఉన్నప్పుడే దానికి  చికిత్స తీసుకోవడం మంచిది.
 
 జింజివైటిస్ ముదిరితే...?
 
జింజివైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలంలో పెరియోడాంటైటిస్‌కు దారి తీస్తుంది. పెరియోడాంటైటిస్‌ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి... చిగుర్లలో పుండ్లు పడటం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, దంతాలు వదులు కావడం వంటి లక్షణాలతో పెరియాడాంటైటిస్‌ను తెలుసుకోవచ్చు.
 
చిగుర్ల వ్యాధులు... లక్షణాలు
 
సాధారణంగా చిగుర్ల వ్యాధులకు తొలి దశల్లో నొప్పి అంతగా తెలియదు. ఆ తర్వాత నొప్పి కూడా ఉండవచ్చు. దాంతోపాటు కనిపించే

మరికొన్ని లక్షణాలివి...
     
► నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్)  చిగుర్లు ఎర్రబారడం, చిగుర్ల వాపు, ఉబ్బినట్లుగా కనిపించడం.
► ముట్టుకుంటే జివ్వుమనడం (టెండర్‌నెస్)  చిగుర్ల నుంచి రక్తస్రావం (బ్లీడింగ్)
►నమిలినప్పుడు నొప్పిగా అనిపించడం
► పళ్లు వదులైనట్లుగా స్పష్టంగా తెలియడం, పళ్ల మధ్య సందులు ఏర్పడటం.
► పంటికి పైకి పాకినట్లుగా ఉండే చిగురు అంచులు క్రమంగా కిందికి దిగజారడం
► (రిసీడింగ్ గమ్స్ / లాంగర్ అప్పియరెన్స్ ఆఫ్ టీత్)

చిగుర్ల వ్యాధులు ఎలా వస్తాయి...?

చిగుర్ల వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా... ప్రధానంగా చిగురు పంటిని కలిసి ఉండే గమ్‌లైన్ వద్ద గార (ప్లాక్) పేరుకోవడం ద్వారా చిగురు వ్యాధి మొదలవుతుంది. ఈ గారలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ ఈ బ్యాక్టీరియా చాలావరకు ప్రమాదరహితమైనవే. మనం క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో బ్రష్ చేసుకుంటూ ఉంటే చిగుర్ల అంచున ఉండే ఈ ప్లాక్ తొలగిపోతుంటుంది. పళ్ల మధ్యన, బ్రషింగ్‌కు వీలు కాని చోట పేరుకునే ప్లాక్‌ను టై్వన్ దారం వంటి మందపాటి దారంతో శుభ్రం చేసుకోవాలి. దీన్నే ఫ్లాసింగ్ అంటారు. అయితే మనం రోజూ సక్రమంగా బ్రష్ చేసుకోకపోతే ఈ గార పెరుగుతూ పోతుంది. తొలిదశలో కేవలం బ్రషింగ్‌తోనే తొలగిపోయే ఈ గార క్రమంగా బలపడిపోతుంది. అప్పుడు దీన్ని తొలగించాలంటే దంతవైద్యుల పరికరాల సహాయంతో స్కేలింగ్ చేయించాల్సి ఉంటుంది. అప్పటికీ దాన్ని తొలగించకపోతే... బ్యాక్టీరియా పేరుకుపోయి అది చిగుర్లను తినేస్తూ ఉంటుంది. అప్పుడు మన గమ్‌లైన్ కిందికి దిగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ దశలో తప్పనిసరిగా పంటి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
 
ఆరోగ్యంగానే ఉన్నాయని గుర్తించడం ఎలా?

 
చిగుర్లు ఎల్లప్పుడూ లేత గులాబి రంగులో ఆరోగ్యంగా ఒకింత నిగారింపుతో కూడిన మెరుపుతో కనిపిస్తుంటాయి. కొందరిలో ఈ గులాబి రంగు చిగుర్లు కాస్తా ఎర్రగా వాచి, ఉబ్బినట్లుగా కనిపించవచ్చు. ఒక్కోసారి కొందరిలో బ్రష్ చేసుకుంటుంటే చిగుర్ల నుంచి రక్తం రావచ్చు. అలా జరిగితే అది చిగుర్ల వ్యాధి (జింజివైటిస్)కి లక్షణంగా పరిగణించాలి. అయితే ఒక్కోసారి మన టూత్‌బ్రష్ చిగురును బలంగా తగలడం వల్ల ఒక్కోసారి కొద్దిగా రక్తస్రావం అయి, చిగురు ఎర్రగా మారి, నొప్పిగా ఉంటుంది. ఇలాంటి గాయం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉంటూ, బ్రష్ తగలకపోయినా రక్తస్రావం అవుతుంటే మాత్రం దాన్ని చిగురు వ్యాధిగా పరిగణించాలి.
 
పెరిగే వయసుతోచిగుర్లు తరుగుతాయా?   
 
నిజానికి వయసు పెరగడం వల్ల చిగుర్లు క్రమంగా తరిగిపోతాయనీ, దాంతో పళ్ల మధ్య సందులు ఏర్పడటం, పళ్లు వదులు కావడం, ఈ వదులైన పళ్లు ఏదో ఒక దశలో రాలిపోవడం మామూలే అని చాలా మంది అపోహ. అందుకే వయసు పైబడ్డవారిలో పళ్లు రాలుతుంటాయని అందరూ అనుకుంటారు. కానీ పెరిగే వయసుకూ, తరిగే చిగుర్లకూ (గమ్‌లైన్‌కూ) సంబంధం లేదు. చిగుర్లు క్రమంగా కిందికి తగ్గుతూ పళ్ల మధ్య సందులు పెరుగుతున్నాయంటే అది చిగుర్ల వ్యాధి కారణంగానే కానీ... పెరిగే వయసు వల్ల కాదు. అందువల్ల పళ్ల మధ్య సందులు వస్తున్నప్పుడు విధిగా పంటి డాక్టర్‌కు చూపించాలి. పెరిగే వయసు వల్ల అది సహజమేనంటూ సరిపెట్టుకోకూడదు. సరైన దంతచికిత్స చేయించుకుంటూ, సక్రమమైన రీతిలో పళ్లను రక్షించుకుంటూ ఉంటే ఎంత వయసు పైబడినా పళ్లు ఊడిపోవు... సరికదా... జీవితాంతం గట్టిగా చిగుర్లను అంటిపెట్టుకునే ఉంటాయి. అయితే చాలామందిలో వయసు పెరుగుతున్నప్పుడు వారి శరీరంలోని మిగతా కణాల్లాగే నోటిలోని కణజాలం కూడా కొన్ని మార్పులు వస్తాయి. దాంతో నోటిలో ఊరే లాలాజలం పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా చిగుర్లు కాస్త బలహీనం కావచ్చు. కొందరిలో అవి ఎర్రగా మారి మంట (ఇన్‌ఫ్లమేషన్) రావచ్చు. మరికొంరదిలో చిగుర్ల నుంచి రక్తస్రావం కూడా కావచ్చు. ఈ సమస్యలన్నింటికీ సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకోవడమే మంచి మార్గం. అలా చేస్తే... జీవితాంతం పళ్లూ, చిగుర్లూ ఆరోగ్యంగానే ఉంటాయి.
 
చిగుర్ల వ్యాధులు... గుండెకూ సమస్యలే!
 
చిగుర్ల వ్యాధులకు తోడ్పడే బ్యాక్టీరియా సాధారణంగా ఒక్కోసారి రక్తప్రవాహంలో కలిసిపోయి గుండెకూ చేరవచ్చు. మామూలుగా పంటికి వచ్చే సమస్యల కంటే చిగుర్లకు వచ్చే బ్యాక్టీరియల్ సమస్యలే గుండెకు వేగంగా చేరతాయి. ఎందుకంటే పంటికి జరిగే రక్తప్రసరణ లోపలి పల్ప్ నుంచి జరుగుతుంది. కానీ చిగుర్లకు నేరుగా సన్నటి రక్తనాళాల ద్వారా రక్తప్రసరణ జరుగుతుంటుంది. అందుకే చిగుర్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా గుండెపైపొరకు (పెరీకార్డియమ్)కు చేరే అవకాశాలు చాలా ఎక్కువ. అంతేకాదు ఒక్కోసారి ఇదే పరిస్థితి మెదడుకు సంభవిస్తే స్ట్రోక్ (పక్షవాతం), డిమెన్షియా కూడా వచ్చే అవకాశాలుంటాయి. అందుకే పంటి ఆరోగ్యంతో పాటు, చిగుర్ల ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా అవసరం.
 
చివరగా...
 
మనం మనలోని అన్ని జీవకణాలకు ఆహారాన్ని, పోషకాలను అందించడానికి భోజనం చేయడం అతి ముఖ్యం. ఈ కార్యకలాపానికి తోడ్పడే తొలి అవయవాలు పళ్లు. వాటిని పట్టి ఉంచేవి చిగుర్లు. అందుకే మన శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే మన నోటి ఆరోగ్యం (ఓరల్ క్యావిటీ హైజీన్) బాగుండాలి. అందుకే ప్రతి ఆర్నెల్లకోసారి తప్పనిసరిగా మీ పంటి డాక్టర్‌ను కలిసి మీ పళ్ల ఆరోగ్యాన్ని పరీక్షింపజేసుకుని, క్లీనింగ్ (స్కేలింగ్) ద్వారా గార తొలగించుకోవడం వంటి చర్యలు తీసుకోవడం ఎంతో మేలు. చిగురుకు వచ్చిన సమస్యను బట్టి స్కేలింగ్, క్యూరటాజ్, సమస్య తీవ్రతను బట్టి ఫ్లాప్ శస్త్రచికిత్స వంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది
 - నిర్వహణ: యాసీన్
 
పొగతాగేవారూ...  చిగుర్ల ఆరోగ్యం!


ఆరోగ్యవంతులతో పోలిస్తే, పొగతాగే అలవాటు ఉన్నవారిలో చిగుర్ల వ్యాధి రావడానికి ఈ అలవాటు మరింత ఎక్కువగా దోహదం చేస్తుంది. ఎందుకంటే మామూలు వ్యక్తులతో పాటు వీరిలోనూ పళ్లపై పాచి పేరుకుంటుంది. కానీ పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆ పాచి చాలా త్వరగా గారలా మారే అవకాశం ఉంటుంది. పైగా పొగతాగే అలవాటు కారణంగా వారి పళ్లలోని పల్ప్ నుంచి పంటికి పోషకాలు అందే వేగం మందగిస్తుంది. ఈ కారణంగా చిగుళ్ళుకూ, పళ్లకూ రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా పొగతాగేవారిలో చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. గార ఏర్పడే వేగం కూడా ఎక్కువే.
 
చిగుర్ల రంగు మారుతుందా?

పొగాకును వాడే కొందరిలో చిగుర్ల రంగుమారవచ్చు. పొగాకు నమలడం, పొగతాగడం వంటి దురలవాట్లు ఏమీ లేనప్పుడు కూడా... చిగుళ్ల రంగు మారితే... అది కూడా ఇటీవలే మారి ఉంటే ఒకసారి పూర్తిస్థాయి ఆరోగ్యపరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చాలామందిలో వారిలో ఉండే మెలనిన్ పిగ్మెంట్ పాళ్లను బట్టి చర్మం రంగు వేర్వేరుగా ఉన్నట్లే చిగుర్ల రంగు కూడా వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా చిగుర్లు లేత గులాబిరంగులో ఉంటాయి. అయితే ఒక్కోసారి శరీరంలో రంగును ఇచ్చే పిగ్మెంట్‌లో అసమతౌల్యత వల్ల చిగుర్ల రంగు కూడా మారవచ్చు. మన చిగుర్లు ఏ రంగులో ఉంటాయన్న అంశం మన జన్యువుల ఆధారంగా పుట్టుక సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకే చిగుళ్ల రంగు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. చిగుర్ల రంగును మార్చడానికి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే కొందరు తమ చిగుర్లు చాలా నల్లగా ఉన్నాయనీ, నవ్వినప్పుడు అవి అసహ్యంగా కనిపిస్తున్నాయంటూ ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇలా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన వారికి ముదురు రంగు (డార్క్ కలర్)లో ఉండే చిగుళ్ల పైపొరను చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించి దాని కింద గులాబి రంగులో ఉండే పొరను పైకి వచ్చేలా చేయవచ్చు. అయితే సదరు వ్యక్తుల్లో సహజంగా ఉండే ఒంటిరంగు (పిగ్మెంటేషన్) పాళ్లను బట్టి ఈ లేత చిగుర్ల రంగు తాత్కాలికంగా మాత్రమే ఉండి మళ్లీ ముదురు రంగుకు మారుతుంది. ఇలా శస్త్రచికిత్స తర్వాత చిగుర్లకు ఆ రంగు ఎంత కాలం ఉంటుందన్నది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. ఇటీవల చిగుళ్ల రంగు మార్చే శస్త్రచికిత్సను లేజర్ సాయంతో కూడా చేయడం సాధ్యమే.
 
గర్భవతులు... చిగుర్లు

చిగుర్ల ఆరోగ్యం దెబ్బతింటే అది మామూలు వ్యక్తుల్లో కేవలం నోటి ఆరోగ్యంపైనే ప్రభావం చూపవచ్చు. కానీ ఇటీవలి అధ్యయాన ప్రకారం పెరియోడాంటిస్ (ఒక రకం చిగుళ్ల వ్యాధి) - డయాబెటిస్, గుండె సమస్యల వంటి తీవ్రమైన జబ్బులకూ దారితీయవచ్చుని తెలిసింది. ఇక కొందరు మహిళల్లో చిగుర్ల సమస్యలు వస్తే అది నెలలు నిండకముందే ప్రసవానికి (ప్రీ-మెచ్యుర్ లేబర్) దారితీయవచ్చు. చిగుర్ల సమస్యలు మాటిమాటికీ వస్తున్నవారు వెంటనే డెంటిస్ట్‌ను కలవాలి.

Advertisement
Advertisement