టీడీపీ సేవకు డ్వాక్రా! | Sakshi
Sakshi News home page

టీడీపీ సేవకు డ్వాక్రా!

Published Sun, Dec 2 2018 4:05 AM

Womens are losing DWCRA support at the elderly age - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: డ్వాక్రా సంఘాలను అధికార పార్టీ సానుభూతిపరులతో నింపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. 60 ఏళ్లు దాటిన డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి బలవంతపు తీర్మానాల ద్వారా తప్పిస్తూ ఆ స్థానంలో తనకు అనుకూలమైన వారిని చేర్చుకునే కార్యక్రమానికి తెర తీసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 కోట్ల కుటుంబాలు, 3.60 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరందరినీ అధికార పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసేందుకు ప్రతి 100 మంది ఓటర్లకు ఆర్టీజీఎస్‌ ఆధ్వర్యంలో ఓ ఇన్‌చార్జిని నియమించారు. ఆ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో పనిచేయాలంటూ డ్వాక్రా మహిళలపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు పలువురు మహిళలు నిరాకరిస్తున్నారు. దీంతో వీరిని తొలగించి తమవారిని నియమించుకునే ఎత్తుగడ వేశారు. దీన్ని అమలు చేయటంలో భాగంగా 60 ఏళ్లు దాటిన డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి తప్పించాలనే అంశాన్ని సర్కారు తెరపైకి తెచ్చింది. వీరి స్థానంలో తమకు అనుకూలమైనవారిని, టీడీపీ అనుబంధ సంఘాలకు చెందినవారిని, నేరుగా తమ మనుషులను సంఘాల్లో నియమించుకోవాలని సర్కారు ఎత్తుగడ వేసింది.    

కుప్పకూలుతున్న డ్వాక్రా వ్యవస్థ
వయసు పైబడినా క్రియాశీలంగా ఉంటూ చిరు వ్యాపారాలతో తమ కాళ్ల మీద నిలబడుతున్న మహిళలను సైతం సంఘాల నుంచి సర్కారు తొలగిస్తోంది. ఇది వయో వృద్ధులైన 35 లక్షల మంది డ్వాక్రా మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎన్నో ఏళ్లుగా డ్వాక్రా వ్యవస్థకు ఆసరాగా నిలిచిన మహిళలను సంఘాల నుంచి బలవంతంగా తొలగిస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బ్యాంకులపై నెపం వేస్తూ రాష్ట్రంలో 35 లక్షల మంది డ్వాక్రా మహిళలను తొలగించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. 

పొదుపు సంఘాల మహిళలతో సర్కారు ప్రచారం..
తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధిగమించేందుకు అడ్డదారులు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 9.32 లక్షల డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 95 లక్షల మంది పొదుపు మహిళలతో అధికార పార్టీకి అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహిస్తోంది. వయోభారం తదితర కారణాలతో తమకు సహకరించని డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. 

సీఎం సభలు, టీడీపీ కార్యక్రమాలకు కచ్చితంగా రావాల్సిందే..
రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ (ఆర్‌టీజీఎస్‌) పర్యవేక్షణలో డ్వాక్రా మహిళల తొలగింపు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికార పార్టీ వ్యూహాన్ని రచించింది. ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జ్‌ని నియమించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలన్నది ప్రణాళిక. ఆ ఇన్‌చార్జ్‌కు స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించాలని అనధికారికంగా హుకుం జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే సభలకు తప్పనిసరిగా హాజరు కావడంతోపాటు ఇతర టీడీపీ కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేసింది. 

పరోక్షంగా వేటు..
టీడీపీకి అనుకూలంగా ఆర్టీజీఎస్‌ పర్యవేక్షణలో పనిచేసే ఇన్‌చార్జ్‌ల వెంట ఇంటింటికి తిరిగేందుకు పలువురు డ్వాక్రా మహిళలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. గంటల తరబడి జాప్యంతో జరిగే సీఎం చంద్రబాబు సమావేశాలకు హాజరుకావడం కూడా వారికి ఎంతో ఇబ్బందిగా పరిణమించింది. దీంతో తమకు అనుకూలంగా ఉండేలా విధివిధానాలను సర్కారు అనధికారికంగా రూపొందించింది. మొదట వయో వృద్ధులైన డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుంది. 60 ఏళ్లు దాటిన సభ్యులను డ్వాక్రా సంఘాల నుంచి వెంటనే తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారి స్థానాల్లో కొత్తగా టీడీపీకి చెందిన వారు, పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసే వారిని సభ్యులుగా చేర్చాలని మౌఖిక ఆదేశాల ద్వారా స్పష్టం చేసింది. నేరుగా ప్రభుత్వం తొలగిస్తున్నట్టు కాకుండా ఇతర మార్గాల ద్వారా వారిపై వేటు వేయాలని ఆదేశించారు.

బ్యాంకులపై నెపం మోపి బలవంతపు తీర్మానాలు..
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వృద్ధులైన డ్వాక్రా మహిళలను తొలగించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. బ్యాంకులపై నెపం మోపి 60 ఏళ్లు దాటిన మహిళలను డ్వాక్రా సంఘాల నుంచి తొలగించాలని ఎత్తుగడ వేశారు. 60 ఏళ్లు దాటిన మహిళలు రుణాలను సక్రమంగా చెల్లించలేకపోతున్నారనే వాదనను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద వయసు మహిళలను తొలగించి వారిస్థానంలో కొత్త సభ్యులను చేర్చుకుంటున్నట్లు తీర్మానాలు చేయాలని సంఘాలకు సూచించారు. లేదంటే ఆ సంఘాలకు రుణాలు రావని తెగేసి చెప్పారు. జనవరి నుంచి డ్వాక్రా మహిళల ద్వారా విస్తృతంగా ప్రభుత్వ, పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రచారం చేయాలనేది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకే 60 ఏళ్లు దాటిన వారందర్నీ డిసెంబరు ఆఖరుకు తొలగించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నా సరే...
రాజకీయ కోణంలో టీడీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో 35 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని దెబ్బతీస్తోంది. వారిని తొలగిస్తే కానీ రుణాలు ఇవ్వరాదని ప్రభుత్వం చెప్పడంపై డ్వాక్రా సంఘాలు విస్తుపోతున్నాయి. డ్వాక్రా  సంఘాల్లో సభ్యులుగా ఉన్న 60 ఏళ్లు దాటిన మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. పాలవ్యాపారం, కిరాణా వ్యాపారం, చేతివృత్తులు, అప్పడాలు తయారీ వంటివాటితో ఉపాధి పొందుతున్నారు.  సక్రమంగా బ్యాంకు రుణాలు కూడా తీరుస్తున్నారు. టీడీపీ సర్కారు తమవారిని నియమించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద వయసు మహిళలను సంఘాల నుంచి తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. 

విధిలేక వేటేస్తున్న సంఘాలు...
విధిలేని పరిస్థితుల్లో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించే ప్రక్రియను డ్వాక్రా సంఘాలు చేపట్టాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 9.30 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 7.31 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో దాదాపు 95 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 60 ఏళ్లు దాటిన వారు  ముగ్గురు నలుగురు సభ్యులున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన డ్వాక్రా సంఘాల సభ్యులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు.  ప్రభుత్వ ఆదేశాలతో వారందర్నీ డిసెంబర్‌ ఆఖరునాటికి తొలగింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

ఆసరా కోల్పోయి అల్లాడుతున్న మహిళలు....
ప్రభుత్వ అమానవీయ చర్యతో 35 లక్షలమంది డ్వాక్రా మహిళలు  ఆసరా  కోల్పోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న తాము డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారాలు, ఇతరత్రా వృత్తులతో ఉపాధి పొందుతున్నామని పేర్కొంటున్నారు. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావటం లేదని తమను తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. 

తొలగించే నిబంధన ఏదీ లేదు
నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటితే మహిళలకు డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం కల్పించవచ్చు. అయితే తొలగింపుపై నిర్దిష్ట వయో పరిమితి ఏదీ డ్వాక్రా నిబంధనల్లో లేదు. అయినప్పటికీ దీన్ని పట్టించుకోకుండా సర్కారు తన రాజకీయ అవసరాలకు ఉపయోగపడటం లేదనే అక్కసుతో 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల నుంచి తొలగిస్తుండటం గమనార్హం. తన చేతికి మట్టి అంటకుండా బలవంతంగా సంఘాలతో తీర్మానం చేయిస్తూ లక్షల మంది మహిళలను తొలగిస్తోంది. గత ఆరేడు నెలలుగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్కారు తీరుపై కొందరు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు అందకున్నా పొదుపు మొత్తాలతో సంఘాల్లో సభ్యులుగా కొనసాగేలా అనుమతించాలని సూచిస్తున్నారు.  

బకాయిలు లేకుండా అప్పు తీర్చినా...
నాకు 60 ఏళ్లు. ఎన్నో ఏళ్లుగా విస్సన్నపేట డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నా. కొద్ది  నెలలుగా నేను సంఘం అప్పు గురించి అడుగుతుంటే లీడర్లు సమాధానం చెప్పడం లేదు. గట్టిగా అడిగితే అసలు విషయం చెప్పారు. నన్ను సంఘం నుంచి తొలగిస్తేనే రుణం ఇస్తామని అధికారులు చెప్పారట. నేను పొదుపు సక్రమంగా కడుతూ, బకాయిలు లేకుండా అప్పులు చెల్లించా. అయినా సరే నన్ను సంఘం నుంచి తొలగించారు. నా భర్త చనిపోయినందున వితంతు పెన్షను కోసం దరఖాస్తు చేస్తే అదీ మంజూరు కాలేదు. డ్వాక్రా గ్రూపు ఆసరా లేక, పెన్షను అందక వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. మందులు కొనుక్కోడానికి కూడా డబ్బు లేక అవస్థ పడుతున్నా.
– కందుల భారతి (విస్సన్నపేట, తిరువూరు మండలం, కృష్ణా జిల్లా) 

అన్యాయంగా తొలగించారు..
లక్ష్మీమాతా డ్వాక్రా సంఘంలో ఎన్నో ఏళ్లుగా సభ్యురాలిగా ఉన్నా. బ్యాంకు అప్పు ఎప్పటికప్పుడు తీరుస్తూనే ఉన్నా. ఇన్నేళ్లలో రుణం చెల్లించకపోవడం అన్నదే లేదు. ఇప్పుడు హఠాత్తుగా నన్ను సంఘం నుంచి తొలగించేశారు. 60 ఏళ్లు దాటినవారిని తొలగిస్తున్నాం అని చెప్పారు. నేను ఆరోగ్యంగా ఉన్నా. చిరువ్యాపారం చేసుకుంటూ రుణాలు సక్రమంగా తీరుస్తున్నా అకారణంగా తొలగించారు. డ్వాక్రా రుణం ఇచ్చేముందు నన్ను తొలగించడం బాధేసింది. ఎవరి మీదా ఆధారపడకుండా బతుకుతున్న నేను ఉన్న ఆధారం కోల్పోయి ఇతరుల మీద ఆధార పడాల్సిన దుస్థితి వచ్చింది. 
– రాజులపాటి వెంకటేశ్వరమ్మ(మండవల్లి, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా)

Advertisement
 
Advertisement
 
Advertisement