‘ఓలా’లా..! | Ola Foods Has Plans For Its Khichdi Experiment | Sakshi
Sakshi News home page

‘ఓలా’లా..!

Published Wed, Nov 13 2019 5:57 AM | Last Updated on Wed, Nov 13 2019 5:57 AM

Ola Foods Has Plans For Its Khichdi Experiment - Sakshi

బెంగళూరు: ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ఓలా... ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్‌ బ్రాండ్స్‌నూ ప్రవేశపెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో వీటిని లిస్ట్‌ చేయడంతో పాటు సొంతంగా రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లు, ఫుడ్‌ ట్రక్కులు, చిన్నపాటి కియోస్క్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భోజనం మొదలుకుని బిర్యానీలు, డెసర్ట్‌లు.. ఇలా అన్ని రకాల ఆహారాలకు సంబంధించి ప్రత్యేక బ్రాండ్స్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది.

తద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు.. పట్టణాల్లో కస్టమర్లకు మరింత చేరువ కావాలనేది ఓలా వ్యూహం. ‘గతంలో హోటళ్లలో భోజనం చేయడమనేది ఎప్పుడో ఒకసారిగా ఉండేది. ప్రస్తుతం ఇది రోజువారీ వ్యవహారంగా మారిపోతోంది. కాబట్టి ఆహార వ్యాపారం, సరఫరా వంటివి కూడా దానికి అనుగుణంగానే మారాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరొందిన ఫుడ్‌ బ్రాండ్స్‌ కొన్నే ఉన్నాయి. అందుకే ఈ రంగంలో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించాం‘ అని ఓలా ఫుడ్‌ విభాగం సీఈవో ప్రణయ్‌ జీవ్‌రాజ్‌కా పేర్కొన్నారు. తమ ఆహార బ్రాండ్స్‌తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు.

’కిచిడీ ఎక్స్‌పెరిమెంట్‌’..: ఆహార వ్యాపార విభాగంలోకి విస్తరించే క్రమంలో ’కిచిడీ ఎక్స్‌పెరిమెంట్‌’ పేరిట ఓలా సొంత బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాల్లో కిచిడీ వంటకంలో సుమారు 16 వెరైటీలు అందిస్తోంది.  రుచికరమైన కిచిడీని వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారనే ఉద్దేశంతో ముందుగా దీన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. ఓలాకు ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో 50 దాకా కిచెన్స్‌ ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో కార్యకలాపాలను 80పైగా నగరాలకు విస్తరించాలని ఓలా నిర్దేశించుకుంది.

రాణించని ఫుడ్‌పాండా....
ఇతర వ్యాపారాల్లోకి విస్తరించే వ్యూహంలో భాగంగా.. ఫుడ్‌ డెలివరీ సేవలందించే ఫుడ్‌పాండాకు చెందిన భారత వ్యాపార విభాగాన్ని 2017 డిసెంబర్‌లో ఓలా కొనుగోలు చేసింది. దీనిపై 200 మిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించింది. ఫుడ్‌ డెలివరీ సేవలందిస్తున్న ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో.. భారీగా వ్యయాలు చేసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో దీన్నుంచి ఫలితాలు రాబట్టలేకపోయింది. ఫుడ్‌ డెలివరీ సేవలతో పాటు.. మరింత రుచికరమైన ఆహారానికి కూడా డిమాండ్‌ ఉందన్న సంగతిని ఈ క్రమంలోనే గుర్తించింది. అందుకే డెలివరీతో పాటు ఆహార వ్యాపారంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తోంది.

భారీగా  క్లౌడ్‌ కిచెన్‌లు..
ఇటీవల క్లౌడ్‌ కిచెన్లు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీలు, ఇన్వెస్టర్లు వీటిపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు ఫాసూస్, బెహ్రూజ్‌ బిర్యానీ వంటి బ్రాండ్స్‌ను రూపొందించిన ముంబై సంస్థ రెబెల్‌ ఫుడ్స్‌కు దేశీయంగా మొత్తం 18 నగరాల్లో 205 క్లౌడ్‌ కిచెన్స్, 1,600 ఆన్‌లైన్‌ రెస్టారెంట్స్‌ ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో సుమారు 500 క్లౌడ్‌ కిచెన్స్‌ స్థాయికి చేరాలని కంపెనీ నిర్దేశించుకుంది. రెబెల్‌ పోర్ట్‌ ఫోలియోలో మాండరిన్‌ ఓక్, ఓవెన్‌ స్టోరీ, స్వీట్‌ ట్రూత్‌ వంటి ఇతర బ్రాండ్లూ ఉన్నాయి.

మరోవైపు, బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్విగ్గీ కూడా హైదరాబాద్‌ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో స్విగ్గీ యాక్సెస్‌ పేరిట తమ క్లౌడ్‌ కిచెన్స్‌ను విస్తరిస్తోంది. స్విగీ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న పలు రెస్టారెంట్లు .. ఇతర ప్రాంతాల్లో తమ శాఖలను ఏర్పాటు చేయలేకపోయినా.. డిమాండ్‌ ఉన్న వంటకాలను అందించేందుకు, కస్టమర్లను సంపాదించుకునేందుకు ఈ క్లౌడ్‌ కిచెన్స్‌ ఉపయోగకరంగా ఉంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement