కింజరాపు కుటుంబం చుట్టూ అసమ్మతి ఉచ్చు | Sakshi
Sakshi News home page

కింజరాపు కుటుంబం చుట్టూ అసమ్మతి ఉచ్చు

Published Wed, Apr 16 2014 1:47 AM

Kinjarao accenna Around Protest

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన కింజరాపు కుటుంబం ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోని కీలక నేతలకు పొగబెట్టడం.. కొన్ని ప్రధాన సామాజికవర్గాలను అణచివేయాలన్న బాబాయ్, అబ్బాయ్ కింజరాపు అచ్చెన్న, రామ్మోహన్ నాయుడుల పన్నాగం బెడిసికొట్టింది. దాంతోకీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు ఇంటా బయట అసమ్మతి కమ్ముకోవడంతో కింజరాపు కుటుంబ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
 
 ఎదురు తిరిగిన సీనియర్లు
 జిల్లా టీడీపీలో తాము తప్ప మరెవరూ రాజ కీయంగా బలోపేతం కాకూడదన్న కింజరాపు అచ్చెన్న, రామ్మోహన్‌ల పన్నాగం వారికే ఎదురుతిరిగింది. సీనియర్ నేత కళా వెంకట్రావుకు జిల్లా పెద్దరికం అప్పగించాలని చంద్రబాబు కచ్చితంగా చెప్పారు. కానీ కళాను శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అడుగుపెట్టనివ్వకుండా కింజరాపు కుటుంబం అడ్డుకుంది. అంతేకాదు జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆయన మరదలు మృణాళిని పేరును ప్రకటించాలని చంద్రబాబు భావిస్తే అచ్చెన్నాయుడు అడ్డుకున్నారు. దాంతో మృణాళిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను  ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కళా వెంకట్రావు శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో రామ్మోహ న్ నాయుడుకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సీనియర్ నేత గుండ అప్పలసూర్యనారాయణకు వ్యతిరేకంగా అచ్చెన్న, రామ్మోహన్‌లు పావులు కదుపుతున్నారు.
 
 దీన్ని గ్రహించిన అప్పలసూర్యనారాయణ దంపతులు రామ్మోహన్ నాయుడుకు వ్యతిరేకంగా బలమైన వర్గా న్నే తయారు చేశారు. పలాస టిక్కెట్టు ఆశించిన సీనియర్ నేత గౌతు శివాజీకి ఇంట్లోనే చిచ్చు పెట్టారు. ఈసారి శివాజీకి కాకుండా ఆయన కుమార్తె శిరీషకు టిక్కెట్టు ఇవ్వడం మంచిదని అచ్చెన్న పార్టీ అధినేతకు సూచించారు. తనకంటే జూనియర్లు తన టిక్కెట్టునే అడ్డుకోవాలని ప్రయత్నించడంపై శివాజీ భగ్గుమన్నారు. పట్టుబట్టి మరీ టిక్కెట్టు సాధించిన ఆయన ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌పై సహాయనిరాకరణకు పావులు కదుపుతున్నారు. ఇక మాజీ మంత్రి శత్రుచర్లను పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను అచ్చెన్న, రామ్మోహన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ కార్పొరేట్ లాబీ ద్వారా పార్టీలో చేరిన శత్రుచర్ల కింజరాపు కుటుంబ అభిమతానికి విరుద్ధంగా పాతపట్నం టిక్కెట్టు దక్కించుకున్నారు. ప్రస్తుతం శత్రుచర్ల ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ను పాతపట్నం నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వడమే లేదు.
 
 ప్రధాన సామాజికవర్గాల ఆగ్రహం
 మరోవైపు జిల్లాలో ప్రధాన సామాజికవర్గాలను అణగదొక్కాలని ప్రయత్నించి కింజరాపు కుటుంబం చేతులు కాల్చుకుంది. ప్రధానంగా కాళింగ, తూర్పుకాపు సామాజికవర్గాల నేతల రాజకీయ అవకాశాలకు ఈ కుటుంబం గండికొట్టింది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా ఉన్న కాళింగ సామాజికవర్గానికి అవకాశాలు లేకుండా చేసింది. ఈ సామాజికవర్గం జనాభా, ఓట్లపరంగా ఆమదాలవలస, టెక్కలి, పలాస  నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉంది. అంతటి ప్రాధాన్యమున్న ఈ వర్గానికి టెక్కలి, పలాస  నియోజకవర్గాల్లో టిక్కెట్లు కేటాయించకుండా అచ్చెన్న, రామ్మోహన్‌లు అడ్డుకున్నారు. ఒక్క ఆమదాలవలస నియోజకవర్గానికే పరిమితం చేశారు.
 
 ముందుగా ఇస్తామని చెప్పిన ఇచ్ఛాఫురం టిక్కెట్టును కూడా చివరి నిముషంలో బీజేపీకి కేటాయించేలా రామ్మోహన్ పావులు కదిపారు. బీజేపీకి మొదట  కేటాయించిన నరసన్నపేట బదులుగా ఇచ్ఛాఫురం ఇచ్చేలా చేశారు. తమ సన్నిహితుడికి నరసన్నపేట అభ్యర్థిగా నిర్ణయించి ఇచ్ఛాఫురంలో కాళింగ నేత అవకాశాలకు గండికొట్టారు. పాతపట్నంలో కూడా అత్యధికంగా ఉన్న  తూర్పుకాపు సామాజికవర్గ అభ్యర్థికి టీడీపీ టిక్కెట్టు కేటాయించలేదు. కింజరాపు కుటుంబం ఒత్తిడికి తలొగ్గే చంద్రబాబు తమకు మొండిచెయ్యి చూపారని కాళింగ, తూర్పుకాపు సామాజికవర్గాలు భగ్గుమంటున్నాయి.
 
 దాంతో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో రామ్మోహన్‌కు, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పనిచేస్తామని ఆ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇచ్ఛాపురం టిక్కెట్టు తమకు దక్కకుండా చేశారన్న ఆగ్రహంతో కాళింగ సామాజికవర్గానకి చెందిన బెందాళం అశోక్ అనుచరులు శ్రీకాకుళంలో రామ్మోహన్‌నాయుడు నివాసంలో సోమవారం విధ్వంసం సృష్టించారు. రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి బాబాయ్ అబ్బాయ్‌లను ఓడిస్తామని తేల్చిచెప్పారు. ఇలా ఒకేసారి అసమ్మతి చుట్టుముట్టడంతో కింజరాపు కుటుంబం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.
 

Advertisement
Advertisement