చల్లగా జెల్ల | Sakshi
Sakshi News home page

చల్లగా జెల్ల

Published Tue, Aug 23 2016 12:20 AM

చల్లగా జెల్ల

ప్రయాణికుల జేబులకు ఆర్టీసీ చిల్లు
‘సేఫ్టీ’ సెస్‌ పేరుతో టిక్కెట్టుపై రూ.1 వసూలు
నెలకు రూ.36 లక్షల బాదుడు
ఇప్పటికే రకరకాల సెస్సులతో మోతెక్కుతున్న చార్జీలు
 
సాక్షి, రాజమహేంద్రవరం :
అత్యధిక ప్రజల రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు ప్రయాణం రోజురోజుకూ భారంగా మారుతోంది. రకరకాల సెస్సుల పేరిట ప్రభుత్వం ప్రయాణికులకు చల్లగా జెల్ల కొడుతోంది. నొప్పి తెలియకుండా నెత్తురు పీల్చే దోమలా అదనపు వసూళ్లతో వారి జేబులకు చిల్లులు పెడుతోంది. తాజాగా ‘రక్షణ పన్ను’ (సేఫ్టీ సెస్‌) పేరుతో దూరంతో సంబంధం లేకుండా ప్రతి టిక్కెట్టుపై అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తోంది. పల్లెవెలుగు మినహా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో ప్రయాణించేవారి నుంచి ఈ పన్ను వసూలు చేస్తోంది.
అదనపు వసూళ్లు ఇలా..
  • ఇప్పటికే టిక్కెట్టు ధరతోపాటు టోల్‌ ప్లాజా చార్జీలను కూడా ప్రయాణికుల నుంచే వసూలు చేస్తున్నారు.
  • 2015 నుంచి పాసింజర్‌ సెస్‌ పేరిట ప్రతి టిక్కెట్టుపై 2 రూపాయల భారం వేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ సెస్‌ పేరిట ఇందులో ఒక రూపాయి ప్రభుత్వం తీసుకుంటోంది.
  • 2015 సెప్టెంబర్‌లో ఏ1 బస్టాండ్లయిన కాకినాడ, రాజమహేంద్రవరంలలో బస్సుల రాకపోకలు ఇతర సమాచారాన్ని ప్రయాణికులు తెలుసుకునేందుకు ఒక్కో కియోస్క్‌ ఏర్పాటు చేశారు. ఆ పేరుతో ‘ప్రయాణికుల సమాచార వ్యవస్థ’ (పిస్‌) పేరిట ప్రతి టిక్కెట్టుపై రూ.1 గుంజుతున్నారు.
రోజుకు రూ.1.2 లక్షల ‘సేఫ్టీ’ సెస్‌ భారం...
ఈ ఏడాది జూలై 5వ తేదీ నుంచి సేఫ్టీ ట్యాక్స్‌ విధిస్తున్నారు. జిల్లాలో 97 ఎక్స్‌ప్రెస్, 72 అల్ట్రా డీలక్స్, 124 సూపర్‌ లగ్జరీ, రెండు అమరావతి, 17 ఇంద్ర, 14 గరుడ, 2 గరుడ ప్లస్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ సర్వీసుల్లో ప్రతి రోజూ సుమారు 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరి నుంచి సేఫ్టీ సెస్‌ పేరుతో ప్రతి రోజూ రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఆమేరకు వారిపై భారం పడుతోంది. ఇలా నెలకు రూ.36 లక్షలు, ఏడాదికి రూ.4.32 కోట్లు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ గుంజుతోంది.
ఆర్టీసీని ఆదాయ వనరుగా మలచుకున్న ప్రభుత్వం
పేద, మధ్య తరగతి ప్రజల ప్రయాణ వ్యవస్థ అయిన ఆర్టీసీని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడంతోనే ఈవిధంగా భారా లు మోపుతోందన్న విమర్శలు ఉన్నాయి. సామాన్యుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే దానికి ఆర్టీసీపై వేసిన పన్నులే ఉదాహరణ. ధనికులు ప్రయాణించే విమాన ఇంధన ధరపై ఒక శా తం, రైళ్లకు వినియోగిస్తున్న డీజిల్‌పై 4 శా తం చొప్పున కేంద్రం పన్ను విధిస్తుండగా.. అదే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్‌పై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 27 శాతం పన్ను విధిస్తోంది. అలాగే టిక్కెట్టు ఆదాయంపై 7 శాతం పన్ను వసూలు చేస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా సంస్థకు వచ్చే ఆదాయంపై 14.5 శాతం పన్ను విధిస్తోంది. ఈ పన్నులను కొంతమేర తగ్గిస్తే.. ప్రయాణికులపై భారాలు వేయకుండానే ఆర్టీసీ నష్టాలను చాలావరకూ పూడ్చుకోవచ్చని అధికారులే అంటున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement