దొంగలు దొరికారు.. | Sakshi
Sakshi News home page

దొంగలు దొరికారు..

Published Wed, Jun 29 2016 2:49 AM

దొంగలు దొరికారు.. - Sakshi

28 తులాల బంగారు, 50 తులాల వెండి రికవరీ
కర్నూలు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు దొంగలు ఎట్టకేలకు దొరికారు. హాలహర్వి గ్రామానికి చెందిన నీలిషికారి శ్రీను అలియాస్ పొట్టి శ్రీను, నీలిషికారి నాయుడు, కర్నూలు చెన్నమ్మ సర్కిల్‌లోని చౌడమ్మ గుడి దగ్గర నివాసముంటున్న నీలిషికారి చిన్నబాబును బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని 10-బొల్లవరం గ్రామ చావిడి వద్ద అనుమానంపై అదుపులోకి తీసుకున్నారు.

విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. వారి వద్ద నుంచి రూ.9 లక్షలు విలువ చేసే 28 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  దొంగలను మంగళవారం ఎస్పీ ఎదుట హాజరు పరిచారు.  

జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దొంగల నేరాల చిట్టను ఎస్పీ వెల్లడించారు. దొంగలను అరెస్టు చేసి భారీ మొత్తంలో సొమ్ములు రికవరీ చేసిన సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్‌ఐలు రాజ్‌కుమార్, లక్ష్మీనారాయణ, బాలనరసింహులు, క్రైం పార్టీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు.    
 
నేరాల చిట్టా
* 2015 ఫిబ్రవరి 9వ తేదీన నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన జూటూరు నాగేంద్ర ఇంటిలో 12 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.30 వేలు అపహరించారు.
* హాలహర్వి మండలం క్షేత్రగుడి చెక్‌పోస్టు దగ్గర ఈనెల 1వ తేదీ రాత్రి హాలహర్వి గ్రామానికి చెందిన సతీష్‌కుమార్ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని 16 తులాల బంగారు ఆభరణాలను, రూ.45 వేల నగదును చోరీ చేశారు.
* నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పీఎస్ పరిధిలోని శాతనకోట గ్రామ శివారులో 2015 జులై 2వ తేదీ రాత్రి హాలహర్వి గ్రామానికి చెందిన నీలిషికారి మహేష్‌ను వివాహేతర సంబంధం విషయంలో పిడిబాకుతో పొడిచి హత్య చేశారు.
* వివాహేతర సంబంధాల కారణంగా మరో ఆరు హత్య కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసు రికార్డులలో పొందుపరిచారు.

Advertisement
Advertisement