వడ్డీరేట్లు మరింత దిగొచ్చే చాన్స్... | Sakshi
Sakshi News home page

వడ్డీరేట్లు మరింత దిగొచ్చే చాన్స్...

Published Tue, Jan 27 2015 1:05 AM

వడ్డీరేట్లు మరింత దిగొచ్చే చాన్స్...

ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్
దావోస్: ద్రవ్యోల్బణం తగ్గించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాత్ర హర్షణీయమని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన సుబ్రమణియన్ పీటీఐ వార్తా సంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ధరల కట్టడి ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగితే వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనావేశారు.  ఇటీవల పావు శాతం రెపో రేటు(బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు- ప్రస్తుతం 7.75 శాతం) తగ్గింపు నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే..
* విదేశీ పెట్టుబడిదారులకు భారత్ పన్నుల వ్యవస్థ అదనపు భారం కాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* దేశంలో పెట్టుబడులు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో భూ, కార్మిక చట్టాల వంటి పలు విభాగాల్లో సంస్కరణలు జరగాల్సి ఉంది. ఈ దిశలో ప్రభుత్వం అడుగులేస్తోంది.
* అయితే ఆయా చర్యలను ర్యాంకింగ్ కోణంలో ప్రపంచ బ్యాంక్ ఎలా చూస్తుందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. అయితే తీసుకుంటున్న సంస్కరణల వల్ల వాస్తవిక కోణంలో పెట్టుబడులు రానున్న కాలంలో మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నాం.
 
కరెంట్ అకౌంట్ మిగులు: మోర్గాన్ స్టాన్లీ
భారత్ ఆర్థిక వ్యవస్థకు 2015లో కలిసి వస్తున్న ప్రధాన అంశం కరెంట్ అకౌంట్  అని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది కరెంట్ అకౌంట్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పరిమాణంతో పోల్చితే 0.3% మిగులు కనబడే అవకాశం ఉందని అంచనావేసింది. గడచిన పదేళ్ల నుంచీ లోటుతో ఉన్న భారత్ కరెంట్ అకౌంట్, స్వల్పంగా మిగులులోకి రావడం హర్షణీయ అంశమని పేర్కొంది. విదేశాలతో భారత్ వాణిజ్యం మెరగుపడ్డం, అంతర్జాతీయ కమోడిటీ ధరలు ప్రత్యేకంగా చమురు ధర భారీ పతనం దీనికి కారణమని తన తాజా పరిశోధనా పత్రంలో వివరించింది.  దీనివల్ల ఆర్‌బీఐ పాలసీ రేట్లు కూడా దిగొచ్చే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement