ఆర్థో కౌన్సెలింగ్
నా వయసు 51 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. ఒక విభాగంలో సూపర్‌వైజర్‌గా ఉన్నాను. మా ఆఫీస్ బిల్డింగ్ చాలా పాతది. లిఫ్ట్ సౌకర్యం లేదు. ఫైల్స్ సంతకాల కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న నేను సెకండ్ ఫ్లోర్‌కు రోజులో కనీసం పదిసార్లు తిరుగుతుంటాను. దీంతో నేను విపరీతమైన మోకాలి నొప్పులతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదించి కొన్ని మందులు వాడాను. కానీ లాభం లేకపోవడంతో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌ను కలిశాను. ఆయనేమో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని అంటున్నారు. నా సమస్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉంటే తగిన చికిత్స ఇవ్వగలరు.
- సత్యనారాయణ, వరంగల్
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీరు ‘ఆస్టియో ఆర్థరైటిస్’తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. వయసుతో పాటు మోకాలి చిప్ప అరిగిపోవడం వల్ల, హిప్ డిస్‌లొకేషన్ లేదా జాయింట్లు అధిక ఒత్తిడికి గురైనప్పుడు లేదా మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియమ్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మీ సమస్యకు మోకాలి చిప్ప మార్పిడి అనేది ఉత్తమమైన పరిష్కారం అని చెప్పవచ్చు. కానీ మీకు డయాబెటిస్, రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను బట్టి మీ చికిత్స విధానం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు సంపూర్ణారోగ్యంతో ఉంటే మాత్రం ‘ఫాస్ట్‌ట్రాక్’ విధానంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడానికి వీలవుతుంది.
ఈ విధానంలో సర్జరీ జరిగిన 24 గంటలలోనే పేషెంట్‌ను నడిపించి డిశ్చార్జ్ చేసే వీలుంది. అలాగే చాలా కొద్దిరోజులలోనే మీరు పూర్తిగా కోలుకుని మీ ఉద్యోగ నిర్వహణలో యధావిధిగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందుకు అత్యాధునిక ఇంప్లాంట్స్‌తో పాటు ఇప్పుడు అనుభవజ్ఞులైన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. మీకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఆపరేషన్‌కు ముందు నుంచే మీ నొప్పి నివారణ ప్రక్రియలను వైద్యులు ప్రారంభిస్తారు. మీకు నొప్పి, బాధ లేకుండానే సర్జరీ చేస్తారు. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని వైద్యులు నిర్ధారణ చేస్తే, ఈ విధానం గురించి మీకు పూర్తిగా వివరించి, మిమ్మల్ని మానసికంగా ఆపరేషన్‌కు సిద్ధం చేస్తారు.
అలాగే సర్జరీ తర్వాత మీ ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. వైద్యులు చేసే కొన్ని సూచనలను మాత్రం మీరు తప్పకుండా ఫాలో కావాల్సి ఉంటుంది. వ్యాయామాలు, ఫిజియోథెరపీ గురించి వైద్యులు క్షుణ్ణంగా తెలియజేస్తారు. దీనికి రోజుల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స గురించి మీరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు.
- డాక్టర్ ప్రవీణ్ రావు, సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఫాస్ట్‌ట్రాక్ విధానం వల్ల కోలుకోవడం ఈజీ
Published Sun, Sep 25 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement