అద్భుత అవకాశంగా భావిస్తున్నా: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

అద్భుత అవకాశంగా భావిస్తున్నా: చంద్రబాబు

Published Fri, Feb 12 2016 4:56 PM

అద్భుత అవకాశంగా భావిస్తున్నా: చంద్రబాబు - Sakshi

విశాఖపట్నం : అమెరికా ప్రభుత్వంతోపాటు ఆ దేశ సంస్థలతో కలసి పని చేయడం అద్భుత అవకాశంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖపట్నం నగరంలోని గేట్ వే హోటల్లో యూఎస్ ప్రతినిధులతో జరిగిన యూఎస్ఐడీ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... హుద్హుద్ తుపాన్ నుంచి కోలుకున్న విశాఖ నగరంలో రెండు కీలక సదస్సులు జరగడం విశేషమని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20 స్మార్ట్ సిటీల తొలి జాబితాను విడుదల చేసిందని... అందులో విశాఖ నగరం ఆ జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. 

భారత్లో తొలిసారి ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఐఎఫ్ఆర్లో 50 దేశాలు పాల్గొన్నాయన్నారు.  ఈసందర్భంగా ఆయాదేశాల ప్రతినిధులు విశాఖ నగరాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. విశాఖపట్నం నుంచి ముంబయి ఎక్స్ప్రెస్ వేపై కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడినట్లు చంద్రబాబు వెల్లడించారు. తీర ప్రాంత అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

చెన్నై నుంచి బెంగళూరుకు కృష్ణపట్నం పోర్ట్ మీదుగా జైకా పని చేస్తుందని... అలాగే విశాఖ నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్పై ఏడీబీ పని చేస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని... అలాగే త్వరలో గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో పలు కీలక ఒప్పందాలపై యూఎస్ అధికారులు, ఏపీ అధికారులు సంతకాలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement