అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్ష | Our expectation of development in all districts | Sakshi
Sakshi News home page

అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్ష

Nov 4 2015 12:45 AM | Updated on Aug 9 2018 4:26 PM

అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్ష - Sakshi

అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్ష

రాష్ర్టంలోని 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాలని, ఒకే ప్రాంతం లో అభివృద్ధిని కేంద్రీకరించి మిగిలిన ప్రాంతాలకు అన్యాయం చేయడం

♦ అభివృద్ధి వికేంద్రీకరణ తక్షణావసరం..
♦ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 సాక్షి, కడప: రాష్ర్టంలోని 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాలని,  ఒకే ప్రాంతం లో అభివృద్ధిని కేంద్రీకరించి మిగిలిన ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారంనాడు ఆయన వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని చుట్టూ అభివృద్ధిని కేంద్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 ముఖ్యమంత్రి అంటే 13 జిల్లాలకూ న్యాయం చేయాలి..
 ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండాలి? మొత్తం 13 జిల్లాలను ఒకేమాదిరిగా చూసేవాడుగా, 13 జిల్లాలకు న్యాయం చేసేవాడుగా ఉండాలి. ఏ జిల్లాలోనూ ఫలానా ముఖ్యమంత్రి వల్ల తమకు అన్యాయం జరిగింది అని భావించే పరిస్థితి ఉండకూడదు. కానీ చంద్రబాబు పాలన అలా లేదు. తొమ్మిది రకాల గ్రోత్ సెంటర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఐటీ గ్రోత్ సెంటర్, మాన్యుఫాక్చరింగ్ గ్రోత్ సెంటర్... ఇలా అన్నిటినీ 100 కి.మీ పరిధిలో ఒకేచోట కేంద్రీకరిస్తున్నారు. అలా కాకుండా ప్రతి నగరంలో అభివృద్ధి జరగాలి.  రాజధాని నగరానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాల్సిందే. అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే ఉండాలి.

దాని తర్వాత హైకోర్టును కాస్త దిగువకు తీసుకురావాలి. ఇంకొకచోటకు ఇంకొకటి తీసుకుపోవాలి. అపుడు 13 జిల్లాల్లో ఎవరూ బాధపడే పరిస్థితి తలెత్తదు. 13 జిల్లాల్లోనూ ముఖ్యమైన పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ది అవుతాయి. గ్రోత్ సెంటర్స్‌ని వికేంద్రీకరించడం వల్ల అన్ని ప్రాం తాలు అభివృద్ధి చెందుతాయి. అలా కాక అన్నిటినీ ఒకే చోట కేంద్రీకరించాలన్న బాబు వైఖరి వల్ల అన్ని ప్రాంతాలలోనూ అశాంతి కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ర్టం కావాలన్న డిమాండ్‌తోనే తొలుత తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ వెనకబాటుకు గురయ్యిందన్న కారణంతో ఉద్యమం చేశారు.  అయితే చివరకొచ్చేసరికి మాకు హైదరాబాద్ కావాలి అంటూ ఉద్యమించేలా పరిస్థితి మారిపోయింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఏరకంగా ఉద్యమాలు పురుడుపోసుకుం టాయో తెలుసుకునేందుకు అదో ఉదాహరణ.

 కరెంటు కోసం  సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా?
 శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇవాళ 844 అడుగులు మాత్రమే నీరు ఉంది. అయినా ప్రతిరోజు 20వేల క్యూసెక్కులో, 10వేల క్యూసెక్కులో, 6వేల క్యూసెక్కులో నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం కిందికి వదులుతూనే ఉన్నారు.  ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చూస్తే శ్రీశైలం నుంచి ప్రతిరోజూ నీటిని విడుదల చేస్తున్నట్లు స్పష్టంగా ఉంది. శ్రీశైలంలో  854 అడుగుల వద్ద నీటిమట్టాన్ని ఉంచితే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరు చేరే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరు చేరితేనే సీమ ప్రాజెక్టులకు నీరు అందుతుంది. గండికోట, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరు రావాలంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడుకు రావాలి.

మరి 844 అడుగుల నీటిమట్టమే ఉన్నా శ్రీశైలం నీరెందుకు వదులుతున్నారు? అంటే సీమ ప్రాజెక్టులను గాలికొదిలేయడమే కదా? విపత్కర పరిస్థితులు వస్తాయని తెలిసి కూడా చంద్రబాబు రాయలసీమ ప్రజల కు తీరని అన్యాయం చేస్తున్నారు. వారి నోట్లో దుమ్ము కొడుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికైతే నీరు ఇస్తారు కానీ.. సీమ ప్రజలకు నీరు ఇవ్వని చంద్రబాబును ఏమనాలో తెలి యడం లేదు. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నందువల్లే చంద్రబాబు వైఖరిపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రజలు గళం విప్పుతున్నారు.

 15 శాతం పనులు పూర్తిచేయలేకపోతున్నారు...
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ర్టంలో ప్రాజెక్టులకు సంబంధించి 85 నుంచి 90 శాతం పనులు పూర్తి చేశారు. ఆ మహానేత చనిపోయి ఆరేళ్లవుతోంది.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను చూస్తే కనీసం 10శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయారు. 15శాతం మాత్రమే మిగిలిన గండికోట, పైడిపాలెం ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. బ్యాలెన్స్ వర్క్‌లను కూడా చేయలేకపోగా.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయకుండా ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గండికోటలో 4.50టీఎంసీల నీరు ఉంటే పైడిపాలెం, చిత్రావతికి నీరు తెచ్చుకొనేందుకు వీలుంటుంది. కానీ గండికోటకు నీరు రావాలంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారానే రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టి 18 నెలలు పూర్తయ్యాయి. ఇంతవరకు గండికోటకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. గండికోట నుంచి పైడిపాలెంకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు.

 మెడికల్ సీట్ల విషయంలోనూ ..
 రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల మెడిసిన్ విద్యార్థులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. తిరుపతిలో పద్మావతి మెడికల్ కళాశాలలో లోకల్ రిజర్వేషన్ ప్రకారం 150సీట్లు ఈ ఆరు జిల్లాల్లోని విద్యార్థులకు ఇవ్వాల్సి ఉండగా.. ప్రత్యేకంగా 120 జీవో జారీ చేసి కేవలం 11సీట్లను మాత్రమే కే టాయించారు. మెడిసిన్ సీట్ల విషయంలోనూ సీమకు అన్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇలా అన్ని ప్రాంతాలలో భా వోద్వేగాలు రెచ్చగొట్టేలా బాబు తీరు ఉంది.

పులివెందులపై వివక్ష
 అభివృద్ధితోపాటు అన్ని వ్యవహారాలలో కొన్ని జిల్లాలపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారు. అందుకు ఉదాహరణ పులివెందులనే చెప్పుకోవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే అందులో ఒక్క లింగాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి మిగతా ఆరు మండలాలను విస్మరించారు. ఈ ప్రాంతంలో కరువు ఎంతగా విలయతాండవం చేస్తున్నదో అందరికీ తెలిసిందే. బాబు వివక్ష చూపుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం.

 పైడిపాలెం ప్రాజెక్టు పరిశీలన
 పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో గల పైడిపాలెం ప్రాజెక్టును ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement