‘ఉపాధి’ ఉత్తిదే! | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఉత్తిదే!

Published Sun, Aug 21 2016 12:01 AM

‘ఉపాధి’ ఉత్తిదే! - Sakshi

– కరువులోనూ ఆదుకోని పథకం
 – కుటుంబానికి ‘వంద’.. అందనంత దూరమే!
– పనుల్లేక వలస బాటలో కూలీలు
– ‘భృతి’ విషయాన్ని మరచిన వైనం


అనంతపురం టౌన్‌ : జాబ్‌కార్డు ఉండి పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకంలో పని చూపించాలన్నది చట్టంలోని నిబంధన. ఈ పథకానికి నిధుల కొరత లేదు. నమోదైన వారందరికీ పనులు కల్పించాలి. పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పని చేయాలి. కానీ జిల్లాలో  పరిస్థితి భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో పని కావాలని అడుగుతున్నా  అధికారులు కల్పించడం లేదు. తమకు అనుకూలమైన వారికి మాత్రమే పనులు చూపుతూ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. కొన్నిచోట్ల లేని కూలీలను ఉన్నట్లు చూపి అక్రమాలకు పాల్పడుతున్నారు.

పనుల్లేక వలసబాట
ప్రతి కుటుంబానికి వంద రోజులు పని చూపించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఈ పథకాన్ని తీసుకొచ్చినా.. అది కాగితాలకే పరిమితం అవుతోంది. ఏటా జిల్లాలో కరువు నెలకొంటున్నా కూలీల ఉపాధికి ఏ మాత్రమూ ‘హామీ’ ఇవ్వలేకపోతున్నారు. దీంతో బయట వ్యవసాయ పనులు లేక.. ఉపాధి దొరకక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి చూపలేని పక్షంలో భృతి కింద డబ్బు ఇవ్వాల్సిన ఉన్నా ఏ ఒక్కరికీ ఇస్తున్న పాపానపోవడం లేదు.

ఈ క్రమంలో కూలీలు వలస బాట పడుతున్నారు. ఒక్క కుందుర్పి మండలంలోనే వేలాది కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాయి. ఈ మండలంలోని బెస్తరపల్లి, ఎనుములదొడ్డి, తూముకుంట, కరిగానిపల్లి, ఎర్రగుంట, మలయనూరు, నిజవల్లి, జంబగుంపల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున వలసబాట పట్టారు. ఇప్పుడు ముసలీముతక తప్ప ఎవరూ ఇళ్ల వద్ద ఉంటున్న పరిస్థితి లేదు. కానీ అధికారుల కళ్లకు ఇవేమీ కన్పించకపోవడం గమనార్హం.

మరుగున పడుతున్న ప్రణాళికలు
ఉపాధి పథకం సిబ్బంది ఏడాదికి ఒకసారి గ్రామాల్లో సభలు నిర్వహించి పథకం కింద చేపట్టాల్సిన పనులు గుర్తించాలి. ఆయా పనులను ఏడాదిలో పూర్తి చేసేలా, అడిగిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలి. కానీ..ఈ ప్రక్రియ పక్కాగా చేపట్టడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి  జిల్లాలో మొత్తం 98,502 పనులు గుర్తించారు. ఇప్పటి వరకు 29,414 పనులను మాత్రమే పూర్తి చేశారు. ఒక్కో కుటుంబానికి 48 రోజుల చొప్పున మాత్రమే పని చూపించారు. జిల్లాలో 7,85,225  జాబ్‌కార్డులు ఉండగా.. 15,395 కుటుంబాలకే వంద రోజుల పని కల్పించారు. జిల్లాలో గత ఆరేళ్లుగా అమలు తీరును పరిశీలిస్తే  లక్ష్యంలో సగం పనిదినాలు కూడా చూపించని దుస్థితి నెలకొంది.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ఉపాధి పనులు కల్పించాలని కోరితే తప్పకుండా చూపాల్సిందే. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, సంబంధిత పీఓలపై కఠినంగా వ్యవహరిస్తాం.
– నాగభూషణం, డ్వామా పీడీ

ఆరేళ్లుగా పథకం అమలు తీరిది..
ఏడాది        జాబ్‌కార్డులు    ఒక కుటుంబానికి ఏడాదిలో చూపిన పని దినాల శాతం    వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలు     
2011–12        7,08,405    82.48                78,174    
2012–13        7,30,303    73.11                74,729    
2013–14        7,47,020    64.27                61,617    
2014–15        7,61,069    54.05                41,833    
2015–16        7,81,124    75.74                93,615    
2016–17        7,85,225    48.27 (ఆగస్టు వరకు)    15,395   

Advertisement
 
Advertisement
 
Advertisement