భారతదేశం ప్రాంతీయ అసమానతలు | Sakshi
Sakshi News home page

భారతదేశం ప్రాంతీయ అసమానతలు

Published Mon, Aug 22 2016 11:39 PM

భారతదేశం ప్రాంతీయ అసమానతలు

 దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే కొన్ని వెనుకంజలో ఉన్నాయి. అదేవిధంగాఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంటే మరికొన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. భారతదేశ అభివృద్ధి, సమైక్యతకు మూలాధారం.. సంతులిత ప్రాంతీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలుప్రణాళిక లక్ష్యాల్లో ‘సంతులిత ప్రాంతీయాభివృద్ధి’ని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
 
 ప్రాంతీయ అసమానతలు - కొలమానాలు
 1. రాష్ట్ర తలసరి ఆదాయం 2. పేదరిక స్థాయి 3. మానవ అభివృద్ధి సూచిక 4. పారిశ్రామిక - ఉద్యోగిత 5. సహజ వనరుల లభ్యత, నీటిపారుదల సౌకర్యాలు 6. పట్టణీకరణ 7. విద్యుచ్ఛక్తి వినియోగం 8. బ్యాంకు డిపాజిట్లు
 
 1. రాష్ర్ట తలసరి ఆదాయం
 2012-13 ప్రస్తుత ధరల్లో జాతీయ సగటు

 రూ.67,839 ఉండగా హరియాణా రూ. 1,19,158తో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మహారాష్ర్ట రూ. 1,03,991, తమిళనాడు రూ.98,628, గుజరాత్ రూ. 96,976, కేరళ రూ.88,527, పంజాబ్ రూ.84,526, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూ. 78,958, కర్ణాటక రూ. 76,528 జాతీయ సగటు కంటే ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. బిహార్ రూ. 27,202, ఉత్తరప్రదేశ్ రూ. 33,616, అసోం రూ.40,475, మధ్యప్రదేశ్ రూ. 44,989, ఒడిశా రూ. 49,241 జాతీయ సగటు కంటే తక్కువ తలసరి ఆదాయాలు కలిగి ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను గుర్తించడానికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని సూచికగా తీసుకుంటే రాష్ట్రాల మధ్య అసమానతలు తెలుస్తాయి. కానీ రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య అసమానతలు తెలుసుకోవడానికి వీలు కాదు.
 
 2. పేదరిక స్థాయి
 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన   Hand book of statistics on the Indian economy - - (2013-14)లో 2011-12 సంవత్సరానికి గానూ పేదరిక రేఖ దిగువన 21.9శాతం దేశ జనాభా ఉంది. పేదరిక రేఖ దిగువన అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు.. కేరళ (7.1 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (8.1 శాతం), పంజాబ్ (8.3 శాతం), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (9.2 శాతం), హరియాణా (11.2 శాతం). కాగా పేదరిక దిగువన అతి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు.. బిహార్ (33.7 శాతం), ఒడిశా (32.6 శాతం), అసోం (32 శాతం), మధ్యప్రదేశ్ (31.7 శాతం), ఉత్తరప్రదేశ్ (29.4 శాతం).
 
 3. మానవాభివృద్ధి సూచిక
 ప్రాంతీయ అసమానతలను పరిశీలించేటప్పుడు ఆదాయ అసమానతలకు ఇచ్చిన ప్రాధాన్యతను మానవ అభివృద్ధిని నిర్ణయించే అంశాలైన అక్షరాస్యత, లింగ నిష్పత్తి, శిశు మరణాలు మొదలైన వాటికి కూడా ఇవ్వాలి.
 
 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది. 93.91 అక్షరాస్యతతో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా కేరళలో స్త్రీల అక్షరాస్యత 91.98 శాతంగా ఉంది. ఇక్కడ ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల జనాభా 1084. కాగా శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 12 (2009)గా ఉంది. బిహార్ 63.82 శాతం అక్షరాస్యతతో దేశంలోనే తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రంగా నిలిచింది. మహిళా అక్షరాస్యతలో రాజస్థాన్ 52.66 శాతంతో దేశంలోనే చివరి స్థానాన్ని దక్కించుకుంది. హరియాణాలో ప్రతి వేయి మంది పురుషులకు కేవలం 887 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
 
  ఇక్కడ ప్రతి వేయి మందికి 67 మంది శిశువులు మరణిస్తున్నారు. బీమారు  రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్, అసోం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వృద్ధి రేటులో పెరుగుదల ఉన్నప్పటికీ, మానవాభివృద్ధిని నిర్ణయించే సూచికల్లో మెరుగుదల లేదు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్‌లలో అక్షరాస్యత, మహిళల జనాభా విషయంలో ప్రతికూల గణాంకాలు నమోదయ్యాయి. మానవాభివృద్ధి 2007-08లో జాతీయస్థాయిలో 0.467 ఉంది. కేరళ (0.790), ఢిల్లీ (0.750), హిమాచల్‌ప్రదేశ్ (0.652), గోవా(0.617), పంజాబ్ (0.605)లతో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ (0.358), ఒడిశా (0.362), బిహార్ (0.367), మధ్యప్రదేశ్ (0.375), జార్ఖండ్ (0.376) చివరి స్థానాల్లో నిలిచాయి.
 
 4. పారిశ్రామికాభివృద్ధి - ఉద్యోగిత
 మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లు 34.60 శాతం, పశ్చిమ బెంగాల్ 24.65 శాతం పారిశ్రామిక స్థిర మూలధనాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఈ మూడు రాష్ట్రాల్లోనే మొత్తం 59.25 శాతం పారిశ్రామిక స్థిర మూలధనం ఉంది. ఈ రెండు ప్రాంతాలు 63.03 శాతం ఉద్యోగిత, 63.95 శాతం పారిశ్రామికోత్పత్తిని కలిగి ఉండటం తీవ్రమైన అసమానతలను తెలియజేస్తోంది.
 
  5. సహజ వనరుల లభ్యత, నీటిపారుదల సౌకర్యాలు
 పంజాబ్, హరియాణా మొదలైన రాష్ట్రాల్లో నీటిపారుదల సౌకర్యాలు, సహజ వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఏపీ, యూపీల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
 
 6. పట్టణీకరణ
 అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీకరణ జరిగి పట్ణణ జనాభా ఎక్కువగా ఉంటుంది. జాతీయ స్థాయి పట్టణ జనాభా 31.2 శాతం. తమిళనాడు (48.4 శాతం), మహారాష్ట్ర (45.2 శాతం), గుజరాత్ (42.6 శాతం), కర్ణాటక (38.6 శాతం), పంజాబ్ (37.5 శాతం) మొదలైన రాష్ట్రాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది. బిహార్ (11.3 శాతం), అసోం (14.1 శాతం), ఒడిశా (16.7 శాతం), ఉత్తరప్రదేశ్ (22.3 శాతం) వంటి రాష్ట్రాల్లో పట్టణ జనాభా తక్కువగా ఉంది.
 
 7. విద్యుచ్ఛక్తి వినియోగం
 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుత్ శక్తి వినియోగం 121.2 కిలోవాట్లు. కాగా ఢిల్లీ 508.8, పంజాబ్ 257.3, తమిళనాడుల్లో 208.5 కిలోవాట్లు ఉంది. అతి తక్కువగా బిహార్‌లో 20.5, ఉత్తరప్రదేశ్‌లో 83.4, మధ్యప్రదేశ్‌లో 73.4 కిలోవాట్లు మాత్రమే ఉంది.
 
 8. వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
 జాతీయ స్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011 మార్చి నాటికి రూ.33,174 ఉన్నాయి. ఢిల్లీ రూ. 2,85,400, మహారాష్ట్ర రూ. 82,380 కలిగున్నాయి. బిహార్ రూ.9,667, అసోం రూ.16,393 తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.     

Advertisement

తప్పక చదవండి

Advertisement