‘రణ’ ధీరులెవరో..! | Sakshi
Sakshi News home page

‘రణ’ ధీరులెవరో..!

Published Fri, May 16 2014 3:37 AM

‘రణ’ ధీరులెవరో..! - Sakshi

నరాలు తెగే ఉత్కంఠ...  విజేతలెవరో, పరాజితులెవరో తేలే సందర్భం... తమ నుదిటి రాత ఎలా ఉండబోతోందంటూ బరిలో నిలిచిన నేతల్లో ఉద్విగ్నత... కూడికలు, తీసివేతల లెక్కలతో పార్టీలు, అభ్యర్థులు ఎడతెగని కుస్తీ... ఓటరు దేవుడు వెల్లడించే తీర్పు కోసం ఎదురు చూపులు... గెలుపోటములు, ఓట్లు, సీట్లు లెక్కలతో సంబంధం లేకుండా అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో బిజీ. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితి.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు లెక్కించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 30న జరిగిన ఏడో విడత సాధారణ ఎన్నికల్లో 28.94 లక్షల మంది ఓటర్లకు గాను 73.04 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.
 
 రెండు లోక్‌సభ స్థానాలతో పాటు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు వేర్వేరు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో 14 టేబుళ్లను ఒక రౌండుగా పరిగణించగా, ప్రస్తుతం ఏడు టేబుళ్లను ఒక రౌండుగా పరిగణిస్తారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా 36 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. కొడంగల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 30 రౌండ్లలోనే పూర్తి కానుంది.
 
 దీంతో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం వుంది. రౌండ్ల సంఖ్య పెరగడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 17,448 ఓట్లు పోల్ కాగా, ఓట్ల లెక్కింపును తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రతీ టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సహాయకులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఈసీఐఎల్ సాంకేతిక నిపుణుడు వుంటారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించారు.
 
 పటిష్ట భద్రత
 లెక్కింపు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్తను పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ఏజెంట్లు, మీడియాకు పాసులు జారీ చేసిన అధికార యంత్రాంగం ఇతరులెవరూ కౌంటింగ్ కేంద్రాల దరిదాపుల్లోకి రాకుండా బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పోలీసు యాక్టు 30 అమల్లో ఉన్నందున అనుమతి లేని ఊరేగింపులపై నిషేధం విధించారు. శనివారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ ఓట్ల లెక్కింపు, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement