తరుగు పేరుతో అవినీతి మెరుగు | Sakshi
Sakshi News home page

తరుగు పేరుతో అవినీతి మెరుగు

Published Tue, Sep 27 2016 10:50 PM

తరుగు పేరుతో అవినీతి మెరుగు - Sakshi

  • సూపర్‌బజార్‌లో దొంగలు పడ్డారు 
  • ఇంటి దొంగలే లక్షలు నొక్కేశారు
  • తరుగు పేరుతో రూ.30 లక్షలు
  • సిట్టింగ్‌ ఫీజుల్లో రూ.10 లక్షలు
  • రికవరీపై మీన‘వేషాలు’
  • అవినితిని బయటపెట్టిన రిజస్ట్రార్‌ నివేదిక
  •  
    సాక్షిప్రతినిధి, కాకినాడ :
    నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో నిత్యావసరాలు అందించాలని స్థాపించిన సూపర్‌ బజారు ఆశయం అపహాస్యంపాలవుతోంది. సంస్థను రక్షించాల్సిన వారే భక్షిస్తుండడంతో ఈ స్థితికి చేరుకుంది. కాకినాడ నడిబొడ్డున మెయిన్‌ రోడ్డులో ఉన్న సూపర్‌ బజార్‌ పరిస్థితి దొంగ చేతికి తాళాలు ఇచ్చిన సామెతను తలపిస్తోంది. సంస్థ పాలకవర్గ సభ్యులే సంస్థను దోచుకుతింటుండడంతో నష్టాలబాట పడుతోంది. నిత్యావసరాల్లో తరుగు, సమావేశాలకు ఫీజులు, బహుమతుల పేరుతో లక్షలు మింగేసిన అడ్డగోలు బాగోతమొకటి ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు నిత్యావసరాలు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో 1964లో వివేకానంద అనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాకినాడ మెయిన్‌ రోడ్డులో సూపర్‌ బజార్‌ను నెలకొల్పారు. పీఆర్‌ కాలేజీకి చెందిన ఆట స్థలాన్ని పిఠాపురం మహారాజా వివేకానందకు అప్పగించారు. ఆ స్థలంలో సూపర్‌ బజార్‌తోపాటు అదనంగా సుమారు 35 దుకాణాలు నెలకొల్పారు. నిత్యావసరాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో బజార్‌ను అభివృద్ధి చేసేవారు.
    కాకినాడలోని ముఖ్యమైన కూడళ్లు రామారావుపేట, రమణయ్యపేట, నాగమల్లితోట జంక్షన్‌లలో ఈ బజార్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో సామాన్యులకు అందుబాటు ధరలతో ఊరటనిచ్చేవి. వ్యవస్థాపకుడు వివేకానంద మృతి చెందాక కూడా పాలకవర్గ సభ్యులు నిజాయితీగా సూపర్‌ బజార్‌ను అభివృద్ధి చేస్తూ వచ్చారు. కాలక్రమంలో పాలకవర్గాల నిర్ణయాలతో గత కొన్నేళ్లుగా లాభాలు పడిపోయి నష్టాల్లో కూరుకుపోతోంది. తక్కువ ధరలకు నిత్యావసరాలు విక్రయించడంతో నష్టాలు వచ్చాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొందరు దొడ్డిదారిన పాలకవర్గంలో ప్రవేశించి కలుషితం చేసి నష్టాలు పాల్జేయడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
     
    తరుగు పేరుతో హస్తలాఘవం...
    సహకార చట్టం ప్రకారం నిత్యావసరాలు తరగు ఐదు శాతం వరకు ఆమోదిస్తారు. కానీ కొందరు పాలకవర్గ సభ్యులు దొరకినిదంతా దోచుకో అనే సిద్ధాంతాన్ని ఇక్కడ పాటిస్తున్నారు. నిత్యావసరాల్లో తరుగు పేరుతో సూపర్‌ బజార్‌కు పాలకవర్గ సభ్యులే కుచ్చుటోపీ పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు బియ్యం, పప్పులు సహా ఇతర నిత్యావసరాలు రవాణా చేసేటప్పుడు కొంత తరుగుదల వస్తుంది. ఎంత పకడ్బందీగా రవాణా చేసినా కొంత తరుగు తప్పదు. ఏ సరుకుకైనా నూటికి ఐదు శాతం తరుగుకు అనుమతి ఉంది. అంతకు మించి తరుగుంటే బాధ్యుల నుంచి ఆ మేరకు రికవరీ చేయాల్సి ఉంది. వాస్తవం ఇలా ఉండగా 2010 నుంచి మూడేళ్లపాటు వరుసగా అనుమతించిన దానికంటే ఎక్కువగా తరుగును సాకుగా చూపించి పెద్ద మొత్తంలో నొక్కేసి సంస్థకు తీవ్ర నష్టానికి కారణమయ్యారంటున్నారు. తరుగుతోపాటు, సూపర్‌బజార్‌ సర్వసభ్య సమావేశాలు, బహుమతులు పేరుతో లక్షలు పక్కదోవపట్టించారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఆరోపణలపై సహకార శాఖ రిజిస్ట్రార్‌ విచారించగా సూపర్‌ బజార్‌లో దొంగలు పడినమాట నిజమేనంటూ అవినీతి గుట్టును రట్టుచేశారు.
     
    అవినీతి తంతిలా...
     2010 నుంచి నాలుగేళ్లపాటు పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని రిజిస్ట్రార్‌ విచారణలో తేలింది. 2010లో రూ.17.65 లక్షలు, 2011లో రూ.3.45 లక్షలు, 2012లో  రూ.4.49 లక్షలు, 2013లో రూ.3.51 లక్షలు దొడ్డిదారిన తరుగు పేరుతో అడ్డంగా మెక్కేశారని తేల్చారు. తరుగు పేరుతో జరిగిన అడ్డగోలు దోపిడీలో సూపర్‌ బజార్‌కు జరిగిన నష్టాన్ని దుర్వినియోగానికి బాధ్యులైన వారి నుంచే రికవరీ చేయాలంటున్నారు. తరుగు పేరుతో జరిగిన అవినీతి భాగోతంలో బాధ్యుల పేర్లు సహకార శాఖ రిజిస్ట్రార్‌ దుర్గాప్రసాద్‌ సూపర్‌బజార్‌కు నివేదించారు.
      తరుగు పేరుతో దోచేసిన కొందరు సభ్యులు సూపర్‌బజార్‌ సమావేశాలు ఏర్పాటుచేసి వాటి పేరుతో దోపిడీకి పాల్పడ్డారనే విమర్శలున్నాయి. సమావేశానికి హాజరైనప్పుడు సభ్యులు అప్పనంగా సిటింగ్‌ ఫీజులు తీసుకొన్నారు. సహకార సంఘాల చట్టం ప్రకారం మూడు నెలలలోపు ఒక సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. సమావేశానికి హాజరయ్యే సభ్యులకు రూ.200 రవాణా ఖర్చులకు ఇస్తారు. ఇదే అదునుగా భావించి పాలకవర్గ సభ్యులు సిటింగ్‌ ఫీజులు తమకు నచ్చిన రీతిలో అడ్డంగా పెంచేసుకుని సూపర్‌బజార్‌ను నష్టాల్లోకి నెట్టేశారంటున్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి నెలకు రూ.200లు ఉన్న సిట్టింగ్‌ ఫీజును ఎకాఎకిన రూ.1000లు వరకు పెంచేసుకున్నారు. అవసరం లేకున్నా నెలకు రెండు సమావేశాలు ఏర్పాటు చేసుకొని సిటింగ్‌ ఫీజు తీసుకున్నారని రిజిస్ట్రార్‌  పరిశీలనలో గుర్తించారు. సహకార సంఘ చట్టానికి, స్ఫూర్తికి విరుద్ధమని విచారణాధికారి తన నివేదికలో పేర్కొన్నారు. అసలు సంస్థ సభ్యులు బహుమతులు తీసుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆ 13 మంది సభ్యులు సిట్టింగ్‌ ఫీజు, బహుమతుల రూపంలో అడ్డగోలుగా రూ.10 లక్షలు దిగమింగేశారని గుర్తించారు. సభ్యులు సాగించిన అవినీతి బండారంపైlవిచారణ నివేదికS ఇటీవలనే సూపర్‌బజార్‌కు చేరింది. దిగమింగిన సొమ్మును తిరిగి బాధ్యుల నుంచే రికవరీ చేసి సూపర్‌ బజార్‌ను బతికించాలని విజ్ఞులు సూచిస్తున్నారు. 
     
    నివేదిక వాస్తవమే...
    ఈ విషయమై సూపర్‌బజార్‌ చైర్మన్‌ ఈఏ నాయుడును ‘సాక్షి’ సంప్రదించగా అక్రమాలపై నివేదిక రావడం వాస్తవమేనన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. చర్యలు విషయం తమకు తెలియదన్నారు.
     
     అవినీతి చక్రం ఇలా...
     2010లో రూ.17.65 లక్షలు 
    2011లో రూ.3.45 లక్షలు 
    2012లో రూ.4.49 లక్షలు 
    2013లో రూ.3.51 లక్షలు స్వాహా... 
     

Advertisement
Advertisement