మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం | Sakshi
Sakshi News home page

మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం

Published Tue, Sep 27 2016 12:14 AM

మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం - Sakshi

పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలో ఎక్కువస్కోరింగ్‌కు అవకాశం కల్పించే విభాగం.. సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్). ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం,అర్థ శాస్త్రం ఇలా నాలుగు భాగాలుగా ఉండే సాంఘిక శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలువచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రిపేర్ కావడం కూడా సులభమే. తద్వారా ఈ అంశాల్లో 100 శాతం స్కోర్ సాధించవచ్చు.ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం ప్రిపరేషన్‌కు సంబంధించి ఎటువంటి వ్యూహాలుఅనుసరించాలి, ముఖ్యమైన అంశాలు, ప్రశ్నల సరళి తదితరాలపై విశ్లేషణ..
 
 భారతదేశ చరిత్ర: భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి.. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పరిపాలించిన రాజులు-వంశాలు, ఆనాటి రాజకీయ-సాంఘిక పరిస్థితులు, మత, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై దృష్టిసారించాలి.ప్రాచీన చరిత్ర: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతి యుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి.
 
  క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు-వారి ప్రవచనాలు, సామాజిక మార్పులకు అవి ఏవిధంగా కారణమయ్యాయో విశ్లేషించుకుంటూ చదవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి.మధ్యయుగ  చరిత్ర: సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.
 
  ఇదేకాలంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, కాకతీయులు, హోయసలులు, పాండ్యులు తదితర రాజ్యాల కాలంనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్నంగా చదవాలి. అంతేకాకుండా భక్తి ఉద్యమం, సూఫీ మతం గురించి కూడా తెలుసుకోవాలి. ఆధునిక భారత చరిత్ర: క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి.
 
 భూగోళ శాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలు.. సౌర కుటుంబం, గ్రహాలు, భూమి, భూ చలనాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, గ్రహణాలు, భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, పర్వతాలు, భూకంపాలు, సముద్రాలు గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈ  క్రమంలో భారతదేశ ఉనికి, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, అడవులు, మృత్తికలు, నదులు, వ్యవసాయం, పంటలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్ట్‌లు, రవాణా సమాచార సాధనాలు, జనాభా, ఓడరేవులు, పరిశ్రమలు, ఖనిజాలు, దర్శనీయ ప్రదేశాలు వంటి అంశాలను విస్తృతంగా చదవాలి. ఈ అంశాలను అట్లాస్‌తో సమన్వయం చేసుకుంటూ చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
 పాలిటీ: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, మానవ హక్కులు, సమాచార హక్కుచట్టం, భారత రాజ్యాంగంలోని ముఖ్య ఘట్టాలను బాగా చదవాలి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి మధ్య సంబంధాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటిని సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన వ్యవస్థ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థ వాటి పనితీరు గురించి అధ్యయనం చేయాలి. 
 
 అర్థశాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటే మిగిలిన అంశాలను చదవడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉత్పత్తి, మారకం, పంపిణీ సమస్యలు, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు, వాటి కాలాలు, ఫలితాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
 
 ఏం చదవాలి? ఈ అంశాలకు సంబంధించి 6 నుంచి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదవాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ బిట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. 
 
 గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు
 రుగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొంది-పశువులను దొంగిలించడం
 పల్లవులు ఎక్కడి నుంచి పరిపాలించారు-కాంచీపురం
 విష్ణుకుండినుల రాజధాని-దెందులూరు
 వాస్కోడిగామా ఏ దేశస్థుడు-పోర్చుగల్
 జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉంది-
  అమృత్‌సర్
 శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహసంబంధాలు కొనసాగించాడు-పోర్చుగీసు వారితో
 నెప్ట్యూన్ వాతావరణం ఏ గ్రహ వాతావరణానికి సమానంగా ఉంటుంది                           
    - యురేనస్
 

Advertisement
Advertisement