
ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్
ప్రతిపక్షంగా తాము ప్రజావాణిని వినిపిస్తామని శాసనసభలో ప్రధాన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ప్రతిపక్షంగా తాము ప్రజావాణిని వినిపిస్తామని శాసనసభలో ప్రధాన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన శుక్రవారం సభలో మాట్లాడుతూ సభలో ఉన్నవి రెండు పార్టీలు మాత్రమేనని, స్పీకర్ అధికార పార్టీ సభ్యుడిగా కాకుండా ప్రతిపక్షానికి కూడా మద్దతుగా ఉండాలన్నారు. శాసనసభలో సుదీర్ఘ అనుభవం కలిగిన కోడెల శివప్రసాదరావు పేరును ప్రతిపాదించినప్పుడు తాము ఒక్క నిమిషం కూడా సందేహించకుండా మద్దతు ఇచ్చామని తెలిపారు.
పాలక పక్షం, ప్రతిపక్షం ప్రజాస్వామ్యం అనే బండికి స్పీకర్ ఇరుసు లాంటివారు అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే బేధం లేకుండా సమదృష్టితో వ్యవహరించాలని ఆయన...స్పీకర్ను కోరారు. ఈ సందర్భంగా లోక్ సభ తొలి స్పీకర్ మౌలంకర్ చేసిన వ్యాఖ్యలను జగన్ కోట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా కోడెల భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు.
కొత్త రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని ,వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకు రావడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని, దానికి స్పీకర్ అవకాశం ఇవ్వాలని జగన్ కోరారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలపై జగన్ మాట్లాడుతూ భవిష్యత్లో ఎవరు అధికారంలో ఉండాలో దేవుడే తేలుస్తాడని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.