'డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలే'
హైదరాబాద్ : ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును యథావిధిగా నిర్మించాలని, డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలో మీడియాతో శుక్రవారం ఆమె మాట్లాడుతూ... రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు అందించడం సీఎం కె.చంద్రశేఖర్రావుకు ఇష్టం లేనట్టుగా ఉందన్నారు. అందుకోసమే ప్రాణహిత-చేవెళ్లను మెదక్ వరకు పరిమితం చేస్తానని కేసీఆర్ అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కేసీఆర్ మరిచారా అని ఈ సందర్భంగా సబిత ప్రశ్నించారు.
వాటర్ గ్రిడ్ కోసమే ప్రాణహిత - చేవెళ్లను రీ డిజైన్ చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును చేవెళ్ల వరకు చేపట్టాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై వివాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.